Mark Antony OTT Release: ఓటీటీలో విశాల్‌ ‘మార్క్‌ ఆంటోనీ’.. స్ట్రీమింగ్‌ డేట్‌ లాక్‌!

Mark Antony OTT Release date: విశాల్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించిన ‘మార్క్‌ ఆంటోనీ’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 10 Oct 2023 17:06 IST

హైదరాబాద్‌: విశాల్‌ (Vishal) కథానాయకుడిగా అదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony).  గత 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ఏకంగా రూ.100కోట్ల వసూళ్లను రాబట్టింది. విశాల్‌, ఎస్‌జే సూర్యల నటన ప్రేక్షకులను అలరించింది. మరీ ముఖ్యంగా జాకీ మార్తాండ పాత్రలో ఎస్‌జే జీవించారు. తాజాగా ఈ సినిమా (mark antony ott release date) ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబరు 13వ తేదీ నుంచి ‘మార్క్‌ ఆంటోనీ’ స్ట్రీమింగ్‌ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తెలిపింది.

రివ్యూ: మార్క్‌ ఆంటోనీ.. విశాల్‌, ఎస్‌జే సూర్య టైమ్‌ ట్రావెల్‌ మూవీ మెప్పించిందా?

కథేంటంటే: ఆంటోని (విశాల్‌) శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌. 1975లో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో చనిపోతాడు. దీంతో ఆయన కొడుకు మార్క్‌ (విశాల్‌)ను ప్రాణ మిత్రుడైన జాకీ మార్తాండ (ఎస్‌.జె.సూర్య) చేరదీసి.. కన్న కొడుకులా పెంచి పెద్ద చేస్తాడు. అయితే మార్క్‌కు తండ్రి ఆంటోని అంటే చంపేయాలనుకునేంత పగ. తన తల్లిని చంపడమే దానికి కారణం. మరోవైపు ఆంటోని కొడుకు అవడం వల్ల సమాజంలోనూ రోజూ అనేక అవమానాలు ఎదుర్కొంటుంటాడు మార్క్‌. చివరికి రమ్య (రీతూ వర్మ)తో తన ప్రేమకథకు కూడా ఆంటోని పేరు చిక్కులు తీసుకొస్తుంది. దీంతో తన తండ్రిపై పగ రెట్టింపవుతుంది. అయితే అనుకోకుండా ఓరోజు మార్క్‌కు ఓ అరుదైన అవకాశం దొరుకుతుంది. గతంలోని వ్యక్తులతో మాట్లాడగలిగే ఓ టైమ్‌ ట్రావెల్‌ ఫోన్‌ అతనికి దొరుకుతుంది. దీంతో ఆ ఫోన్‌తో తన తండ్రికి ఫోన్‌ చేసి.. కడిగి పారేయాలనుకుంటాడు. అయితే తను ఫోన్‌ మాట్లాడాక తండ్రి గురించి.. తల్లి మరణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. (Mark Antony Movie) దీంతో తన తండ్రిని ఎలాగైనా తిరిగి బతికించాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆంటోని మళ్లీ ఎలా బతికాడు? అసలు అతని గతమేంటి? మార్క్‌ తల్లి చావుకు కారణమెవరు? మార్క్‌ను చేరదీయడం వెనుక జాకీ పన్నిన కుట్ర ఏంటి? ఈ మొత్తం కథలో ఏకాంబరం (సునీల్‌) పాత్రేంటి? అన్నది మిగతా కథ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని