Nayakudu Review: రివ్యూ: నాయకుడు.. తమిళ బ్లాక్‌బస్టర్‌ తెలుగులో మెప్పించిందా?

Nayakudu Review: ఉదయనిధి స్టాలిన్‌, వడివేలు, ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్రల్లో నటించిన ‘నాయకుడు’ చిత్రం ఎలా ఉందంటే?

Updated : 27 Jul 2023 15:55 IST

Nayakudu Review: చిత్రం: నాయకుడు; నటీనటులు: ఉదయనిధి స్టాలిన్‌, వడివేలు, ఫహద్‌ ఫాజిల్‌, కీర్తి సురేశ్‌, లాల్‌, అళగం పెరుమాళ్‌, విజయ్‌ కుమార్‌ తదితరులు; సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌; సినిమాటోగ్రఫీ: థేని ఈశ్వర్‌; ఎడిటింగ్‌: సెల్వ ఆర్‌.కె.; నిర్మాత: ఉదయనిధి స్టాలిన్‌; రచన, దర్శకత్వం: మారి సెల్వరాజ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

కప్పుడు ఒక భాషలో విడుదలై విజయం సాధించిన సినిమాలను స్వల్ప మార్పులు చేసి, మరొక భాషలో రీమేక్‌ చేసేవారు. ఓటీటీ రాకతో నటీనటుల సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. దీంతో హిట్‌ సినిమాలను కాస్త ఆలస్యంగా  డబ్బింగ్‌ చేసి, విడుదల చేస్తున్నారు. అలా ఇటీవల తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘మామన్నన్‌’. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదలైంది. (Nayakudu Review in telugu) గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి వడివేలు, ఉదయ నిధి స్టాలిన్‌, కీర్తి సురేశ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది? (Nayakudu Review) మారి సెల్వరాజ్‌ ఈసారి ఏ అంశాన్ని చర్చించారు?

కథేంటంటే: రామాపురం ప్రాంతానికి చెందిన మహారాజు (వడివేలు) అణగారిన వర్గం నుంచి ఎదిగి ఎమ్మెల్యే అవుతాడు. అతని కుమారుడు రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఉన్నత విద్యను పూర్తి చేసి, స్థానికంగా ఓ మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ సంస్థను నడుపుతుంటాడు. తండ్రి ఎమ్మెల్యే అయినా రఘువీరా తన వృత్తి అయిన పందుల పెంపకాన్ని మానడు. ఓ సంఘటన కారణంగా పదిహేనేళ్లుగా తండ్రీకొడుకులు మాట్లాడుకోవడం మానేస్తారు. మరోవైపు అదే ప్రాంతంలో ఉన్నత వర్గానికి చెందిన రత్నవేలు (ఫహద్‌ ఫాజిల్‌) రాజకీయంగా ఎదగాలని చూస్తుంటాడు. మరి మహారాజు, రఘువీరా మాట్లాడుకోకపోవడానికి కారణం ఏంటి? లీలా (కీర్తిసురేశ్‌) నడిపే శిక్షణా సంస్థను అడ్డుకున్న వారిని ఎదిరించి నిలిచినందుకు రఘువీరాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? (Nayakudu Review in telugu) ఈ క్రమంలో తండ్రీకొడుకులు కలిసి చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: తమిళంలో భిన్నమైన కథలను తెరపై ఆవిష్కరించే దర్శకుల్లో మారి సెల్వరాజ్‌ ఒకరు. ఆయన కథలన్నీ సామాజిక అంశాల చుట్టూ తిరుగుతాయి. ఆధునిక సమాజంలోనూ అణగారిన వర్గాల పట్ల కొనసాగుతున్న వివక్షను ఎత్తి చూపుతూ కథ, కథనాలను తీర్చిదిద్దే తీరు మెప్పిస్తుంది. అలాంటి ఒక సామాజిక సందేశం ఉన్న కథను ‘నాయకుడు’గా తెరపై ఆవిష్కరించి, ప్రేక్షకులను అలరించడంలో మారి సెల్వరాజ్‌ ఓకే అనిపించారు. ఎమ్మెల్యే మహారాజు, అతని కొడుకు రఘువీరా, రాజకీయంగా ఎదగాలనుకునే యువ నేత రత్నవేలు పాత్రలు, వాటి స్వభావాలను సమాంతరంగా పరిచయం చేస్తూ స్క్రీన్‌ప్లే నడిపిన తీరు భిన్నంగా ఉంది. రాజకీయంగా అడుగులు వేస్తున్న రత్నవేలు అహం దెబ్బతింటే ఎంతటి క్రూరుడుగా మారతాడో అతను కుక్కను కొట్టి చంపే సన్నివేశంతో చూపించాడు దర్శకుడు. (Nayakudu Review in telugu) లీలా నడుపుతున్న శిక్షణ సంస్థను ఆపేయాలని బెదిరింపులు రావడంతో అసలు కథ మొదలవుతుంది. లీలా స్నేహితులు వచ్చి రఘువీరాను సాయం అడగటం, అతను తాను మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పుతున్న బిల్డింగ్‌ను లీలాకు ఇవ్వడం తదితర సన్నివేశాలతో కథాగమనం నెమ్మదిగా సాగుతుంది. లీలా శిక్షణ కేంద్రంపై దుండగులు దాడి చేసిన తర్వాతే కథ కీలక మలుపు తిరుగుతుంది. ఆ దాడి చేసింది రత్నవేలు సోదరుడు అని తెలిసి అతని శిక్షణా సంస్థపైనా రఘువీరా, స్నేహితులతో కలిసి దాడికి పాల్పడతాడు. (Nayakudu Review in telugu)  ఈ క్రమంలో విరామ సమయానికి ముందు వచ్చే సీన్‌, ఆ తర్వాత వచ్చే ఫైట్‌ సీక్వెన్స్‌తో ద్వితీయార్ధంపై ఆసక్తి పెరిగేలా చేశాడు దర్శకుడు. అక్కడి నుంచే కథ మొత్తం మహారాజు-రఘువీరా, రత్నవేలు మధ్య నువ్వానేనా అన్నట్లు సాగుతుందేమో అనిపిస్తుంది. కానీ, ఒక రొటీన్‌ పొలిటికల్ డ్రామాతో ద్వితీయార్ధాన్ని చుట్టేశాడు. ఎన్నికల్లో మహారాజు గెలవకుండా రత్నవేలు చేసే ప్రయత్నాలు, తన అనుభవం, కొడుకు రఘువీరా తెలివి తేటలతో మహారాజు వాటిని ఎదుర్కొవడం వంటి సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించే సమయంలో ఉత్కంఠగా సాగాల్సిన సన్నివేశాలు కూడా చాలా కూల్‌గా సాగిపోతాయి. (Nayakudu Review in telugu) తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ముందే ఊహించగలడు. అయితే, కులం, కుట్రపూరిత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు ఇలా పలు అంశాలపై మారి సెల్వరాజు సంభాషణలు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాలు, శాసనసభలో వచ్చే సంభాషలు కాస్త మెప్పిస్తాయి.

ఎవరెలా చేశారంటే: ఉదయనిధి స్టాలిన్‌ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో చివరి సినిమాగా ‘నాయకుడు’లో నటించారు. రఘువీరా పాత్రలో ఈజీగానే చేసుకుంటూ వెళ్లిపోయారు. అభ్యుదయ భావాలు, సమాజంలో అందరికీ సమానత్వం ఉండాలని ఆకాంక్షించే సగటు యువకుడిలో నటించారు. కీర్తి సురేష్‌ పాత్ర అక్కడక్కడా మాత్రమే మెరుపులు మెరిపించింది. (Nayakudu Review in telugu) ఇక ఈ సినిమాకు బలమైన పాత్రలంటే వడివేలు, ఫహద్‌ ఫాజిల్‌. ఎమ్మెల్యే మహారాజుగా వడివేలును సరికొత్తగా ఆవిష్కరించారు మారి సెల్వరాజ్‌. ఆయన నట కెరీర్‌లో ఇదొక భిన్నమైన పాత్ర. సాధారణ కార్యకర్తగా కనిపించే ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన నటన, పిల్లలు చనిపోయిన సమయంలో పడే ఆవేదన ప్రేక్షకుడికి కంటతడి పెట్టిస్తుంది. రత్నవేలు ముందు కూర్చోవడానికి కూడా భయపడే మహారాజు ద్వితీయార్ధంలో అతడికే తుపాకీ చూపించే బెదిరించే సీన్‌ సినిమాకే హైలైట్‌. యువ రాజకీయ నాయకుడు రత్నవేలుగా ఫహద్‌ ఫాజిల్‌ జీవించారు. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిగా, తాను అనుకున్నది సాధించే మొండివాడిగా ఆయన నటన, హావభావాలు కట్టిపడేస్తాయి. మొదట్లో క్రూరుడిగా, బలమైన వ్యక్తిగా ఆ పాత్రను చూపించినా, ద్వితీయార్ధానికి వచ్చేసరికి బలహీన పడిపోయింది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం ఓకే. పాటలన్నీ కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. తేని ఈశ్వర్‌ సినిమాటోగ్రఫీ, సెల్వ ఆర్కే ఎడిటింగ్‌ పర్వాలేదు. (Nayakudu Review in telugu) నిడివి కాస్త ఎక్కువైంది. రచయిత, దర్శకుడు మారి సెల్వరాజ్‌ ఎంచుకున్న కథ కొత్తదేమీ కాదు. కానీ, తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ తీసుకుని, దానికి పొలిటికల్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం ఒక్కటే కాస్త భిన్నం. కానీ, కథాగమనం చాలా నెమ్మదిగా సాగుతుంది. చివరి వరకూ పోటీ ఇవ్వాల్సిన ప్రతినాయకుడి పాత్రను మధ్యలోనే బలహీనపరచడంతో ద్వితీయార్ధం చప్పగా సాగుతుంది. పైగా రెండున్నర గంటల నిడివి. టైమ్‌ పాస్‌ కోసం ఒక పొలిటికల్‌ థ్రిల్లర్‌ చూడాలనుకుంటే ‘నాయకుడు’ ప్రయత్నించవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + వడివేలు, ఫహద్‌ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్‌ల నటన
  • + ప్రథమార్ధం
  • + పతాక సన్నివేశాలు
  • బలహీనతలు
  • - అనవసరమైన రిఫరెన్స్‌ సీన్స్‌
  • -  ద్వితీయార్ధం
  • చివరిగా:  సాదాసీదా ‘నాయకుడు’ (Nayakudu Review in telugu)
  • గమనిక: ఈ  సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని