NTR 31: ‘ఎన్టీఆర్‌ 31’ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌.. అదేంటంటే?

‘ఎన్టీఆర్‌ 31’ అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయన ఏ అప్‌డేట్‌ గురించి మాట్లాడారంటే....

Published : 16 Aug 2022 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఎన్టీఆర్‌ (NTR)తో ‘కేజీయఫ్‌’ (KGF) ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఓ చిత్రం తెరకెక్కించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. #NTR31 పేరు (వర్కింగ్‌ టైటిల్‌)తో ఈ ప్రకటన వెలువడటమే ఆలస్యం ఎన్టీఆర్‌ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రశాంత్‌ నీల్‌ ఓ అప్‌డేట్‌ని పంచుకున్నారు. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే ప్రశ్న మీడియా నుంచి తనకు ఎదురవగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో మొదలవుతుందని తెలిపారు. తన సొంతూరు నీలకంఠాపురం (అనంతపురం జిల్లా)లోని దేవస్థానాన్ని ఆయన సోమవారం సందర్శించారు. దర్శనం అనంతరం మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘ఎన్టీఆర్‌తో మీరు తీయబోయే సినిమా గురించి చెప్పండి’ అని ఓ విలేకరి అడగ్గా ‘కథ చెప్పాలా’ అంటూ ప్రశాంత్‌ నవ్వులు పూయించారు. తర్వాత షూటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

తన రెండో సినిమా ‘కేజీయఫ్‌ 1’తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల ‘కేజీయఫ్‌ 2’తోనూ తన సత్తా చాటారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘సలార్‌’ (Salaar) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రుతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా 2023 సెప్టెంబరు 28న విడుదల కానుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో (RRR) బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమాకి #NTR30 అనేది వర్కింగ్‌ టైటిల్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని