Ram charan: ఉపాసన చెప్పినట్లు నేను వినాలనుకుంటున్నా: రామ్‌ చరణ్‌

రామ్‌ చరణ్‌-ఉపాసన తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Updated : 29 Dec 2023 16:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటి వరకు ఉపాసన తన మాట వింటూ వచ్చారని.. ఇప్పుడు ఆమె చెప్పింది వినే సమయమొచ్చిందని రామ్ చరణ్ (Ram Charan) అన్నారు. గతవారం ముంబయిలో సందడి చేసిన వీళ్లిద్దరూ ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఒకరి గురించి ఒకరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

‘నేను సినిమా సెట్‌కు గంట ముందే చేరుకుంటా. త్వరగా మొదలు పెట్టి.. త్వరగా పూర్తి చేయాలనుకుంటా. గత వారం రోజుల నుంచి 16 గంటలు షూటింగ్‌లోనే ఉంటున్నా. అలా కష్టపడడం నాకెంతో ఇష్టం. నా కెరీర్‌లో కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ఆ సమయంలో ఉపాసన ఎంతో ధైర్యాన్నిచ్చింది. నేను చెప్పే ప్రతి మాట వినేది. ఇప్పుడు ఆమె చెప్పినట్లు నేను వినే సమయం వచ్చిందనుకుంటున్నా. తాను సినీ నేపథ్యము లేని కుటుంబం నుంచి వచ్చినా మా ఫ్యామిలీలో పూర్తిగా కలిసిపోయింది. ఎంతో అర్థం చేసుకునే స్వభావం. సినిమాల విషయంలో మాత్రం మా ఇద్దరి అభిరుచులు వేరుగా ఉంటాయి. ఆమె యశ్‌ చోప్రాకు అభిమాని. ఆమెకు రొమాంటిక్‌ సినిమాలంటే ఇష్టం. వివాహబంధం సాఫీగా సాగాలంటే సహనం, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అలాగే వివాహవ్యవస్థపై గౌరవం ఉండాలి’ అని రామ్ చరణ్ చెప్పారు.

ఇక ఉపాసన (Upasana) ఈ ఇంటర్వ్యూలో తన చిన్నతనాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నా చిన్నతనంలో మా తాతగారితో కలిసి అపోలో ఆస్పత్రిలో తిరుగుతూ ఉండేదాన్ని. అవి నాకు దేవాలయాలతో సమానం. సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. అలా చేయకపోతే ఈ జన్మకు సార్థకత ఉండదని నా అభిప్రాయం. ఏ బంధమైనా హాయిగా ఉండాలంటే ఇద్దరిలోనూ అర్థం చేసుకునే గుణం ఉండాలి’’ అని చెప్పారు.

ఇక ఉపాసన-రామ్‌ చరణ్‌ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారని చిరంజీవి (Chiranjeevi) తెలిపారు. ఇద్దరూ పరస్పరం ఆలోచనలను పంచుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. ఉపాసనకు రామ్‌ చరణ్‌ ఎంతో సపోర్ట్‌గా ఉంటాడని అలాగే ఆమె తన వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని ఎంతో చక్కగా బ్యాలెన్స్‌ చేసుకునే తీరు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని