Rangabali review: రివ్యూ: రంగబలి.. నాగశౌర్య ఖాతాలో హిట్‌ పడిందా?

Rangabali review in telugu: నాగశౌర్య, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించిన ‘రంగబలి’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 07 Jul 2023 06:35 IST

Rangabali review: చిత్రం: రంగ‌బ‌లి; న‌టీన‌టులు: నాగశౌర్య,యుక్తి తరేజ,గోపరాజు రమణ, షైన్ టామ్ చాకో, సత్య, శరత్ కుమార్, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, అనంత్ శ్రీరామ్‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, భ‌ద్ర‌మ్, బ్ర‌హ్మాజీ, స‌ప్త‌గిరి త‌దిత‌రులు;  సంగీతం: ప‌వ‌న్ సిహెచ్‌; ఛాయాగ్ర‌హ‌ణం: దివాక‌ర్ మ‌ణి, వంశీ ప‌చ్చిపులుసు; ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: ప‌వ‌న్ బాసంశెట్టి; నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి; విడుద‌ల తేదీ: 07-07-2023

మ‌న‌సును హ‌త్తుకునే ప్రేమ‌క‌థ‌లైనా.. స‌ర‌దాగా సాగే రొమాంటిక్ యాక్ష‌న్‌ ఎంట‌ర్‌టైనర్‌లైనా నాగ‌శౌర్య‌కు చ‌క్క‌గా స‌రిపోతాయి. అతడికి ఎక్కువ విజ‌యాలు అందించిన‌వి.. ప్రేక్ష‌కుల్లో ల‌వ‌ర్‌బాయ్ గుర్తింపు తెచ్చిపెట్టిన‌వి ఈత‌ర‌హా చిత్రాలే. అయితే ఈ మ‌ధ్య ఆయ‌న కొత్త‌ద‌నం అందించే ప్ర‌య‌త్నంలో ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేశారు. కానీ,  ఏవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేదు. దీంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా కొత్త ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ బాసంశెట్టితో క‌లిసి ‘రంగ‌బ‌లి’ని (Rangabali review) తీసుకొచ్చారు శౌర్య‌. ప్ర‌చార చిత్రాలు.. ప్ర‌చార కార్య‌క్ర‌మాలు వినోదాత్మ‌కంగా సాగ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ సినిమా అందుకుందా? ఈ చిత్రంతో నాగ‌శౌర్య మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారా?

క‌థేంటంటే: శౌర్య (నాగ‌శౌర్య‌)కు త‌న ఊరు రాజ‌వ‌రం అంటే పిచ్చి ప్రేమ‌. అదే త‌న బ‌లం.. బ‌ల‌హీన‌త‌. ఏదేమైనా స‌రే సొంతూరులోనే కింగులా బ‌త‌కాలి అనుకుంటాడు. తను ఏం చేసినా ప‌ది మంది చూపు త‌న‌పైనే ఉండాల‌ని అనుకుంటాడు. ఇందుకోసం అప్పుడ‌ప్పుడు కాస్త షో చేస్తుంటాడు. అందుకే త‌న ఫ్రెండ్స్ అత‌న్ని షో అని పిలుస్తుంటారు. శౌర్య తండ్రి విశ్వం (గోప‌రాజు ర‌మ‌ణ‌) ఊళ్లోనే మెడిక‌ల్ షాపు నిర్వ‌హిస్తూ గౌర‌వంగా జీవిస్తుంటాడు. త‌న కొడుక్కు ఆ షాపు బాధ్య‌త అప్ప‌గించాల‌న్నది ఆయ‌న కోరిక‌. అయితే శౌర్య మాత్రం ఊళ్లో గొడ‌వ‌లు పెట్టుకుంటూ.. సొంత షాపులోనే చిల్ల‌ర దొంగ‌త‌నాలు చేస్తూ స‌ర‌దాగా బ‌తికేస్తుంటాడు. (Rangabali review) అత‌న్ని దారిలో పెట్టాల‌న్న ఉద్దేశంతో బ‌ల‌వంతంగా వైజాగ్ పంపిస్తాడు విశ్వం. అక్క‌డ తండ్రి కోరిక మేర‌కు ఫార్మ‌సీ ట్రైనింగ్ కోసం ఓ మెడిక‌ల్ కాలేజీలో చేర‌తాడు శౌర్య‌. అక్క‌డే స‌హ‌జ (యుక్తి త‌రేజ‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. వీళ్ల ప్రేమ‌కు స‌హ‌జ తండ్రి (ముర‌ళీ శ‌ర్మ‌) తొలుత అంగీకారం తెలిపినా.. శౌర్య‌ది రాజ‌వ‌రం అని తెలిసి పెళ్లికి అడ్డు చెబుతాడు. దీనికి కార‌ణం ఆ ఊర్లోని రంగ‌బ‌లి సెంట‌ర్‌. మ‌రి ఆ సెంట‌ర్ క‌థేంటి? (Rangabali review in telugu) దానికి రంగ‌బ‌లి అన్న పేరు ఎందుకొచ్చింది? ఈ సెంట‌ర్‌కు ముర‌ళీ శ‌ర్మ‌కూ. ఆ ఊర్లోని ఎమ్మెల్యే ప‌ర‌శురామ్ (షైన్ టామ్‌ చాకో)కు ఉన్న సంబంధం ఏంటి? ఈ సెంట‌ర్ పేరు మార్చి.. త‌న ప్రేమ‌ను పెళ్లి పీట‌లెక్కించేందుకు శౌర్య ఏం చేశాడు? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: చావైనా.. బ‌తుకైనా సొంతూరులో సింహంలా బ‌త‌కాల‌ని ఆశ‌ప‌డే ఓ కుర్రాడి క‌థ ఇది. అయితే ఆ కుర్రాడి ప్రేమ క‌థ‌కు ఆ ఊరిలోని ఓ సెంట‌ర్ వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదురైతే ఏం చేశాడు?దాని పేరు మార్చేందుకు అత‌నెంత దాకా వెళ్లాడు? ఈ క్ర‌మంలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర్కొన్నాడు? అన్న‌ది క్లుప్తంగా ఈ చిత్ర క‌థాంశం. (Rangabali review in telugu) ఈ క‌థ ప్ర‌ధ‌మార్ధ‌మంతా ఫ‌న్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా సాగితే.. ద్వితీయార్ధం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లా సీరియ‌స్‌గా న‌డుస్తుంది. శౌర్య పాత్ర వ్య‌క్తిత్వాన్ని.. ఊరితో త‌న‌కున్న అనుబంధాన్ని ప‌రిచ‌యం చేస్తూ వ‌చ్చే ఆరంభ స‌న్నివేశాలు స‌ర‌దాగా ఉంటాయి. వినాయ‌కుడి విగ్ర‌హం కోసం ప‌క్క ఊరి కుర్ర గ్యాంగ్‌తో ఫైట్‌కు దిగ‌డం.. ఆ వెంట‌నే ఓ ఇంట్ర‌డ‌క్ష‌న్ పాట‌తో సినిమా కాస్త రొటీన్‌గా మారిన‌ట్లు అనిపిస్తుంది. అంత‌లోనే స‌త్య పాత్ర‌ను తీసుకొచ్చి వినోదం పంచే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఇది బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. నిజానికి ప్ర‌ధ‌మార్ధానికి స‌త్య కామెడీనే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. అలాగే శౌర్య‌కు.. త‌న తండ్రికి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా ఫ‌న్నీగా ఉంటాయి. శౌర్య వైజాగ్‌కు వెళ్లిన‌ప్ప‌టి నుంచి క‌థ‌లో వినోదం డోసు మ‌రింత పెరుగుతుంది.(Rangabali review) స‌హ‌జ‌ను శౌర్య తొలి చూపులోనే ఇష్ట‌ప‌డ‌టం.. ఆమెకు ద‌గ్గ‌ర‌య్యేందుకు అత‌ను చేసే ప్ర‌య‌త్నాలు కొత్త‌గా ఏమీ అనిపించ‌వు. నిజానికి వీళ్ల ప్రేమ‌క‌థ‌లో పెద్ద ఫీల్ క‌నిపించ‌దు. కానీ, మ‌ధ్య‌లో స‌త్య పాత్ర పంచే వినోదం చ‌క్కటి కాల‌క్షేపాన్ని అందిస్తుంది. విరామానికి ముందు ఓ చ‌క్క‌టి ట్విస్ట్‌తో అస‌లు క‌థను ఆరంభించిన తీరు మెప్పిస్తుంది.

ప్ర‌ధ‌మార్ధ‌మంతా స‌ర‌దాగా సాగిన క‌థ‌.. ద్వితీయార్ధం మొద‌ల‌వ‌గానే ఒక్క‌సారిగా సీరియ‌స్ మూడ్‌లోకి మారిపోతుంది. రంగ‌బ‌లి సెంట‌ర్ పేరు మార్చ‌డం కోసం శౌర్య చేసే కొన్ని ప్ర‌య‌త్నాలు న‌వ్వులు పంచ‌గా.. మ‌రికొన్ని సిల్లీగా అనిపిస్తాయి. ఈ పేరు మార్చాల‌నే క్ర‌మంలో శౌర్య‌కు ఊరి ఎమ్మెల్యేకు మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ మొద‌లవ్వ‌డంతో క‌థ కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఇక రంగ‌బ‌లి సెంట‌ర్ వెన‌కున్న అస‌లు క‌థ కాస్త రొటీన్‌గానే అనిపించినా, శ‌ర‌త్‌కుమార్ వ‌ల్ల ఆ ఎపిసోడ్‌కు కాస్త ఊపొస్తుంది. ఆ క‌థ‌ను శౌర్య జీవితంతో ముడిపెట్టిన తీరు బాగుంది.

ఎవ‌రెలా చేశారంటే: స‌ర‌దాగా సాగే ప‌క్కింటి కుర్రాడి త‌ర‌హా పాత్ర‌లు పోషించ‌డం నాగ‌శౌర్య‌కు కొత్తేమీ కాదు. ఇందులోని శౌర్య పాత్ర‌ను త‌ను అవ‌లీల‌గా చేసుకు వెళ్లిపోయాడు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో మ‌రింత ఎన‌ర్జీతో క‌నిపించాడు. (Rangabali review in telugu) స‌హ‌జ పాత్ర‌లో యుక్తి స‌హ‌జంగా క‌నిపించింది. ఆమెకు శౌర్య‌కు మ‌ధ్య ల‌వ్ ట్రాక్ రొటీన్‌గా అనిపించింది. అయితే ద్వితీయార్ధంలో వ‌చ్చే ఓ రొమాంటిక్ పాట‌లో గ్లామ‌ర్ బాగా ఒలికించింది యుక్తి. ఎదుటివాడు సంతోష‌ప‌డితే త‌ట్టుకోలేని అగాధం అనే పాత్ర‌లో స‌త్య న‌ట‌న క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. ఒకరకంగా ప్ర‌ధ‌మార్ధానికి త‌నే హీరో. అలాగే జాకెట్లు కుట్టే టైల‌ర్ రాజ్‌కుమార్ పాత్ర కూడా అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పూయిస్తుంది.

గోప‌రాజు ర‌మ‌ణ‌, ముర‌ళీ శ‌ర్మ, శుభ‌లేఖ సుధాక‌ర్ త‌దితరుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. శ‌ర‌త్ కుమార్ పాత్ర క‌నిపించేది కొద్ది సేపైనా ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌తినాయ‌కుడిగా షైన్ టామ్ పాత్ర ఆరంభంలో శ‌క్తిమంతంగా క‌నిపించినా.. చివ‌రికి వ‌చ్చే స‌రికి పేల‌వంగా మారిపోయింది. ఆ పాత్ర‌కు స‌రైన ముగింపు ఇవ్వ‌లేక‌పోయారు. (Rangabali review) క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల్లో కామెడీని మిక్స్ చేయ‌డం ఓ క‌ళ‌. దాన్ని ప‌వ‌న్ చ‌క్క‌గా చేసి చూపాడు. అయితే అస‌లు క‌థ మొద‌ల‌య్యాక త‌ను కాస్త గాడితప్పాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌ను ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దుకోలేక‌పోయాడు. ప‌వ‌న్ సిహెచ్ అందించిన పాట‌లు పెద్దగా గుర్తుండవు. నేప‌థ్య సంగీతం మాత్రం ఫ‌ర్వాలేద‌నిపించింది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా బాగున్నాయి.

  • బ‌లాలు
  • + క‌థా నేప‌థ్యం
  • + నాగ‌శౌర్య న‌ట‌న‌, యాక్షన్‌
  • + స‌త్య కామెడీ
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ద్వితీయార్ధం, పాట‌లు
  • - పతాక సన్నివేశాలు
  • చివ‌రిగా: కాల‌క్షేపాన్నిచ్చే ‘రంగ‌బ‌లి’ (Rangabali review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని