Rashmika: నాకెంతో బాధగా ఉంది: మార్ఫింగ్‌ వీడియోపై రష్మిక పోస్ట్‌

ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన తన ఫేక్‌ వీడియోపై నటి రష్మిక (Rashmika) స్పందించారు. తాను ఎంతో బాధపడుతున్నానంటూ ట్వీట్‌ చేశారు.

Published : 06 Nov 2023 15:46 IST

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన తన మార్ఫింగ్‌ వీడియోను ఉద్దేశించి తొలిసారి స్పందించారు నటి రష్మిక (Rashmika). ఈ ఘటన తననెంతో భయపెట్టిందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచిన కుటుంబసభ్యులు, స్నేహితులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.

‘‘ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న నా మార్ఫింగ్‌ వీడియో గురించి మాట్లాడటానికి ఎంతో బాధపడుతున్నా. టెక్నాలజీ ఎంతగా దుర్వినియోగం అవుతుందో ఈ ఘటన తెలియజేస్తోంది. ఈ ఘటన నాతోపాటు నాలాంటి ఎంతోమందిని భయానికి గురిచేస్తోంది. ఇదే ఘటన నేను కాలేజీ లేదా స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలిసేది కాదు. ఒక మహిళగా అందులోనూ నటిగా నన్నెంతగానో సపోర్ట్‌ చేస్తున్న కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అలాగే, మన గుర్తింపునకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై కలసికట్టుగా తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది’’ అని ఆమె అన్నారు.

అసలేం జరిగిందంటే: రష్మికకు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ వీడియో ఆదివారం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్‌మీడియా స్టార్‌ జారా పటేల్ వీడియోను మార్ఫింగ్‌ చేసి.. అందులో రష్మిక ముఖం పెట్టారు. చూడటానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్న ఈ వీడియో చూసిన నెటిజన్లు కొంతమంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు క్రియేట్‌ చేసి సెలబ్రిటీ పరువుకు భంగం కలిగించడం నేరమన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అమితాబ్‌ బచ్చన్‌ డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై కేంద్ర ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కొత్త నిబంధనల ప్రకారం ఫేక్‌ సమాచారాన్ని గుర్తిస్తే.. దాన్ని 36 గంటల్లోగా తొలగించాలి. ఈ నిబంధనలను పాటించకపోతే రూల్‌ 7 కింద.. ఆ సామాజిక మాధ్యమాలను కోర్టుకు లాగొచ్చు. మార్ఫింగ్‌ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య. ఈ సమస్యను సామాజిక మాధ్యమాలే పరిష్కరించాలి’’ అని స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని