Sridevi Soda Center: ఓటీటీలోకి ‘శ్రీదేవి సోడా సెంటర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. డిజిటల్‌ మాధ్యమం వేదికగా ఆ వినోదాన్ని మరోసారి పంచబోతుంది.

Updated : 30 Aug 2022 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ఒకటి. వెండితెరపై మెరిసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమం వేదికగా వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది ‘జీ 5’. సుధీర్‌ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. ‘పలాస 1978’ ఫేం కరుణ కుమార్‌ దర్శకత్వం వహించారు. సూరిబాబు పాత్రలో సుధీర్‌ విశేషంగా ఆకట్టుకున్నారు. శ్రీదేవి పాత్రలో ఆనంది ఒదిగిపోయింది.

సూరిబాబు- శ్రీదేవి ప్రేమ కథ ఇదీ..

గోదావరి జిల్లాల్లో సూరిబాబు (సుధీర్‌బాబు) పేరున్న ఎలక్ట్రీషియన్‌. చుట్టు ప‌క్కల ఏ వేడుక‌లైనా సూరిబాబు డీజే సెట్టే మోగుతుంది. లైటింగే మెరుస్తుంది. సంజీవరావు (న‌రేశ్‌) కూతురు శ్రీదేవిని(ఆనంది) చూసి మ‌న‌సు పారేసుకుంటాడు సూరిబాబు. ఆమె కూడా అత‌నితో ప్రేమలో పడుతుంది. కానీ, ఇద్దరి ప్రేమ‌కి కులం అడ్డొస్తుంది. ఇదిలా ఉండగా ఊరి పెద్దగా చెప్పుకొనే కాశీ (పావుల్‌ న‌వ‌గీత‌మ్) అనుచరుడితో గొడ‌వ కారణంగా సూరి జైలుపాల‌వుతాడు. కేసు కొట్టివేస్తార‌నుకుంటే, అనుకోని కారణాల వల్ల మ‌ళ్లీ అది సూరిబాబు మెడ‌కు చుట్టుకుంటుంది. అలా, ఓ హ‌త్య కేసులో జైలుకి వెళ్లొచ్చాక సూరిబాబు జీవితంలో ఏం జ‌రిగింది? సూరిబాబు.. శ్రీదేవిని మ‌ళ్లీ క‌లిశాడా లేదా? ఇద్దరి ప్రేమక‌థ సుఖాంత‌మైందా? సూరిబాబు ఎందుకు హత్య చేయాల్సి వ‌చ్చింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని