Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘షీనా బోరా హత్య’ డాక్యుమెంటరీ సంచలనం.. 18 దేశాల్లో ట్రెండింగ్‌..

‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది.

Published : 09 Mar 2024 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో వాయిదాల తర్వాత ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన  ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ సంచలనం సృష్టిస్తోంది. ఈ డాక్యుమెంటరీని ప్రకటించిన దగ్గర నుంచి ప్రేక్షకులు దీని విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూడగా.. ఫిబ్రవరి 29 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై రూపొందించిన ఈ క్రైమ్‌ డాక్యుమెంటరీ మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌ టాప్10లో కొనసాగుతోంది. కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు 18 దేశాల్లో ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉంది. విడుదలైన దగ్గరినుంచి ఇప్పటివరకు మొత్తం 2.2 మిలియన్ల గంటల వాచ్‌టైమ్‌ను నమౌదు చేసింది. భారీ ప్రేక్షకాదరణతో ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న ‘అవతార్‌’, ‘లవ్‌ ఈజ్ బ్లైండ్‌’ల రికార్డులను ఇది 10 రోజుల్లోపే చేరుకోవడం విశేషం.

రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ

ఏంటీ షీనా బోరా హత్య కేసు..

2012లో షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా.. దీన్ని బయటపెట్టాడు. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని తెలిపాడు. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తల్లిదండ్రుల వద్ద ఉంచింది. కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని, అతడి నుంచీ విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జియాను పెళ్లి చేసుకుంది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా.. ముంబయికి వెళ్లి ఆమెను కలిసింది. పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనాకు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ఈవిషయంలో తల్లీకుమార్తెల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆర్థిక విభేదాలూ తలెత్తాయి. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌రాయ్‌ సాయంతో కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని