Tollywood:జులై.. తెలుగు చిత్ర పరిశ్రమకు పీడకలై..!

Tollywood: జులైలో మెప్పించలేకపోయిన తెలుగు/డబ్బింగ్‌ చిత్రాలివే!

Updated : 30 Jul 2022 16:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు మన బ్యాట్స్‌మెన్‌ ప్రతి బాల్‌ సిక్స్‌ కొడితే ఆ ఆనందమే వేరు. అదే ఓవర్‌కు ఒక వికెట్‌ చొప్పున పడిపోతుంటే, మ్యాచ్‌ చూడాలన్న మూడ్‌, ఉత్సాహం రెండూ పోతాయి. వేసవిలో సినిమా తర్వాత సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తే ఎంచక్కా ఆస్వాదించాం. కానీ, జులై నెలలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.  విడుదలైన ప్రతి సినిమా ఇటు ప్రేక్షకుడికి, అటు చిత్ర పరిశ్రమకు పీడకలను మిగిల్చింది.

తొలి షాక్‌ గోపిచంద్‌

గోపిచంద్‌ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్‌రూమ్‌ యాక్షన్‌ డ్రామా ‘పక్కా కమర్షియల్‌’. రాశీఖన్నా కథానాయిక.  యాక్షన్‌ హీరో అయిన గోపిచంద్‌ తొలిసారి లాయర్‌గా చేయడం, అందునా కామెడీకి తనదైన టచ్‌ ఇచ్చే మారుతి డైరెక్ట్‌ చేయడంతో సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. కానీ, వాటిని అందుకోవడంలో ‘పక్కా’ఫెయిల్‌ అయింది. కథ, కథనాల్లో బలం లేకపోవడం, కామెడీ ఆర్టిఫిషియల్‌గా ఉండటం సినిమాకు ప్రధాన మైనస్‌.


ప్రేక్షకుడిని బాదేసిన బర్త్‌డే పార్టీ

ఇక రెండో వారం వచ్చిన కొత్త సినిమా చూద్దామని థియేటర్‌కు వెళ్తే ప్రేక్షకులకు ‘హ్యాపీ’లేకుండా చేసింది ‘హ్యాపీబర్త్‌డే’. స‌ర్రియ‌ల్ వ‌ర‌ల్డ్‌లో జ‌రిగే ఓ విభిన్న‌మైన క్రైమ్ కామెడీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం . టీజ‌ర్, ట్రైల‌ర్లు వినోదాత్మ‌కంగా.. థ్రిల్లింగ్‌గా ఉండ‌టంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ‘మత్తు వదలరా’దర్శకుడు కావటం, లావణ్య త్రిపాఠితో పాటు వెన్నెల కిషోర్‌, సత్య, నరేశ్‌ అగస్త్య తదితరులు నటించడంతో విడుద‌ల‌కు ముందే సినిమాపై అంచ‌నాలు ఏర్పడ్డాయి. అయితే, వాటిని అందుకోలేకపోయింది ‘హ్యాపీబర్త్‌డే’.


‘వారియర్‌’ వామ్మో.. వాయ్యో

లింగుస్వామి దర్శకత్వంలో రామ్‌ నటించిన ‘ది వారియర్‌’ చూసిన తర్వాత థియేటర్‌లో ప్రేక్షకుడు పెట్టిన కేకలివే. పూర్తి మాస్‌ యాక్షన్‌ చిత్రంగా వచ్చిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. పాటలు, ఫైట్‌లు తప్ప సినిమా కథలో కొత్తదనం లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. రామ్‌, ఆదిల నటన బాగున్నా, కథలో దమ్ములేకపోవడం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది.


‘థాంక్‌ యూ’ అన్న చైతు.. సారీ చెప్పిన ప్రేక్షకులు

ఒక జోనర్‌కు పరిమితం కాకుండా విభిన్న కథా చిత్రాలను ప్రయత్నిస్తున్న యువ నటుడు నాగచైతన్య. విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘థాంక్‌ యు’. జులై మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మెయిన్‌పాయింట్‌ బాగున్నా, భావోద్వేగ భరితంగా తెరకెక్కించడంలో విక్రమ్‌ తడబడ్డారు. మూడు వేరియేషన్స్‌ కోసం చైతు పడిన కష్టం తప్ప సినిమా చూసి ‘థాంక్‌ యూ’ చెప్పే ధైర్యం లేక, ‘సారీ చైతు’ అనాల్సి వచ్చింది.


ఆశలన్నీ రవితేజ మీద పెట్టుకుంటే..

ఒకప్పుడు వరుస విజయాలతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు రవితేజ. ఆయన సినిమా వస్తుందంటే ఇటు క్లాస్‌, అటు మాస్‌ ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లేందుకు సిద్ధమైపోతారు. గత కొంతకాలంగా హిట్‌ లేకసతమతవుతున్న ఆయన ఈసారి ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శరత్‌ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియెన్స్‌ను మెప్పించ లేకపోయింది. కథ, కథనాలు, బలంలేని పాత్రల మధ్య రవితేజ మాస్‌ స్టామినా సరిపోలేదు. దీంతో ‘రామారావు ఆఫ్‌ డ్యూటీ’ చేయాల్సి వచ్చింది.


డబ్బింగ్‌ చిత్రాల పరిస్థితి అదే!

తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్‌ చిత్రాలు కూడా జులైలో థియేటర్లలో వచ్చాయి. ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’ పాస్‌మార్క్‌లతో గట్టెక్కితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రణబీర్‌కపూర్‌ ‘షంషేరా’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. సిబిరాజ్‌ ‘మాయోన్‌’లో మెరుపుల్లేవు. ఇక సుదీప్‌ విక్రాంత్‌ రోణ కాన్సెప్ట్‌, యాక్షన్‌ బాగున్నా, కథనం తికమక పెట్టి, సామాన్య ప్రేక్షకుడికి అర్థంకాకుండా పోయింది. సాయి పల్లవి ‘గార్గి’ విమర్శకుల మెప్పు మాత్రం పొందింది. ఈ నేపథ్యంలో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. ఎందుకంటే ‘బింబిసార’తో మొదలై, ‘సీతారామం’, ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, కోబ్రా ‘కార్తికేయ2’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘లైగర్‌’ ఇలా ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు ఆగస్టు 1 నుంచి షూటింగ్స్‌ నిలిపివేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఇవన్నీ కొత్త సినిమాలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు