Chandrababu: ఏది అభివృద్ధో..?ఏది దోపిడీనో.. గుర్తించి ఓటేయాలి: చంద్రబాబు

స్వార్థం కోసం తెదేపా-జనసేన కలవలేదని.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకునేందుకే కలిశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated : 04 Mar 2024 18:07 IST

పెనుకొండ: స్వార్థం కోసం తెదేపా-జనసేన కలవలేదని.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకునేందుకే కలిశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పెనుకొండలో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు. ఏది అభివృద్ధో..?ఏది దోపిడీనో.. గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు.  

స్కీమ్‌ల్లో కూడా స్కామ్‌లు చేసే వ్యక్తి జగన్‌

‘‘సాగునీరు ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు. అనంతపురం జిల్లా అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నది ఇక్కడే. కరవు జిల్లాను సస్యశ్యామలం చేయాలని తెదేపా హయాంలో సంకల్పించాం. కియా పరిశ్రమ తెచ్చి వేలమందికి ఉపాధి కల్పించాం. గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేశాం. కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి. దీని వల్ల ప్రత్యక్ష, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలి. 2014లో ఈ ప్రాంతం ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది? మేం అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవి. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి. స్కీమ్‌ల్లో కూడా స్కామ్‌లు చేసే వ్యక్తి జగన్‌..

అభివృద్ధిలో మా పార్టీతో పోల్చుకోవద్దు

రాయలసీమకు తెచ్చిన పెట్టుబడులు ఏమిటో జగన్‌ చెప్పాలి. ఈ ఐదేళ్లలో ఏదైనా ప్రాజెక్టు నిర్మించారా? రాయలసీమకు ఏ పార్టీ మేలు చేసిందో ప్రజలు గ్రహించాలి. అభివృద్ధిలో మా పార్టీతో పోల్చుకోవద్దని జగన్‌ను కోరుతున్నాం. వివేకా హత్య కేసులో అనేక పిల్లిమొగ్గలు వేసింది ఎవరు? జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి కారకులెవరు? ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు కేతిరెడ్డి. ఎర్రగుట్టను మింగేసిన వ్యక్తి ఆయన. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి దందాలు, దౌర్జన్యాలు పెరిగాయి. తోపుదుర్తి లెక్కలన్నీ నా వద్ద ఉన్నాయి. అకౌంట్స్‌ సెటిల్‌ చేస్తా. మా కార్యకర్తలను వేధించిన వారిపై చర్యలు తప్పవు.

వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం

ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? నేనిచ్చింది ఐటీ ఉద్యోగాలు.. జగన్‌ ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగాలు. తెదేపా - జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్‌ వ్యవస్థ ఉంటుంది. ఎవరి ఉద్యోగం తీసేయం. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. మీకు న్యాయం చేస్తాం. వారిని వైకాపా కోసం పనిచేయవద్దని కోరుతున్నా’’అని చంద్రబాబు అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని