Digvijaya Singh: మధ్యప్రదేశ్‌లోనూ అలాంటి ఘటనలు జరగొచ్చు.. భాజపాపై దిగ్విజయ్‌ తీవ్ర ఆరోపణలు!

మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో భాజపా ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలకు అర్థమైందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌  నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. 

Published : 20 Aug 2023 11:41 IST

భోపాల్: అసెంబ్లీ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో నుహ్‌ తరహా అల్లర్లు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్ (Digvijaya Singh) ఆరోపించారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో భాజపా ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలకు అర్థమైందని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భోపాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని న్యాయ, మానవ హక్కుల విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఓటమి తప్పదు. ఆ విషయం ఇప్పటికే ఆ పార్టీ నాయకులకు అర్థమైంది. దీంతో ఆ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టొచ్చు. హరియాణాలోని నుహ్‌ తరహాలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల సమయంలో ఎంతో మంది న్యాయవాదులు కాంగ్రెస్‌ పార్టీకి మద్దుతుగా నిలిచారు. అప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మరోసారి పెద్ద ఎత్తున న్యాయవాదులు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా వచ్చారు. ఈ సారి కూడా కాంగ్రెస్‌  పార్టీ విజయం ఖాయం’’ అని దిగ్విజయ్‌ అన్నారు. 

పాంగాంగ్‌ సరస్సు వద్ద రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించిన రాహుల్‌ గాంధీ

దిగ్విజయ్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. నిరాధార ఆరోపణలు చేయడంలో దిగ్విజయ్‌కు మంచి పేరుందని విమర్శించింది. ‘‘ అభివృద్ధి కోసమే భాజపా రాజకీయం చేస్తుంది. 2003లో దయనీయ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌ను విడిచి దిగ్విజయ్‌ వెళ్లిపోయారు. ఆయనకు సొంత పార్టీలోనే ఎలాంటి ప్రాధాన్యం లేదు’’అని మధ్యప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు వీడీ శర్మ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని