JMM: కల్పనా సోరెన్‌.. జేఎంఎం ప్లాన్‌-బి కర్త ఆమె..!

ఝార్ఖండ్‌లోని సోరెన్‌ కుటుంబంలో మరో నేత అరెస్టయ్యేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్‌ సోరెన్‌ వైదొలగి.. అతని భార్యకు పగ్గాలు అప్పగించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Updated : 30 Jan 2024 19:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈడీ తనిఖీలు.. ఆపై కొన్ని గంటల పాటు ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అదృశ్యంతో రాంచీలో రాజకీయం వేడెక్కింది. భూకుంభకోణం, మనీలాండరింగ్‌ కేసుల్లో ఆయన కీలక నిందితుడు. ఇప్పటికే 10 సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా పట్టించుకోలేదు. ఈడీ అధికారులు వెతుక్కుంటూ దిల్లీలోని ఆయన నివాసానికి చేరుకొన్నా, అక్కడా జాడలేదు. నేటి మధ్యాహ్నం రాంచీలోని స్వగృహంలో జరిగిన సంకీర్ణ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ కూడా దీనికి హాజరయ్యారు. దీంతో హేమంత్‌ అరెస్టు ఖాయమనే ఊహాగానాలకు బలం చేకూరినట్లైంది. ఈనేపథ్యంలో జేఎంఎం ‘ప్లాన్‌-బి’ అమలుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఏమిటీ వ్యూహం..

ఒకవేళ హేమంత్‌ జైలుకు వెళ్లాల్సి వస్తే.. ముఖ్యమంత్రి బాధ్యతలను ఆయన సతీమణి కల్పనా సోరెన్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతానికి ఆమె ఎమ్మెల్యే కాదు. కానీ, అధికార కూటమిలో ఆమె శక్తిని సవాలు చేసే స్థాయిలో ఎవరూ లేరు. పార్టీలో మెజార్టీ వర్గం ఆమె వెనకే ఉంది. గాండే అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ ఖాన్‌ రాజీనామా చేశారు. ఆయన అక్కడి నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచారు. రెండు సార్లు కాంగ్రెస్‌ టికెట్‌పై విజయం సాధించగా.. 2019లో జేఎంఎం తరఫున పోటీ చేసి నెగ్గారు. పార్టీ వ్యూహంలో భాగంగా ఈ స్థానం నుంచి తాజాగా హేమంత్‌ సతీమణి ఉప ఎన్నిక బరిలోకి దిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా త్వరలో సర్ఫరాజ్‌ రాజీనామాకు ఆమోదముద్ర పడనున్నట్లు తెలుస్తోంది. భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే ఇదే విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు. 

ఎవరీ కల్పనా సోరెన్‌..

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన కల్పన ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. ఎంబీఏ పూర్తి చేశారు. పార్టీలో ఆమెను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. ప్రస్తుతం ఆమె సేంద్రియ వ్యవసాయం చేయడంతో పాటూ ఓ పాఠశాలను నడుపుతున్నారు. రాజకీయాల్లో హేమంత్‌కు ఆమె ముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తుంటారనే ప్రచారం ఉంది.

రాంచీకి చేరుకున్న సోరెన్‌.. సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్‌

సంకీర్ణ ప్రభుత్వంలో 17 సీట్లు ఉన్న కాంగ్రెస్‌ నుంచి ఆమెకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. ఒకవేళ ఏమైనా విభేదాలు తలెత్తితే అది ‘ఇండియా’ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

ఆమెకు పోటీ ఉంటుందా..?

జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. శిబు రాజ్యసభ సభ్యుడు. హేమంత్‌, బసంత్‌ ఎమ్మెల్యేలు. మరో కుమారుడు దుర్గా 2009లో మరణించారు. ఆయన భార్య సీత ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆమెకు జేఎంఎం పార్టీ విధానాలు అసలు నచ్చవు. భాజపాతో కలిసి హేమంత్‌ ప్రభుత్వం అవినీతిపై పోరాడింది. ఈ ప్రభుత్వాన్ని ఆమె కూలదోస్తుందని 2022 నుంచి ప్రచారం జరుగుతోంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అంత రాజకీయ శక్తి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. బసంత్‌కు రాజకీయ చతురత లేదని పార్టీ వర్గాలే చెబుతుంటాయి. శిబు కుమార్తె అంజలి రాజకీయాలకు దూరం. ఈ నేపథ్యంలో కల్పన రాజకీయ భవిష్యత్తుకు తక్షణమే వచ్చిన ముప్పేమీ లేదు. ఒకవేళ అవినీతి కేసుల వల్ల హేమంత్‌ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే.. పార్టీలో పూర్తిగా చక్రం తిప్పేది కల్పనయే!   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని