Election Results: రెండు రాష్ట్రాల్లో భాజపా.. మేఘాలయలో సంగ్మా హవా

ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడేలాగే కన్పిస్తోంది. త్రిపుర, నాగాలాండ్‌లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మేఘాలయలో ఎన్‌పీపీ హవా కొనసాగుతోంది.

Updated : 02 Mar 2023 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland)‌, మేఘాలయ (Meghalaya)లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. త్రిపుర, నాగాలాండ్‌లో భాజపా(BJP) మిత్రపక్షాలకు స్పష్టమైన ఆధిక్యం ఉండగా.. మేఘాలయలో సీఎం కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ హవా కొనసాగుతోంది.

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

మధ్యాహ్నం 2 గంటల వరకు వెలువడిన ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా ఉన్నాయి.

త్రిపుర (Tripura)లో భాజపా కూటమి 19 చోట్ల విజయం సాధించి.. మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 మార్క్‌ను అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ (Congress)‌-వామపక్షాల కూటమి 8 చోట్ల విజయం సాధించి మరో 7 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ (తిప్రా మోథ్రా పార్టీ) 7 చోట్ల విజయం సాధించి.. మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

నాగాలాండ్‌ (Nagaland)లో భాజపా (BJP)-ఎన్‌డీపీపీ (NDPP) కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు ఈ కూటమి 25 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్‌ 2 చోట్ల గెలిచి మరో 2 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ ఖాతా తెరవలేకపోయింది. ఎన్‌పీపీ ఒక చోట గెలిచి.. 2 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచి.. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మేఘాలయ (Meghalaya)లో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. అయితే, ఇక్కడ సీఎం కాన్రాడ్‌ సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ దూకుడుగా ఉంది. ఇప్పటివరకు ఈ పార్టీ 14 చోట్ల గెలుపొంది.. మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఒక చోట గెలిచి, 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా ఒక చోట గెలిచి, మరో మూడు స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ 5, ఇతరులు 17 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ 31 సీట్లు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని