iPhone 14: ఫోన్ ఫీచర్‌ టెస్టింగ్‌ కోసం కారునే తుక్కు చేశారు!

ఐఫోన్ 14 ప్రోలో క్రాష్‌-డిటెక్షన్‌ ఫీచర్‌ పనిచేస్తుందో.. లేదో తెలుసుకోవడం కోసం ఓ అమెరికన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ చేసిన ప్రయోగం వైరల్‌గా మారింది...

Updated : 21 Nov 2022 15:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ సంస్థ కొత్తగా విడుదల చేసిన ఐఫోన్‌ 14లో పలు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ను పరిచయం చేసింది. వీటిలో ఐఫోన్ 14 ప్రోలో ఇస్తున్న క్రాష్‌-డిటెక్షన్‌ ఫీచర్‌ ఎంతో కీలకమని యాపిల్‌ చెబుతోంది. ఈ భద్రతా ఫీచర్‌ ద్వారా వాహనం క్రాష్‌ అయిన వెంటనే అత్యవసర సేవల నంబర్‌కు కాల్‌ వెళుతుంది. దీంతో ప్రమాద బాధితులకు వెంటనే సహాయం అందుతుందని యాపిల్ వెల్లడించింది. తాజాగా ఈ ఫీచర్‌ పనితీరును పరీక్షించేందుకు ఓ అమెరికన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ చేసిన ప్రయోగం వైరల్‌గా మారింది. ఐఫోన్ 14 ప్రోలో క్రాష్‌-డిటెక్షన్‌ ఫీచర్‌ కచ్చితత్వంతో పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం కోసం ఏకంగా కారును మరో డమ్మీ కారుతో ఢీకొట్టారు. 

ఇందుకోసం యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకులు ఐఫోన్ 14ను కారు సీటుకు టేప్‌తో అతికించారు. కారును స్టార్ట్‌ చేసి పాత కార్లను ఢీకొట్టించారు. తర్వాత ఫోన్‌లో ఎస్‌ఓఎస్‌ అలారమ్‌ కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయినట్లు చూపించింది. ఈ అలారమ్‌ వ్యవధి 20 సెకన్లు ఉంటుంది. ఈ సమయంలోపు యూజర్‌ నుంచి స్పందన లేకుంటే ఐఫోన్ 14లోని ఎస్‌ఓఎస్‌ ఫీచర్‌ అత్యవసర సేవలను అందించే సహాయ కేంద్రానికి ఆటోమేటిక్‌ కాల్ లేదా ఆడియో మెసేజ్‌ను పంపుతుంది. ఒకవేళ యూజర్‌ స్పందిస్తే ఫోన్‌లోని 20 సెకన్ల కౌంట్‌డౌన్‌ను ఆపేయొచ్చు. ఇదే ఫీచర్‌ను యాపిల్‌ కంపెనీ యాపిల్ వాచ్‌ ఎస్‌ఈ (సెకండ్ జనరేషన్‌), యాపిల్ వాచ్‌ సిరీస్‌ 8, యాపిల్ వాచ్ అల్ట్రాలో ఇస్తున్నారు. ఒకవేళ యూజర్‌ ఎస్‌ఓఎస్‌ ఫీచర్‌ వద్దనుకుంటే ఫోన్‌ లేదా వాచ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు.

ఐఫోన్‌ 14ను నాలుగు వేరియంట్లలో తీసుకొచ్చారు. ఐఫోన్‌ 14లో 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌, 14 ప్లస్‌లో 6.7 అంగుళాల స్క్రీన్‌ను అమర్చారు. వీటిలో ఏ15 బయోనిక్‌ చిప్‌, 12 మెగాపిక్సెల్‌ కెమేరాలు ఉన్నాయి. ఐఫోన్‌ 14 ప్రారంభ ధర రూ.79,900గా, ఐఫోన్‌ 14 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా, ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర రూ. 1,29,900గా, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ ధర రూ. 1,39,900గా కంపెనీ నిర్ణయించింది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని