Apple: యూజర్‌ డేటా ట్రాకింగ్.. యాపిల్ స్పెషల్‌ వీడియో!

డేటా ప్రైవసీ డే సందర్భంగా యాపిల్ కంపెనీ డేటా భద్రతకు సంబంధించి స్పెషల్‌ వీడియో విడుదల చేసింది. ఇందులో రోజులో మెయిల్స్‌, బ్రౌజింగ్ హిస్టరీ, యాప్‌ ట్రాకింగ్‌ ద్వారా యూజర్‌ డేటాను వ్యాపార సంస్థలు ఎలా సేకరిస్తాయనేది చూపించింది.

Published : 25 Jan 2023 21:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత సమాచార గోప్యత (Data Privacy).. ప్రస్తుతం ఆన్‌లైన్ వినియోగించే ప్రతి వ్యక్తి ప్రాధాన్యతాంశం. ఈ-మెయిల్స్‌, చాటింగ్, షాపింగ్‌, బ్యాకింగ్‌, టికెట్‌ బుకింగ్, ఫుడ్‌ ఆర్డర్‌ వంటి సేవలకు సంబంధించి రోజులో మనం ఎన్నో రకాల యాప్‌లు, వెబ్‌సైట్లు ఉపయోగిస్తుంటాం. అయితే ఈ సేవలు పొందే సమయంలో కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లు యూజర్‌ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంటాయి. దీనివల్ల యూజర్‌ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోంది. 

డేటా ప్రైవసీ కోసం మొబైల్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కానీ, వ్యాపార అవసరాల కోసం కొన్ని సంస్థలు తప్పుడు మార్గాల్లో యూజర్‌ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నాయి. జనవరి 28న డేటా ప్రైవసీ డే (Data Privacy Day). ఈ సందర్భంగా యాపిల్ (Apple) కంపెనీ డేటా భద్రతకు సంబంధించి స్పెషల్‌ వీడియో విడుదల చేసింది. ‘ఏ డే ఇన్‌ ది లైఫ్‌ ఆఫ్‌ యాన్‌ యావరేజ్‌ పర్సన్స్‌ డేటా’ (A Day in the Life of an Average Person's Data) పేరుతో తీసిన వీడియోలో రోజులో మెయిల్స్‌, బ్రౌజింగ్ హిస్టరీ, యాప్‌ ట్రాకింగ్‌ ద్వారా యూజర్‌ డేటాను వ్యాపార సంస్థలు ఎలా సేకరిస్తాయనేది చూపించింది. అంతేకాదు వాటిని యాపిల్ ఎలా అడ్డుకుంటుందనేది కూడా వివరించింది. 

  • వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను ఐపీ అడ్రస్‌ సాయంతో ఈ-మెయిల్‌ ద్వారా యూజర్లకు పంపుతాయి. యూజర్‌ వాటిని ఓపెన్ చేసిన వెంటనే లొకేషన్‌తోపాటు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయి. యూజర్‌కు అలాంటి ప్రకటనలు రాకుండా ఉండాలంటే.. ఐఫోన్‌ మెయిల్‌ సెట్టింగ్స్‌లో ప్రొటెక్ట్‌ మెయిల్ యాక్టివిటీ  (Protect Mail Activity) ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలి. దాంతో యూజర్‌ ఐపీ అడ్రస్‌ గురించిన సమాచారం ఇతరులకు తెలియదు. 
  • సాధారణంగా మొబైల్‌ బ్రౌజర్‌లో యూజర్లు ఓపెన్‌ చేసే వెబ్‌సైట్లలో ఉండే ట్రాకర్లు బ్రౌజింగ్ సమాచారాన్నిసేకరిస్తుంటాయి. వాటి సాయంతో యూజర్‌కు ప్రకటనలు పంపుతుంటాయి. కానీ, ఐఫోన్‌ (iPhone) సఫారీ (Safari) బ్రౌజర్‌లోని ఇంటెలిజెంట్ ట్రాకింగ్‌ ప్రివేన్షన్‌ (Intelligent Tracking Prevention) సిస్టమ్‌ యూజర్‌ డేటాను ట్రాక్‌ చేయకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల యూజర్‌ వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని యాపిల్ చెబుతోంది. సఫారీ బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రివెంట్‌ క్రాస్‌-సైట్‌ ట్రాకింగ్‌ (Prevent Cross-Site Tracking) ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే ట్రాకర్లు యూజర్‌ డేటాను సేకరించలేవు. 
  • స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు లేకుండా ఏ పని సాధ్యంకాదు. కానీ, కొన్ని యాప్‌లు ఫోన్‌లో యూజర్‌ ఏం చేస్తున్నారనేది ట్రాక్ చేస్తుంటాయి. అలా సేకరించిన సమాచారాన్ని వ్యాపార సంస్థలకు అందిస్తాయి. దాని ఆధారంగా యూజర్‌ ఫోన్‌కు ప్రకటనలు పంపుతుంటాయి. యాప్‌లు డేటాను ట్రాక్‌ చేయకుండా ఐఫోన్‌లో యాప్‌ ట్రాకింగ్ ట్రాన్సపరెన్సీ (App Tracking Transparency) అనే ఫీచర్‌ ఉంది. యాప్‌ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ ఫీచర్‌ ఎనేబుల్ చేయాలా? వద్దా? అని ఐఫోన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. యూజర్‌ ఈ ఫీచర్‌ను సెలెక్ట్ చేస్తే యాప్‌లు యూజర్‌ యాక్టివిటిని ట్రాక్‌ చేయలేవు. 
  • యూజర్‌ డేటా ప్రైవసీకి యాపిల్ ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. ఐఫోన్‌ యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రైవసీ ప్రొటెక్షన్‌ ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన  ఐఓఎస్‌ 16లో కొత్తగా లాక్‌డౌన్‌ మోడ్‌ (Lockdown Mode)ను తీసుకొచ్చింది. ఇది యూజర్ల డేటాకు అదనపు భద్రతను అందిస్తుందని యాపిల్ చెబుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని