ఎడారులెలా ఏర్పడతాయి?

ఎడారి ఓ ఇసుక సముద్రం. అక్కడక్కడ ఒయాసిస్‌లు తప్ప చుక్క నీరుండదు. కనుచూపు మేర ఎక్కడా చెట్లు కనిపించవు. ఇంతకీ ఈ ఎడారులు ఎలా ఏర్పడతాయి? వర్షాలు కురవడానికి తోడ్పడే పర్వత శ్రేణుల మూలంగానే! ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఎడారుల కథేంటో చూద్దాం.

Updated : 06 Oct 2021 01:53 IST

ఎడారి ఓ ఇసుక సముద్రం. అక్కడక్కడ ఒయాసిస్‌లు తప్ప చుక్క నీరుండదు. కనుచూపు మేర ఎక్కడా చెట్లు కనిపించవు. ఇంతకీ ఈ ఎడారులు ఎలా ఏర్పడతాయి? వర్షాలు కురవడానికి తోడ్పడే పర్వత శ్రేణుల మూలంగానే! ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఎడారుల కథేంటో చూద్దాం.

* ఆవిరి

ఎండ వేడికి సముద్రాలు, జలాశయాల్లోని నీరు ఆవిరి అవుతుంది కదా. ఇదే వాతావరణంలోకి చేరుకొని మేఘాలుగా మారుతుంది. వేడితో, తేమతో కూడిన ఈ నీటి ఆవిరిని భూమి మీది గాలులు పైకి తేలిపోయేలా చేస్తాయి.

* పైకెగసే గాలులు

గాలులు పర్వత శ్రేణుల గుండా సాగేటప్పుడు.. వేడి, తేమ గాలిని పైకి వెళ్లేలా చేస్తాయి. ఈ గాలి పైకి వెళ్తున్నకొద్దీ వ్యాకోచించి, చల్లబడుతుంది. చల్లగాలి తేమను ఎక్కువగా మోయలేదు కాబట్టి నీరు గడ్డకడుతుంది. ఇది వర్షంలా, మంచులా కురుస్తుంది. దీన్నే ఓరోగ్రాఫిక్‌ ప్రెసిపిటేషన్‌ అంటారు. కాబట్టే గాలులు పైకెగిసిన వైపున పచ్చటి చెట్లు, చేమలు పెరుగుతాయి.

* వేడి గాలి కిందికి

వర్షం కురిశాక తేమను కోల్పోయిన చల్లటి, పొడి గాలి పర్వతాలకు అవతలి వైపునకు చేరుకుంటుంది. కిందికి దిగుతూ తిరిగి వేడెక్కుతుంది. అవతలి వైపున తేమ లేకపోవటం వల్ల మేఘాలు ఏర్పడవు. దీంతో పొడి ప్రాంతం ఏర్పడుతుంది. దీన్నే వర్షపు ఛాయ (రెయిన్‌ షాడో) అంటారు. క్రమంగా ఈ ప్రాంతం ఎడారిగా మారుతుంది. గోబి, అటకామా, మొజావే వంటి ఎడారులన్నీ ఇలా ఏర్పడినవే.

* తేమ తగ్గుముఖం

ఏడాదికి 250 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షం పడే ప్రాంతాన్ని అధికారికంగా ఎడారిగా వర్గీకరిస్తారు. చెట్లు లేకపోవటం వల్ల మట్టి లేదా సేంద్రియ పదార్థం గాలులకు ఎగిరిపోతుంది. దీంతో ఇసుక, రాళ్లు మిగిలిపోతాయి. తేమ తక్కువగా ఉండటం వల్ల పగటి పూట చాలా వేడిగా, రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని