జీమెయిల్‌ రహస్యంగా..

నేటి డిజిటల్‌ యుగంలో భద్రత పెద్ద సమస్య. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోయే ప్రమాదముంది.

Updated : 22 Nov 2023 04:07 IST

నేటి డిజిటల్‌ యుగంలో భద్రత పెద్ద సమస్య. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఈమెయిల్‌ ద్వారా క్లయింట్ల సమాచారం వంటి రహస్య వివరాలను పంపించటం, స్వీకరించటం సర్వ సాధారణమైపోయింది. ఇలాంటి సమయాల్లో జీమెయిల్‌ వాడేవారు ఈమెయిల్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయాన్ని వాడుకోవటం మంచిది. గోప్యత కోసం జీమెయిల్‌ రెండు అవకాశాలను కల్పిస్తుంది. వ్యక్తిగత జీమెయిల్‌లో మెయిల్‌ భద్రతకు కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌ సదుపాయముంది. అదే పెయిడ్‌ గూగుల్‌ వర్క్‌స్పేస్‌ ఖాతాలోనైతే ఎస్‌/ఎంఐఎంఈ ఆప్షన్‌ను ఎన్‌క్రిప్షన్‌కు ఉపయోగించుకోవచ్చు.

కాన్ఫిడెన్షియన్‌ మెయిల్‌ ఇలా..

  • వెబ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి జీమెయిల్‌ ఖాతాకు లాగిన్‌ కావాలి.
  • కంపోజ్‌ బటన్‌ మీద తాకాలి.
  • మెయిల్‌ రాశాక డ్రాఫ్ట్‌ కింది భాగాన కనిపించే తాళం గుర్తును తాకితే కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌ కనిపిస్తుంది.
  • ఎక్స్‌పైరేషన్‌ తేదీని ఎంచుకోవాలి. కావాలనుకుంటే పాస్‌కోడ్‌నూ నిర్ణయించుకోవచ్చు.
  • ఆ తర్వాత సేవ్‌ చేసుకొని, సెండ్‌ బటన్‌ను నొక్కాలి.
  • మొబైల్‌ ఫోన్లలో జీమెయిల్‌ యాప్‌ను వాడుతున్నట్టయితే కంపోజ్‌ బటన్‌ను తాకి.. మూడు చుక్కల మెనూ ద్వారా కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌ ఎంచుకోవచ్చు.

 ఇలా ఎన్‌క్రిప్షన్‌ చేసిన మెయిల్‌ కంటెంట్‌ను గానీ అటాచ్‌మెంట్లను గానీ కాపీ, పేస్ట్‌, డౌన్‌లోడ్‌, ప్రింట్‌, ఫార్వర్డ్‌ చేయటం కుదరదని గుర్తుంచుకోవాలి. నిర్ణయించుకున్న తేదీ తర్వాత ఈమెయిల్‌ దానంతటదే డిలీట్‌ అవుతుంది. అయితే మెయిల్‌ను అందుకున్నవారు స్క్రీన్‌షాట్‌ను తీసుకునే అవకాశముందని మరవరాదు. కాబట్టి విశ్వసనీయమైన వ్యక్తులకే ఇలాంటి ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌ మెయిళ్లు పంపాలి.

జీమెయిల్‌ వర్క్‌స్పేస్‌లో ఇలా..

  • గూగుల్‌ వర్క్‌స్పేస్‌ ఖాతాతో జీమెయిల్‌ను ఓపెన్‌ చేయాలి.
  • గూగుల్‌ అడ్మిన్‌ కన్సోల్‌లోకి వెళ్లాలి.
  • యాప్స్‌ ద్వారా గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి, అక్కడి నుంచి జీమెయిల్‌ ద్వారా యూజర్‌ సెటింగ్స్‌ తెరవాలి.
  • డొమెయిన్‌కు లింక్‌ అయిన గూగుల్‌ వర్క్‌స్పేస్‌ ఖాతాను ఎంచుకొని ఎస్‌/ఎంఐఎంఈ సదుపాయాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి.
  • తర్వాత ‘ఎస్‌/ఎంఐఎంఈ ఎన్‌క్రిప్షన్‌ ఫర్‌ సెండింగ్‌ అండ్‌ రిసీవింగ్‌ ఈమెయిల్స్‌’ ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. దీంతో ఎన్‌క్రిప్టెడ్‌ ఈమెయిల్‌ పంపటానికి వీలవుతుంది.
  • ఇప్పుడు జీమెయిల్‌ను ఓపెన్‌ చేసి కంపోజ్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి.
  • మెయిల్‌ రాశాక, దాన్ని అందుకునే వారి పేరు పక్కన తాళం గుర్తును నొక్కాలి. ఇది ఆకుపచ్చ, బూడిద, ఎరుపు రంగులో ఉండొచ్చు. ఆకుపచ్చ రంగు మెయిల్‌ ఎన్‌క్రిప్ట్‌ అయ్యిందనటానికి సంకేతం. బూడిద రంగేమో ఎన్‌క్రిప్షన్‌ స్టేటస్‌ స్పష్టంగా లేదని, ఎరుపు రంగేమో ఎన్‌క్రిప్ట్‌ కాలేదనటానికి గుర్తు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని