మైక్రోసాఫ్ట్‌ కొత్త జోష్‌

మైక్రోసాఫ్ట్‌ ఇగ్నైట్‌ 2023. ప్రఖ్యాత ఐటీ సంస్థ పేరుకు తగ్గట్టుగానే ఈసారీ తమ వార్షిక కార్యక్రమంలో బోలెడన్ని అప్‌డేట్లను ప్రవేశపెట్టింది. కృత్రిమ మేధ(ఏఐ)కు పెద్దపీట వేసింది.

Updated : 22 Nov 2023 07:11 IST

మైక్రోసాఫ్ట్‌ ఇగ్నైట్‌ 2023. ప్రఖ్యాత ఐటీ సంస్థ పేరుకు తగ్గట్టుగానే ఈసారీ తమ వార్షిక కార్యక్రమంలో బోలెడన్ని అప్‌డేట్లను ప్రవేశపెట్టింది. కృత్రిమ మేధ(ఏఐ)కు పెద్దపీట వేసింది. ఛాట్‌జీపీటీకి పోటీ అయిన బింగ్‌ ఛాట్‌ను కోపైలట్‌ కిందికి తీసుకొచ్చింది. ఐటీ ప్రొఫెషనల్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న విశిష్ట ఏఐ చిప్స్‌ను పరిచయం చేసింది. మాటలతోనే అవతార్లను సృష్టించటం వంటి వినూత్న ఫీచర్లు వీటి సొంతం. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ ఇగ్నైట్‌ విశేషాలేంటో పరిశీలిద్దామా.

కోపైలట్‌గా బింగ్‌

ఏఐ ఆధారిత బింగ్‌ ఛాట్‌ను మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌గా మార్చేసింది. ఇప్పుడిది https://copilot.microsoft.com, బింగ్‌కు అదనంగా విండోస్‌లోనూ అందుబాటులో ఉంటుంది. దీన్ని విండోస్‌ 10కూ విస్తరించారు. మైక్రోసాఫ్ట్‌ ఎంటర్‌ప్రైజ్‌ చందాతో పాటే దీన్ని వాడుకోవచ్చు. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. డిసెంబర్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ 365 ఎఫ్‌3లోనూ జతచేయనున్నారు. నెలకు 5 డాలర్ల రుసుముతో అంతా వాడుకోవచ్చు.

ప్రత్యేక ఏఐ చిప్స్‌

జీపీయూ మీద ఆధారపడకుండా ఉండటానికి మైక్రోసాఫ్ట్‌ రెండు సొంత, డేటా ఆధారిత ఏఐ చిప్స్‌ను పరిచయం చేసింది. 1. అజ్యూర్‌ మయియా 100 ఏఐ యాక్సిలరేటర్‌. 2. అజ్యూర్‌ కోబాల్ట్‌ 100 సీపీయూ. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వటానికి, వాటిని రన్‌ చేయటానికి మయియా 100 ఉపయోగపడుతుంది. ఇక మామూలు పనులకు ఉద్దేశించింది కోబాల్ట్‌ 100. ఇవి రెండూ వచ్చే సంవత్సరం మొదట్లో అజ్యూర్‌ డేటా కేంద్రాలకు జత కానున్నాయి.

కోపైలట్‌లో ఏఐ టూల్స్‌

కోపైలట్‌కు కొత్త ఏఐ టూల్స్‌నూ మైక్రోసాఫ్ట్‌ ఆవిష్కరించింది. జనరేటివ్‌ ఏఐ టెక్నాలజీతో పనిచేసే వీటి పేర్లు.. కోపైలట్‌ ఫర్‌ అజ్యూర్‌, కోపైలటర్‌ ఫర్‌ సర్వీస్‌, కోపైలట్‌ స్టుడియో, కోపైలట్‌ ఇన్‌ డైనమిక్స్‌ 365 గైడ్స్‌.

  • గూగుల్‌ క్లౌడ్‌లో ఇటీవల పరిచయం చేసిన డ్యూయెట్‌ ఏఐకి కోపైలట్‌ ఫర్‌ అజ్యూర్‌ ప్రత్యామ్నాయం. ప్రస్తుతానికిది ప్రివ్యూలో అందుబాటులో ఉంటుంది.
  • కోపైలట్‌ ఫర్‌ సర్వీసెస్‌ వినియోగదారుల సేవలు కల్పిస్తుంది. కస్టమర్‌ సర్వీస్‌ ఏజెంట్లు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్లు, కథనాలు, ఆఫ్‌లైన్‌ డేటాబేస్‌ల నుంచి తనకు తానే వీటిని గ్రహిస్తుంది.
  • కోపైలట్‌ ఇన్‌ డైనమిక్స్‌ 365 గైడ్లు ప్రధానంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉపయోగపడే సమాచారాన్ని జనరేటివ్‌ ఏఐతో సంక్షిప్తంగా తెలియజేస్తాయి. దీన్ని ముందుగా పరిమిత కస్టమర్లు, సామర్థ్యాలతో ప్రైవేట్‌ ప్రివ్యూగా ఆరంభిస్తారు.
  • కోపైలట్‌ స్టుడియో ద్వారా కోపైలట్‌ను ఇష్టమైన విధంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు- నేచురల్‌ లాంగ్వేజ్‌లో వివరించటం ద్వారా ఖర్చుల నియంత్రణకు ఛాట్‌బాట్‌గా మలచుకోవచ్చు. ప్రస్తుత కోపైలట్‌ ఫర్‌ మైక్రోసాఫ్ట్‌ 365 చందాదారులకు ఇది పబ్లిక్‌ ప్రివ్యూలో అందుబాటులో ఉంటుంది.

టీమ్స్‌ కొత్తగా

మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌కు కొత్తగా డెకరేట్‌ యువర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఫీచర్‌ తోడైంది. ఇది సమావేశంలో పాల్గొనేవారి వెనకాల వస్తువులు చిందర వందరగా కనిపించకుండా చూస్తుంది. ఉదాహరణకు వెనకాల షెల్ఫ్‌లో పుస్తకాలు అటూఇటూ పడిపోయి ఉన్నాయనుకోండి. తనే వాటిని సర్దినట్టు చూపిస్తుంది. కావాలంటే మొక్కలనూ జోడిస్తుంది. ఇది టీమ్స్‌ ప్రీమియం చందాదారులకు వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటుంది. అలాగే ఏఐ ఆధారిత నాయిస్‌ రిడక్షన్‌ ఫీచర్‌నూ ప్రవేశపెట్టారు. ఇది చుట్టుపక్కల చప్పుళ్లను, ఇతరుల గొంతులు అవతలివారికి వినిపించకుండా చేస్తుంది. ఇది వచ్చే సంవత్సరం ఆరంభంలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.

టు డు, ప్లానర్‌, ప్రాజెక్ట్‌ ఒక్కటిగా..

ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ గజిబిజిని తగ్గించటానికి అన్నింటికీ ఒకే దగ్గరికి తీసుకురానున్నారు. మైక్రోసాఫ్ట్‌ టు డు, ప్లానర్‌, ప్రాజెక్టులను కలిపి ఒకే ప్రొడక్టుగా రూపొందించనున్నారు. ప్లానర్‌కు కోపైలట్‌ కూడా తోడవ్వనుంది. చేయాల్సిన పనులను త్వరగా ప్లాన్‌ చేసుకోవటానికి, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవటానికిది తోడ్పడుతుంది.

పరికరంలోనే ఏఐ స్టుడియో

ఏఐ అనుభూతులను క్లౌడ్‌ నుంచి విండోస్‌ పరికరంలోకి జొప్పించే ప్రయత్నంలో భాగంగా విండోస్‌ ఏఐ స్టుడియోను పరిచయం చేశారు. దీని సాయంతో పరికరంలోనే, ఆఫ్‌లైన్‌లోనే విండోస్‌ యాప్స్‌ను వాడుకోవచ్చు.

మాటతోనే అవతార్స్‌

మాటలతోనే అవతార్స్‌ను సృష్టించే టూల్‌ను మైక్రోసాఫ్ట్‌ పరిచయం చేసింది. దీని పేరు అజ్యూర్‌ ఏఐ స్పీచ్‌ టెక్స్ట్‌ టు స్పీచ్‌ అవతార్‌. ఇదో డీప్‌ఫేక్‌ సాధనం. ఇది నిజమైన వ్యక్తులుగా కనిపించే అవతార్లను సృష్టిస్తుంది. ఏదైనా సందేశాన్ని ఇవ్వటానికి వీలుగా యానిమేషన్‌ రూపంలోకీ మారుతుంది. అయితే కొందరు దుర్వినియోగ పరచే వీలుందనే భావనతో దీనికి కొన్ని పరిమితులు విధించారు. ప్రస్తుతానికి అజ్యూర్‌ చందాదారులకు అప్పటికే రూపొందించిన అవతార్లను అందుబాటులో ఉంచారు. అదీ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి, కొన్ని సందర్భాల్లో వాడుకోవటానికే అనుమతించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని