ఉచితంగా జీపీటీ-4

ఛాట్‌జీపీటీ. ఆన్‌లైన్‌ సెర్చ్‌ను కొత్త పుంతలు తొక్కించి, దానికే సవాల్‌ విసురుతున్న టెక్నాలజీ. కథనాల దగ్గరి నుంచి మెయిళ్లు రాయటం వరకూ ఎన్నెన్నో పనులను చిటికెలో చేసి పెడుతుంది.

Updated : 29 Nov 2023 06:49 IST

ఛాట్‌జీపీటీ. ఆన్‌లైన్‌ సెర్చ్‌ను కొత్త పుంతలు తొక్కించి, దానికే సవాల్‌ విసురుతున్న టెక్నాలజీ. కథనాల దగ్గరి నుంచి మెయిళ్లు రాయటం వరకూ ఎన్నెన్నో పనులను చిటికెలో చేసి పెడుతుంది. జీపీటీ-4 పరిజ్ఞానం దీన్ని మరింత అధునాతనంగా మార్చేసింది. అయితే జీపీటీ 4ను వాడుకోవటానికి చందా చెల్లించాల్సి ఉంటుంది. మరి ఉచితంగా వాడుకోవాలంటే? ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. అలాంటి వాటిల్లో కొన్ని ఇవీ..

మెర్లిన్‌

ఇదో క్రోమ్‌ ఛాట్‌జీపీటీ ఎక్స్‌టెన్షన్‌. ఏ వెబ్‌సైట్‌ మీదైనా యాక్సెస్‌ చేయొచ్చు. మెర్లిన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని, ఖాతాను సృష్టించుకుంటే చాలు. కంట్రోల్‌/కమాండ్‌, ఎం మీటలను కలిపి నొక్కి ప్రాంప్ట్‌ రూపంలో ఆదేశాలు ఇవ్వటమే తరువాయి. చిటికెలో బ్లాగులు, యూట్యూబు వీడియోలు, వెబ్‌సైట్ల సారాంశాన్ని ముందుంచుతుంది. సోషల్‌ మీడియా కంటెంట్‌నూ సృష్టించుకోవచ్చు. ఈమెయిళ్లు, కోడ్స్‌ రాసి పెడుతుంది. దీనిలోని 12 ఛాట్‌జీపీటీ ప్లగిన్లు ఉత్పాదకత పెంచటానికి ఎంతగానో తోడ్పడతాయి. మెర్లిన్‌లోని కృత్రిమ మేధ ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సైడ్‌బార్‌లో సమాధానాలిస్తుంది. కథనాలు రాయటానికి తోడ్పడటమే కాదు కథనాలను చదివి వినిపిస్తుంది కూడా. సమయం దొరకటం లేదని చింతించే ఉద్యోగులు, విద్యార్థుల వంటివారికిది చేదోడు వాదోడుగా నిలుస్తుంది.

https://www.getmerlin.in/


పోయ్‌

ఇది కోరాకు చెందిన ఏఐ యాప్‌. ఆంత్రోపోనిక్‌ సంస్థ రూపొందించిన క్లాడ్‌ దగ్గరి నుంచి ఓపెన్‌ఏఐకి చెందిన జీపీటీ వరకు రకరకాల ఏఐ మోడళ్లను వాడుకోవటానికి వీలు కల్పిస్తుంది. ప్రశ్నలను సంధించి జవాబులు రాబట్టుకోవచ్చు. అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీ దీని సొంతం. అంతరాయాలకు తావులేని సంభాషణ, ఉత్పాదక పెంపు, సృజనాత్మక కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పోయ్‌ను రూపొందించారు. దీని ఇంటర్ఫేస్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏదైనా బాట్‌ లేదా ప్రాంప్ట్‌తో తేలికగా వాడుకోవచ్చు.  ఇందులో ప్రాంప్ట్‌ సాయంతో సొంత ఛాట్‌బాట్లనూ సృష్టించుకోవచ్చు. గోప్యతకు ప్రాధాన్యమిస్తుంది. సైన్‌ ఇన్‌ అయినప్పుడు ధ్రువీకరణకు మాత్రమే ఫోన్‌ నంబరును వాడుకుంటుంది. బేసిక్‌ ఫీచర్లను ఉచితంగానే వాడుకోవచ్చు. ఎక్కువ ఫీచర్లు కావాలంటే చందా కట్టొచ్చు.


బింగ్‌ ఏఐ

గూగుల్‌కు బదులుగా ఏఐ ఆధారిత సెర్చింజన్‌ బింగ్‌నూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన దీనిలో ఏఐ ఆధారిత జీపీటీ-4 కూడా ఉంది. దీని వెబ్‌సైట్‌లోకి వెళ్లి బింగ్‌ ఛాట్‌తో బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. యాప్‌ రూపంలోనూ దీని సేవలను పొందొచ్చు. కంటెంట్‌ను సృష్టించుకోవచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బింగ్‌లోని రైటింగ్‌ అసిస్టెంట్‌ సాయంతో మెయిళ్లు రాసుకోవచ్చు. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ప్రయాణం సాఫీగా సాగటానికి ప్లాన్‌ చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూను ఎదుర్కోవటానికి సన్నద్ధం కావొచ్చు. కవితలు, కథలను సృష్టించుకోవచ్చు. ఇక ఇమేజ్‌ జనరేటర్‌ ద్వారా ప్రాంప్ట్‌ను అందించి ఉచితంగా బొమ్మలను గీయించుకోవచ్చు. దీనిలోని ట్రాన్స్‌లేటర్‌ బోలెడన్ని భాషలను ఇట్టే అనువదిస్తుంది. ఇక ఏఐ ఆధారిత కోపైలట్‌ నమ్మకమైన సమాచారాన్ని అందిస్తుంది. మన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, కచ్చితమైన సమాచారాన్ని ముందుంచుతుంది. మన ప్రాధాన్యాలు, గతంలో జరిపిన చర్చలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా స్పందిస్తుంది కూడా. జోక్స్‌ దగ్గరి నుంచి ఆటలు ఆడుకోవటం వరకూ ఎన్నో సరదా పనులూ చేసుకోవచ్చు.

https://www.bing.com/


ఫోర్‌ఫ్రంట్‌ ఏఐ

ఇది ఐదు వేర్వేరు ఎల్‌ఎల్‌ఎమ్స్‌ను అందించే ఆన్‌లైన్‌ వేదిక. వీటిని ఛాట్‌బాట్‌ సర్వీస్‌ ద్వారా వాడుకోవచ్చు. లేదూ ప్రస్తుత ఏఐ మోడళ్లను మన అవసరాలకు అనుగుణంగానూ మార్చుకోవచ్చు. దీనిలో సొంత ఎల్‌ఎల్‌ఎం వర్షన్‌ కూడా ఉంది. యూజర్లతో ఇంటరాక్ట్‌ కావటానికి ప్రత్యేక రూపాలనూ (పర్సోనా) అందిస్తుంది. ఇవి అప్పటికే ప్రత్యేక శిక్షణ తీసుకొని ఉంటాయి కూడా. ఉదాహరణకు- ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, న్యాయ అనువాదకుడు, ప్రొడక్ట్‌ మేనేజర్‌ వంటి వారితో చర్చించొచ్చు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సాయమూ తీసుకోవచ్చు. ప్రపంచం గురించి తెలుసుకోవాలన్నా, వినోదం కోసమైనా చరిత్రాత్మక వ్యక్తులతోనూ ముచ్చటించొచ్చు. ప్రముఖుల పాత్రలను పోలినట్టుగా స్పందించేలా దీనిలోని ఎల్‌ఎల్‌ఎమ్‌లకు శిక్షణ ఇచ్చారు మరి. మరిన్ని ఎక్కువ ఫీచర్లు కావాలంటే చందా కట్టాల్సి ఉంటుంది.'

https://www.forefront.ai/ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని