ఇన్‌బాక్స్‌ పొందికగా

ఇల్లు చిందవందరగా ఉంటే ఏం బాగుంటుంది? ఇన్‌బాక్స్‌ కూడా అంతే. రోజూ ఎన్నో మెయిళ్లు వస్తుంటాయి. అన్నింటికీ వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు.

Updated : 20 Dec 2023 01:18 IST

ఇల్లు చిందవందరగా ఉంటే ఏం బాగుంటుంది? ఇన్‌బాక్స్‌ కూడా అంతే. రోజూ ఎన్నో మెయిళ్లు వస్తుంటాయి. అన్నింటికీ వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ వీటి మధ్యలో కొన్ని ముఖ్యమైన మెయిళ్లు మరుగున పడితే? మన దృష్టి నుంచి తప్పించు కుంటే? ఇలాంటి ఇబ్బందిని తొలగించు కోవటానికి జీమెయిల్‌లో మంచి సదుపాయముంది. ఫోల్డర్ల మాదిరి కొత్త లేబుళ్లను సృష్టించుకొని, అంత ముఖ్యం కాని మెయిళ్లను వీటిలోకి మళ్లించు కోవచ్చు. ఇలా ఇన్‌బాక్సులో ముఖ్యమైన మెయిళ్లను ఇట్టే గుర్తించొచ్చు.

 కొత్త లేబుల్‌ ఇలా..

  •   జీమెయిల్‌లో ఎడమ వైపు జాబితాలో ‘మోర్‌’ మీద క్లిక్‌ చేస్తే ‘క్రియేట్‌ న్యూ లేబుల్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • టెక్స్ట్‌ బాక్సులో లేబుల్‌ పేరును రాసి ‘క్రియేట్‌’ బటన్‌ను నొక్కాలి. దీనికి ఆయా రకాల మెయిళ్లకు నప్పే పేరు పెట్టుకుంటే తేలికగా గుర్తుంచుకోవటానికి వీలుంటుంది.
  • ఈ కొత్త లేబుల్‌ ‘కేటగిరీస్‌’ కింద కనిపిస్తుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని లేబుళ్లు సృష్టించుకోవచ్చు.

వడపోత ఇలా..

లేబుల్‌(ఫోల్డర్‌) సిద్ధమయ్యాక దానిలోకి ఈమెయిళ్లు వాటంతటవే వెళ్లిపోయేలా ఫిల్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా జీమెయిల్‌ సెర్చ్‌ ఆప్షన్‌ సాయంతో ఫిల్టర్‌ విధానాన్ని సెట్‌ చేసుకోవాలి. జీమెయిల్‌ సెర్చ్‌ బార్‌ చివర్లో ఉండే చిన్న గీతల గుర్తు మీద క్లిక్‌ చేయాలి. దీనిలో కొన్ని బాక్సులు కనిపిస్తాయి. వీటిల్లో ఆయా వివరాలను జోడించుకొని ఫిల్టర్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. అన్ని బాక్సులను నింపాల్సిన అవసరం లేదు. వడపోతకు తోడ్పడే అంశాలను మాత్రమే జోడించుకోవాలి.

  •  ఫ్రమ్‌ బాక్సులో- ఎవరెవరి మెయిళ్లను ఫిల్టర్‌ చేయాలనుకుంటున్నారో వారి ఈమెయిల్‌ అడ్రస్‌లను చేర్చాలి. ఒకవేళ వద్దనుకుంటే ఈ బాక్సును అలాగే వదిలేయొచ్చు.
  • టు బాక్స్‌లో- ఒకవేళ చాలా ఈమెయిల్‌ ఖాతాలు మెర్జ్‌ అయ్యింటే, వాటి నుంచి వచ్చే మెయిళ్లను విడివిడిగా విభజించుకోవాలనుకుంటేనే ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటిదేమీ లేకపోతే బాక్సును ఖాళీగా ఉంచేయొచ్చు.
  •  సబ్జెక్టు బాక్స్‌లో- కొత్త ఫోల్డర్‌లోకి పంపించుకోవాలని భావిస్తున్న మెయిళ్ల సబ్జెక్టును ఇందులో టైప్‌ చేయాలి. కావాలనుకుంటే ఎక్కువ కీవర్డ్స్‌నూ రాసుకోవచ్చు. వాటిని నిలువు గీతలతో వేరు చేసుకోవచ్చు. ఉదాహరణకు- రివ్యూ।ఫ్రీ।చెక్‌అవుట్‌.
  •  హ్యాజ్‌ ద వర్డ్స్‌- మెయిల్‌లో ఎక్కడైనా కనిపించే కీవర్డులను ఇందులో చేర్చుకోవాలి. ఒకటికన్నా ఎక్కువ పదాలుంటే వాటి మధ్య నిలువు గీతలతో వేరు చేసుకోవాలి.
  •  డసెంట్‌ హ్యావ్‌ బాక్స్‌లో- పై బాక్సుల్లో పేర్కొన్న అంశాలకు సరిపోయినా ఫిల్టర్‌ కావొద్దనుకునే పదాలను ఇందులో చేర్చుకోవాలి. ఆయా ముఖ్యమైన మెయిళ్లు ఫిల్టర్‌ కాకుండా చూసుకోవటానికిది తోడ్పడుతుంది.
  •  బాక్సుల్లో వివరాలు పొందు పరచాక కింద కుడి మూలన కనిపించే ‘క్రియేట్‌ ఫిల్టర్‌ విత్‌ దిస్‌ మెయిల్‌’ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి.
  •  అనంతరం ‘అప్లయి ద బార్‌’ బాక్సులో టిక్‌ గుర్తు పెట్టుకొని సృష్టించుకున్న లేబుల్‌ను ఎంచుకోవాలి. కింద కుడివైపున ఉండే ‘ఆల్సో అప్లయి ఫిల్టర్‌ టు మ్యాచింగ్‌ కన్వర్జేషన్స్‌’ బాక్సులోనూ టిక్‌ పెట్టకొని ‘క్రియేట్‌ ఫిల్టర్‌’ బటన్‌ను క్లిక్‌ చేయాలి.
  •  అప్పటికే ఉన్నవైనా, కొత్తగా వచ్చేవైనా ఈ ఫిల్టర్‌ విధానానికి సరిపోయిన మెయిళ్లనీ వాటంతటవే ఎంచుకున్న ఫోల్డర్‌లోకి వెళ్లిపోతాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని