పదాలతోనే ఐ ఫోన్‌ ముచ్చట

స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరి పరికరంగా మారిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే టెక్‌ సంస్థలు కూడా వివిధ అవసరాలు తీర్చేలా ఫోన్లను తీర్చిదిద్దుతున్నాయి. వైకల్యం గలవారికి అనువుగా ఉండే ఫీచర్లనూ జోడిస్తున్నాయి

Published : 10 Jan 2024 00:43 IST

స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరి పరికరంగా మారిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే టెక్‌ సంస్థలు కూడా వివిధ అవసరాలు తీర్చేలా ఫోన్లను తీర్చిదిద్దుతున్నాయి. వైకల్యం గలవారికి అనువుగా ఉండే ఫీచర్లనూ జోడిస్తున్నాయి. ఈ విషయంలో యాపిల్‌ సంస్థ ఒకడుగు ముందే ఉంటుంది. వాయిస్‌ కంట్రోల్‌, అసిస్టివ్‌ యాక్సెస్‌ ఫీచర్లే దీనికి ఉదాహరణ. కృత్రిమ మేధతో కూడిన ఇవి మాటలు రానివారికి, చూపు సరిగా కనిపించనివారికి మేలు చేస్తాయి. ఐఓఎస్‌ 17 అప్‌డేట్‌తో కూడిన పరికరాల్లో వీటిని వాడుకోవచ్చు.

 ప్రత్యక్ష సంభాషణ

పదాలను టైప్‌ చేస్తే, అవి మాటలుగా వినిపిస్తే? లైవ్‌ స్పీచ్‌ సదుపాయం ఇలాంటి అవకాశమే కల్పిస్తుంది. మాట పోయినవారు, జబ్బులతో మాట్లాడలేనివారు ఎదుటివారికి ఏదైనా చెప్పాలనుకుంటే ఫోన్‌లో టైప్‌ చేస్తే చాలు. దాన్ని ఫోన్‌ స్పీకర్‌ పైకి బిగ్గరగా చదివి వినిపిస్తుంది. ఫేస్‌ టైమ్‌ కాల్స్‌లోనూ దీన్ని వాడుకోవచ్చు. కొన్ని వాక్యాలను టైప్‌ చేసి సేవ్‌ చేసుకోవచ్చు కూడా. అవసరం వచ్చినప్పుడు ఈ వాక్యాల మీద తాకితే మాటలుగా వినిపిస్తాయి. ఎక్కువమందితో మాట్లాడాల్సిన సమయాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ ఐప్యాడ్‌, మ్యాక్‌ కంప్యూటర్లలోనూ పనిచేస్తుంది.

మాట సురక్షితం

ఏఎల్‌ఎస్‌ వంటి క్షీణత సమస్యలు గలవారికి మున్ముందు మాట పోయే ప్రమాదముంది. ఇలాంటివారు తమ గొంతును రికార్డు చేసి, దాన్ని వాడుకోవటానికీ ఐఫోన్‌ ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని పేరు పర్సనల్‌ వాయిస్‌. ఇందుకోసం ఐఫోన్‌లో గానీ ఐప్యాడ్‌లో గానీ 15 నిమిషాల సేపు ఏదో ఒకటి మాట్లాడి రికార్డు చేసి, సేవ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పరికరంలోని కృత్రిమ మేధ పర్సనల్‌ వాయిస్‌గా మారుస్తుంది. ఇది అచ్చం రికార్డు చేసినవారికి గొంతునే పోలి ఉంటుంది. టెక్స్ట్‌ను మాటలుగా వినిపించే సమయంలో అదే గొంతుతో వినిపిస్తుంది. దీన్ని లైవ్‌ స్పీచ్‌ కోసమూ వాడుకోవచ్చు. అప్పుడు తాము మాట్లాడుతున్నట్టే ఉంటుంది.

చూపు తగ్గినవారికీ..

ఐఓఎస్‌ కోసం యాపిల్‌ ప్రామాణిక విజువల్‌ ఇంటర్ఫేస్‌ను కల్పిస్తుంది. కానీ చూపు సరిగా కనిపించనివారికిది కొంత ఇబ్బంది కలిగించొచ్చు. ఇలాంటివారికి అసిస్టివ్‌ యాక్సెన్‌ మోడ్‌ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇది ఐకన్లు, టెక్స్ట్‌ లేబుళ్లను పెద్దగా కనిపించేలా చేస్తుంది. కాల్స్‌కు జవాబివ్వటం, ఫొటోలు తీయటం, హోంస్క్రీన్‌కు తిరిగి వెళ్లటానికి వాడే బటన్లూ పెద్దగా కనిపిస్తాయి. చూపు మందగించిన వృద్ధులకిది ఎంతో అనువుగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని