రాకెట్‌ వడిసెల!

రాకెట్‌ ప్రయోగం సంక్లిష్టమైన ప్రక్రియ. భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించే వేగంతో దూసుకెళ్తేనే గానీ అంతరిక్షంలోకి ప్రవేశించటం సాధ్యం కాదు. ఇందుకు ఎంతో ఇంధనం కావాలి. మరి ఇంధనంతో పనిలేకుండానే రాకెట్‌ దూసుకెళ్తే?

Published : 05 Jan 2022 00:43 IST

రాకెట్‌ ప్రయోగం సంక్లిష్టమైన ప్రక్రియ. భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించే వేగంతో దూసుకెళ్తేనే గానీ అంతరిక్షంలోకి ప్రవేశించటం సాధ్యం కాదు. ఇందుకు ఎంతో ఇంధనం కావాలి. మరి ఇంధనంతో పనిలేకుండానే రాకెట్‌ దూసుకెళ్తే? అదీ వడిసెలను తలపించే పరికరంతో అయితే? అమెరికాలోని స్పిన్‌లాంచ్‌ సంస్థ అలాంటి ప్రయత్నమే చేస్తోంది!

క్షులను పారదోలటానికి వడిసెలతో రాళ్లను విసరటం చూసే ఉంటారు. వడిసెలను గుండ్రంగా తిప్పి, వదిలినప్పుడు గతి శక్తితో రాయి వేగంగా చాలా దూరం వెళ్తుంది కదా. సరిగ్గా ఇలాంటి సూత్రంతోనే స్పిన్‌లాంచ్‌ విధానం పనిచేస్తుంది. ఉపగ్రహాలను మోసుకెళ్లే పెద్ద రాకెట్‌ను అంత వేగంతో ‘విసరటం’ సాధ్యమేనా అని అనుకుంటున్నారా? ఇది కేవలం ఊహ కాదు. దీన్ని ఇటీవల ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించారు కూడా. మామూలుగానైతే రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతుంటారు. ఇంధనం మండినప్పుడు పుట్టుకొచ్చే చోదకశక్తి రాకెట్లను ముందుకు తోస్తుంది. గురుత్వాకర్షణ ప్రభావాన్ని దాటుకొని దూసుకుపోవటానికిది వీలు కల్పిస్తుంది. అంతరిక్షంలోకి చేరుకున్నాక రాకెట్‌ నుంచి ఉపగ్రహాలు, పరికరాల వంటివి విడిపోతాయి. ఇప్పుడు తిరిగి వాడుకునే రాకెట్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే ఇంధనానికే చాలా ఖర్చవుతుంది. ఇంధనం మండినప్పుడు పర్యావరణానికి హాని చేసే వాయువులూ విడుదలవుతాయి. ఇలాంటి ఇబ్బందులను తప్పించే ప్రత్యామ్నాయ మార్గంగానే స్పిన్‌లాంచ్‌ ముందుకొస్తోంది.

లాభాలెన్నో
సంప్రదాయ రాకెట్లలో చాలా భాగం ఇంధనం నిల్వకే సరిపోతుంది. అదే స్పిన్‌లాంచ్‌ ద్వారా ప్రయోగించే రాకెట్లకు పెద్దగా ఇంధనం అవసరముండదు కాబట్టి చోటు మిగులుతుంది. రాకెట్‌ సైజు తగ్గుతుంది. ఎక్కువ ఇంజిన్లు అవసరముండవు. దీంతో సంక్లిష్టత, ఖర్చు తగ్గుతాయి. స్పిన్‌లాంచ్‌ సుమారు 200 కిలోల బరువైన ఉపగ్రహాలను, పరికరాలను అంతరిక్షంలోకి ప్రయోగించగలదు. అందువల్ల ఒకేసారి రెండు చిన్న ఉపగ్రహాలను తేలికగా పంపటానికి వీలుంటుంది.


గుండ్రటి పెట్టెలాంటి యాక్సిలరేటర్‌ కీలకం

స్పిన్‌లాంచ్‌ వ్యవస్థలో సబ్‌ఆర్బిటల్‌ యాక్సిలేటర్‌ చాలా కీలకమైన విభాగం. చూడటానికిది పెద్ద గుండ్రటి పెట్టెలా కనిపిస్తుంది. దీనికి ఒకవైపున ఆకాశంలోకి చూస్తున్న గొట్టం అమర్చి ఉంటుంది. దీని ఎత్తు 165 అడుగులు. లిబర్టీ విగ్రహం కన్నా పొడవైంది. దీని లోపల శూన్యంతో కూడిన గది, అందులో గడియారం ముల్లు మాదిరిగా ఒక పట్టీ ఉంటాయి. రాకెట్‌ను బిగించేది దీనికే. ఈ పట్టీ గుండ్రంగా తిరుగుతూ, క్రమంగా వేగాన్ని సంతరించుకుంటుంది. శబ్ద వేగాన్ని అందుకున్నాక మిల్లీ సెకండు వ్యవధిలో రాకెట్‌ వదిలేస్తుంది. అప్పుడు గొట్టం ద్వారా రాకెట్‌ ఆకాశంలోకి ఎగురుతుంది. మొదట్లో ఇలాంటి ప్రయోగం అసాధ్యమనే అంతా భావించారు. దీని మీద ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. కానీ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమయ్యాక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్పిన్‌లాంచ్‌ యాక్సిలరేటర్‌ సామర్థ్యంలో 20 శాతంతోనే లక్షలాది అడుగుల ఎత్తులోకి రాకెట్‌ను ప్రయోగించటం గమనార్హం. తొలి పరీక్షలో రాకెట్‌కు ఎలాంటి ఇంజిన్‌ను అమర్చలేదు. మున్ముందు పరీక్షల్లో ఇంజిన్‌తో పాటు ఇతర అంతర్‌ వ్యవస్థలను జోడించాలని భావిస్తున్నారు. రాకెట్‌ను తిరిగి వాడుకోవటానికి వీలుగా మళ్లీ భూమ్మీదికి రప్పించేందుకూ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి ప్రయోగానికి వాడిన రాకెట్‌ను తిరిగి పట్టుకున్నారు కూడా. ఇది మళ్లీ ప్రయోగానికి పూర్తిగా అనువుగా ఉండటం విశేషం. వచ్చే ఆరు నెలల్లో ఇలాంటి 30 ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని