టీ, కాఫీ.. హుషారు గుట్టు

పొద్దున లేవనగానే వేడి వేడి కాఫీనో, టీనో గొంతులోకి దిగకపోతే మనలో చాలామందికి రోజు మొదలుకాదు. ఇవి లేకపోతే కొందరికి ఏకంగా ఆలోచనలన్నీ స్తంభించిపోతాయి. పగలైనా, రాత్రయినా హుషారుగా, అప్రమత్తంగా ఉండాలంటే కొందరికివి తప్పనిసరి.

Updated : 01 Sep 2022 06:12 IST

పొద్దున లేవనగానే వేడి వేడి కాఫీనో, టీనో గొంతులోకి దిగకపోతే మనలో చాలామందికి రోజు మొదలుకాదు. ఇవి లేకపోతే కొందరికి ఏకంగా ఆలోచనలన్నీ స్తంభించిపోతాయి. పగలైనా, రాత్రయినా హుషారుగా, అప్రమత్తంగా ఉండాలంటే కొందరికివి తప్పనిసరి. సామాజిక సంబంధాలకూ ఇవి అవసరమే. స్నేహితులు కలిసినా, బంధువులు ఇంటికి వచ్చినా కమ్మటి టీ, కాఫీలు ఆత్మీయంగా అందించకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది. ప్రపంచంలో అతి ఎక్కువగా తాగే పానీయాలు ఇవే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ 200 కోట్లకు పైగా కప్పుల కాఫీ, 370 కోట్లకు పైగా కప్పుల టీ తాగుతున్నారని అంచనా. ఇవి ఇంతటి ఆదరణ పొందటానికి కారణమేంటో తెలుసా? రుచి, వాసనలే. వీటికి కారణం టీ, కాఫీల్లోని సంయోగ పదార్థాలే.

టీ, కాఫీ అనగానే మనసు తహతహలాడుతుంది. ఒక్క గుటక నోట్లో పడితే ఆ హాయే వేరు. ఇంతలా ఇవి మనల్ని కట్టిపడేయటానికి కారణం వీటిల్లోని సంయోగ పదార్థాలే. ఇవే వీటికి ప్రత్యేకమైన రుచి, వాసనలు సంతరించి పెడతాయి. హుషారుగా ఉండటానికి కాఫీ సేవించినా, విశ్రాంతి పొందటానికి టీ గుటకేసినా ఇలాంటి పదార్థాలన్నింటినీ తాగుతున్నట్టే. బ్లాక్‌, గ్రీన్‌, వైట్‌, వూలాంగ్‌, ఎల్లో, ప్యూయెర్‌.. ఇలా ఆరు రకాల టీలు ఉన్నాయి. ఇవన్నీ కేమీలియా సైనెన్సిన్‌ మొక్క నుంచే వస్తాయి. కానీ దేని రుచి దానిదే. తేయాకులను సేకరించాక వీటిని ప్రాసెస్‌ చేసే తీరును బట్టి రుచి మారుతుంది. బ్లాక్‌, వూలాంగ్‌ టీలను ఆక్సీకరణ ప్రక్రియతో తయారుచేస్తారు. గాలిలోని ఆక్సిజన్‌తో ఆకుల్లోని ఎంజైమ్‌లు ప్రతిచర్య జరిపేలా చేయటం దీనిలోని కీలకాంశం. టీ, కాఫీల్లోని సంయోగ పదార్థాల్లో చిరపరిచితమైంది కెఫీన్‌. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. పాలీఫెనాల్స్‌ విషయానికి వస్తే వీటికి యాంటీఆక్సిడెంట్‌ గుణాలుంటాయి. ఇవి గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి జబ్బుల నుంచి కాపాడతాయి. టీ, కాఫీల్లో రకరకాల పాలీఫెనాల్స్‌ ఉంటాయి. బ్లాక్‌ టీలో ప్రధానంగా థియాఫ్లావిన్లు, థియారుబిగిన్లు, కాటేచిన్స్‌ ఉంటే.. కాఫీలో క్లోరోజెనిక్‌ ఆమ్లం, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి.

చరిత్ర పాతదే
టీ, కాఫీ సేవనం ఈనాటిది కాదు. వేలాది ఏళ్లుగా వస్తున్నదే. వీటి పుట్టుక ఎన్నో రహస్యాలు, జానపద కథలతో ముడిపడి ఉండటం గమనార్హం. ఒక పాత కథ ప్రకారం.. పురాతన చైనాలో 5వేల ఏళ్ల క్రితం షెనాంగ్‌ అనే చక్రవర్తి తేనీరును తయారుచేశారు. గాల్లో తేలియాడుతూ వచ్చిన తేయాకులు మరుగుతున్న నీటిలో పడటం దీనికి మూలం. షెనాంగ్‌ చక్రవర్తికి మూలికా వైద్యం మీద పట్టుంది. ఆయన ఆ తేయాకు డికాక్షన్‌ను రుచి చూడటం, అది కొత్తగా ఉండటం టీ కాచుకోవటానికి బీజం వేసింది. ఇలా యాదృచ్ఛికంగా మొదలైన టీ రుచి ఆ నోటా ఈ నోటా శరవేగంగా విస్తరించింది. అప్పట్లో దీన్ని ఆహారం జీర్ణం కావటానికీ మందుగా వాడుకునేవారు. ప్రత్యేకంగా టీ ఉత్సవాలు కూడా నిర్వహించేవారు. టీ పుట్టుకొచ్చిన 3వేల ఏళ్ల తర్వాత అంతే యాదృచ్ఛికంగా కాఫీ ప్రస్థానం మొదలైంది. ఇది ఇథియోపియాలో ఆరంభమైంది. కాఫీ అరేబికా చెట్టుకు కాసిన ఎర్రటి పండ్లను తిన్న తర్వాత మేకలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు కాల్డి అనే గొర్రెల కాపరి గుర్తించాడు. కారణమేంటో తెలుసుకుందామని తానూ కొన్ని పండ్లను నోట్లో వేసుకున్నాడు. తనకూ అలాగే అనిపించింది. ఇదే అతడికి ‘ఆనంద అరేబియాలో అత్యంత సంతోష కాపరి’ అనే పేరు తెచ్చిపెట్టింది. అయితే ఇదొక కథ మాత్రమే. అంతకన్నా వేలాది ఏళ్ల క్రితమే ఓరోమో ప్రజలు కాఫీ మొక్కల గింజలను, ఆకులను నమిలేవారని భావిస్తుంటారు. వీటిని కొవ్వుతో కలిపి బలవర్ధక పట్టీలను తయారుచేసేవారని చెబుతారు.

టీ వాసన కారకాలు
వివిధ సంయోగ పదార్థాలు టీ వాసన వైవిధ్యానికి తోడ్పడతాయి.
* (జెడ్‌)-3-హెక్సెన్‌-1-ఓఎల్‌: టీ ప్రత్యేకమైన వాసనకు తోడ్పడే ప్రధాన సంయోగ పదార్థం ఇదే.
* లినలూల్‌: ఇది పువ్వుల మాదిరి, తీయటి వాసన ఇచ్చే పదార్థం.                  బ్లాక్‌ టీ, వూలాంగ్‌ టీలో ఎక్కువగా ఉంటుంది.
* బెంజైల్‌ ఆల్కహాల్‌: ఇది టీకి తీయటి, తేనె వంటి రుచిని తెచ్చిపెడుతుంది.
* పైరనాయిడ్‌: లినలూల్‌ ఆక్సైడ్‌ అయిన ఇది టీకి మట్టి వాసన చేకూరుస్తుంది. గ్రీన్‌, బ్లాక్‌, వూలాంగ్‌ టీలో ఉంటుంది.
* ఫ్యూరనాయిడ్‌: ఇది మరో రకం లినలూల్‌ ఆక్సైడ్‌. దీనికీ పువ్వుల మాదిరి, తీయటి వాసన ఇచ్చే గుణముంది. అలాగే క్రీమియర్‌ వానస కూడా ఇస్తుంది.

ఇంతింత కాదయా కెఫీన్‌ ప్రభావం
కెఫీన్‌ ప్రభావాలు సుమారు 15 నిమిషాల వరకు ఉంటాయి. అయితే రక్తంలోంచి ఇది పూర్తిగా తొలగిపోవటానికి మాత్రం 10 గంటలు పడుతుంది. ఆరోగ్యవంతులు రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్‌ తీసుకోవచ్చు. ఇది సుమారు నాలుగు కప్పుల కాఫీతో సమానం. గర్భిణులైతే రోజుకు 200 మిల్లీగ్రాముల కన్నా మించనీయకూడదు. మరి ఇది ఏయే అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దామా.
* మెదడు: కెఫీన్‌ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇలా మరింత ఎక్కువ అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది. నిద్ర మత్తు రానీయదు. అలసట భావన కలగనీయకుండా హుషారుగా ఉంచుతుంది. అయితే మరీ ఎక్కువగా తీసుకుంటే తికమక, చిరాకు, తలనొప్పుల వంటి వాటికి దారితీస్తుంది.
* గుండె: కెఫీన్‌ మంచి ఉత్ప్రేరకం. కాబట్టి ఇది గుండె కొట్టుకునే వేగం పెరిగేలా చేస్తుంది. తాత్కాలికంగా రక్తపోటునూ పెంచుతుంది. అయితే చాలామంది ఆరోగ్యవంతులకు ఇవేమీ హాని చేయవు.
* జీర్ణాశయం: కెఫీన్‌కు ఆమ్ల స్వభావం ఎక్కువ. ఇది అన్నవాహిక దిగువ కండర వలయాన్ని వదులుగా చేస్తుంది. దీంతో ఆహారం, జీర్ణ రసాలు జీర్ణాశయం నుంచి పైకి ఎగదన్నుకు వచ్చి ఛాతీలో మంట పుడుతుంది.
* పెద్దపేగు: కెఫీన్‌ జీర్ణకోశాన్నీ ఉత్తేజితం చేయగలదు. ఇలా మల విసర్జన కావటానికి తోడ్పడుతుంది. కానీ మరీ ఎక్కువగా తాగితే మాత్రం విరేచనాలకు కారణమవుతుంది.

కెఫీన్‌ను ఎలా తొలగిస్తారు?
నిద్ర పట్టనీయకపోవటం వంటి దుష్ప్రభావాలను తగ్గించటానికి కాఫీలోని కెఫీన్‌ను వేరు చేస్తుంటారు. దీన్నే డీకెఫినేషన్‌ అంటారు.
* ముందుగా కాఫీ గింజలను నీటిలో నానబెడతారు. దీంతో గింజల రంధ్రాలు విచ్చుకుంటాయి. వీటిల్లోంచి కెఫీన్‌ లోపలికి, బయటకు కదలటానికి వీలవుతుంది.
* తర్వాత ఈ గింజలను స్టీలు ఎక్స్‌ట్రాక్టర్‌లో పెడతారు. దీనిలోకి ఒత్తిడితో కూడిన ద్రవ కార్బన్‌ డయాక్సైడ్‌ను పంపిస్తారు. ఒత్తిడి మూలంగా కార్బన్‌ డయాక్సైడ్‌ కొంత ద్రవ స్థితిలో, కొంత వాయు స్థితిలోకి మారుతుంది.
* కార్బన్‌ డయాక్సైడ్‌ కెఫీన్‌కు అంటుకుపోతుంది. ఇది అయస్కాంతం మాదిరిగా పనిచేసి గింజల్లోంచి కెఫీన్‌ను లాగేసుకుంటుంది.  
* అనంతరం 12 గంటల తర్వాత కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగిస్తారు. కెఫీన్‌ రహిత గింజలను వేరే గదిలో పెడతారు. ఈ ప్రక్రియలో కాఫీ గింజల్లోంచి 96-98 శాతం కెఫీన్‌ తొలగిపోతుంది.


కాఫీ కప్పు లోపల
కాఫీలో వెయ్యికి పైగా సంయోగ పదార్థాలుంటాయి. వాటిల్లో కొన్ని ఇవీ..
* క్లోరోజెనిక్‌ ఆమ్లం: కాఫీ చేదుగా ఉండటానికి ముఖ్య కారణం ఇదే. దీనిలోని యాంటీఆక్సిడెంట్‌, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు టైప్‌2 మధుమేహం, గుండెజబ్బుల నివారణకు తోడ్పడతాయి.
* కెఫెస్టాల్‌: ఇది శరీరం కొలెస్ట్రాల్‌ను నియంత్రించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రోజుకు ఐదు కప్పుల చొప్పున నాలుగు వారాల పాటు ఫిల్టర్‌ చేయని కాఫీని తాగితే కొలెస్ట్రాల్‌ మోతాదులు 6-8 శాతం పెరిగే అవకాశముంది.
* కావియోల్‌: కెఫెస్టాల్‌ మాదిరిగానే ఇదీ రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులను పెంచొచ్చు. అయితే దీనికి వాపు (ఇన్‌ఫ్లమేషన్‌), క్యాన్సర్‌ను నివారించే గుణముండటం విశేషం.
* మెలానోయిడిన్స్‌: కాఫీ గింజలను వేడి చేసే ప్రక్రియలో ఇవి పుట్టుకొస్తాయి. కాఫీ గింజలు ఆకుపచ్చ రంగు నుంచి బ్రౌన్‌ రంగులోకి మారటానికి కారణమయ్యేవి ఇవే.
* ట్రైగోనెలిన్‌: ఇది కాఫీకి మట్టి, తీయని రుచిని ప్రసాదిస్తుంది. పళ్లు పుచ్చి పోవటానికి కారణమయ్యే స్ట్రెప్టోకాకస్‌ మ్యుటాన్స్‌ అనే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఈ బ్యాక్టీరియాను దంతాలకు అంటుకోకుండా నిలువరిస్తుంది.

డోపమైన్‌, అడినోసిన్‌తో కలిసి..
కెఫీన్‌ శాస్త్రీయ నామం ట్రైమిథైల్‌గ్జాంతిన్‌. ఇది కాఫీ గింజలు, కోకో గింజలు, టీలతో పాటు చాలా మొక్కల్లో సహజ సిద్ధంగా ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఫ్రీడ్‌లీబ్‌ ఫెర్డినాండ్‌ రంజే అనే జర్మన్‌ రసాయన శాస్త్రవేత్త 1819లో తొలిసారి కాఫీ గింజల నుంచి వేరు చేశారు. శుద్ధమైన స్థితిలో కెఫీన్‌ తెల్లని పొడిలా ఉంటుంది. దీన్ని కూల్‌డ్రింకుల్లోనూ కలపొచ్చు. జర్మనీకి చెందిన లుడ్వింగ్‌ రోజెలియస్‌ తొలిసారిగా 1903లో కాఫీని కెఫీన్‌ రహితంగా మార్చటంలో విజయం సాధించారు. ఇంతకీ కెఫీన్‌తో ఎందుకు హుషారు కలుగుతుంది? మన మెదడులో అడినోసిన్‌, డోపమైన్‌ అనే నాడీ సమాచార వాహకాలు ఉత్పత్తి అవుతాయి. అడినోసిన్‌ దాని గ్రాహకాలకు అంటుకొని నిద్ర మత్తు, మరింత ఎక్కువ విశ్రాంతి భావన కలిగిస్తుంది. డోపమైనేమో ఆనందం, బాధ, భావోద్వేగాలు, కండరాల నియంత్రణలో పాలు పంచుకుంటుంది. కెఫీన్‌ ఈ డోపమైన్‌ గ్రాహకాలను మరింత ఉత్తేజపరుస్తుంది. దీంతో హాయి భావన కలిగిస్తుంది. చాక్లెట్‌ తిన్నప్పుడు హాయిగా అనిపించటానికి కారణమిదే. మరోవైపు కెఫీన్‌ నిర్మాణం అడినోసిన్‌ను పోలి ఉంటుంది. అందువల్ల ఇది అడినోసిన్‌ గ్రాహకాలను బురిడీ కొట్టించి వాటికి అతుక్కుపోతుంది. అదే సమయంలో అడినోసిన్‌ను వాటికి అంటుకోనీయదు. ఇలా మత్తు, విశ్రాంతి భావనను తగ్గించి.. మరింత అప్రమత్తంగా, హుషారుగా ఉండేలా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని