మెదడులాంటి మెమరీ పరికరం

ప్రస్తుత డేటా వినియోగ ప్రపంచంలో రోజురోజుకీ విద్యుత్తు డిమాండ్‌ పెరిగిపోతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించటాన్ని ఇది మరింత క్లిష్టం చేస్తోంది.

Published : 19 Jul 2023 00:29 IST

ప్రస్తుత డేటా వినియోగ ప్రపంచంలో రోజురోజుకీ విద్యుత్తు డిమాండ్‌ పెరిగిపోతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించటాన్ని ఇది మరింత క్లిష్టం చేస్తోంది. కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ వాడకం, అల్గారిథమ్‌లు, ఇతర డేటా ఆధారిత టెక్నాలజీలు మున్ముందు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే విద్యుత్తులో సుమారు మూడింట ఒక వంతును వినియోగించుకుంటాయని అంచనా. ఇంతలా విద్యుత్తు డిమాండ్‌ పెరగటానికి చాలావరకు ఇప్పుడున్న కంప్యూటర్‌ మెమరీ టెక్నాలజీలే కారణం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి ఆధ్వర్యంలోని పరిశోధకులు కొత్తరకం కంప్యూటర్‌ మెమరీని డిజైన్‌ చేశారు. ఇది కంప్యూటర్ల సామర్థ్యాన్ని పెంచటమే కాదు.. ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీల విద్యుత్తు అవసరాలనూ తగ్గించగలదు. సంప్రదాయ మెమరీ పరికరాలు బిట్స్‌ రూపంలో (1 లేదా 0) సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. ఇది కంప్యూటర్‌ వ్యవస్థలో చాలా చోట్ల ప్రాసెస్‌ అవుతుంది. అందువల్ల సమాచారం ముందకూ వెనక్కూ మారాల్సి వస్తుంది. ఈ క్రమంలో విద్యుత్తు, సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి. రెసిస్టివ్‌ స్విచ్ఛింగ్‌ మెమరీ అని పిలుచుకునే తాజా టెక్నాలజీ ఈ సమస్యకు పరిష్కారం చూపగలదని భావిస్తున్నారు. ఇది సమాచారాన్ని రెండు స్థితుల్లో కాకుండా నిరంతర శ్రేణి దశలుగా సృష్టిస్తుంది. అందువల్ల వేగం, నిల్వ గణనీయంగా పెరుగుతుందని అనుకుంటున్నారు. ఉదాహరణకు- ఈ పద్ధతిలో తయారయ్యే ఒక యూఎస్‌బీ 10 నుంచి 100 రెట్ల ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేసుకోగలదని పరిశోధకులు చెబుతున్నారు. హాఫ్నియం ఆక్సైడ్‌ సాయంతో ఈ ప్రయోగాత్మక రెసిస్టివ్‌ స్విచ్ఛింగ్‌ మెమరీ పరికరాన్ని రూపొందించారు. అయితే హాఫ్నియంతో చిక్కేంటంటే అణుస్థాయిలో దీనికి ఆకృతి లేకపోవటం. అక్కడ హాఫ్నియం, ఆక్సిజన్‌ అణువులు అక్కడక్కడా కలిసిపోయి ఉంటాయి. అయితే ఈ అణువుల మిశ్రమంతో తయారుచేసిన పొరలకు బేరియంను కలిపినప్పుడు కొన్ని అసాధారణ ఆకృతులు ఏర్పడటం విచిత్రం. బేరియంతో కూడిన ఈ నిలువు ‘వంతెనల’ వంటి నిర్మాణాల గుండా ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా తిరుగాడటం కొత్త మెమరీ పరికరం తయారీకి వీలు కల్పించింది. పదార్థంలో పలు దశలు ఏర్పడటానికి ఆస్కారం కలిగించింది. ఇవి మెదడులో నాడీ కణాల మధ్య అనుసంధానాల మాదిరిగా పనిచేస్తుండటం విశేషం. మన మెదడు మాదిరిగానే ఒకేచోట సమాచారాన్ని నిల్వ చేసుకొని, విడమరచుకోగలవు కూడా. శరవేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ రంగాలకు ఇది కొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు