మేధోత్పత్తి!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌! కృత్రిమ మేధ!! శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇప్పుడిది పెను సంచలనమే సృష్టిస్తోంది. అన్ని రంగాల మీదా ఆధిపత్యాన్ని సాధిస్తూ మనిషి మెదడుకే సవాలు విసురుతోంది.

Published : 27 Sep 2023 00:35 IST

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌! కృత్రిమ మేధ!! శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇప్పుడిది పెను సంచలనమే సృష్టిస్తోంది. అన్ని రంగాల మీదా ఆధిపత్యాన్ని సాధిస్తూ మనిషి మెదడుకే సవాలు విసురుతోంది. డ్రైవర్‌ లేకుండా నడిచే స్వయం చోదక వాహనాలు, మనిషిని పోలిన రోబోలు, సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచే ఛాట్‌జీపీటీ, ప్రముఖ చిత్రకారులనే తలదన్నే ఇమేజ్‌ క్రియేటర్లు.. ఇలా చెప్పుకొంటూ పోతే కృత్రిమ మేధ చేయని పనంటూ లేదోమోననీ అనిపిస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వాణిజ్యవేత్తల దగ్గరి నుంచి సామాన్యుల వరకూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ దీని కథా కమామీషేంటి? ఎలా పనిచేస్తుంది? ఇది మనిషి మేధనూ అధిగమిస్తుందా?

నిషి మేధస్సు అమోఘం. సృష్టికే ప్రతిసృష్టి చేయగలదు. మరి మేధస్సునే కృత్రిమంగా సృష్టిస్తే? ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అలాంటి అద్భుతమే. యంత్రాలు, పరికరాలకు మనిషిలా ఆలోచించే గుణాన్ని కల్పించటం, తమకు తామే పనిచేసేలా తర్ఫీదు ఇవ్వటమంటే మాటలా? ఇది నిజమేనని చెబితే ఒకప్పుడు కల్పిత కథగా కొట్టిపారేసేవారేమో. కానీ కళ్ల ముందు ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు ఔరా అనక తప్పదు. కృత్రిమ మేధ కథ ఇప్పటిదేమీ కాదు. వందేళ్లకు ముందే మొదలైంది. లెక్కలను పరిష్కరించే ప్రాథమిక పోగ్రాముల రూపంలో 1900 తొలినాళ్ల నుంచే ఉంది. రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా జర్మనీ సైన్యం కోడ్‌ను ఛేదించిన బ్రిటన్‌ శాస్త్రవేత్త అలన్‌ ట్యూరింగ్‌ ‘మొట్టమొదటి ఇంటెలిజెంట్‌ పరికరం’ అనదగ్గ టూల్‌ను రూపొందించారు. అదే ట్యూరింగ్‌ మెషిన్‌. టేపు సాయంతో పనిచేసే ఇది చిన్న చిన్న లెక్కలను పరిష్కరించేది. అమెరికా కంప్యూటర్‌ శాస్త్రవేత్త జాన్‌ మెక్‌కార్తీ 1955లో తొలిసారి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనే పేరును ఉపయోగించారు. యంత్రాలు, పరికరాలకు ‘తెలివిని’ సంతరించి పెట్టే శాస్త్రానికి సంబంధించిందనే అర్థంలో దీన్ని ముందుకు తీసుకొచ్చారు. కంప్యూటర్‌ రంగ మార్గదర్శులు హెర్బర్ట్‌ ఎ. సైమన్‌, అలెన్‌ నెవెల్‌ 1956లో మనిషి తెలివితో పోల్చదగిన తొలి టెక్నాలజీని రూపొందించారు. దీని పేరు లాజిక్‌ థియోరిస్ట్‌. దీన్ని ‘థింకింగ్‌ మెషిన్‌’ అనీ పిలుచుకునేవారు. ఇదో కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌. ఆల్‌ఫ్రెడ్‌ నార్త్‌ వైట్‌హెడ్‌ రాసిన ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గణిత పుస్తకాల్లోని సిద్ధాంతాలను విశ్లేషించటం దీని ఉద్దేశం. ఈ పుస్తకాల్లోని 52 సిద్ధాంతాల్లో 38 సూత్రాలను ఇది నిరూపించింది. ఒక సూత్రానికైతే మరింత లోతైన సమాధానాన్నీ అందించి అబ్బుర పరిచింది. మెషిన్‌ లెర్నింగ్‌ ఎంత గొప్పగా ఉపయోగపడగలదో ఇది ఆనాడే రుజువు చేసింది. అప్పటి నుంచీ కృత్రిమ మేధ విస్తరిస్తూనే వస్తోంది. ఇప్పుడిది ప్రయోగశాలలు, పరీక్షలు దాటుకొని ఇంటింటికీ విస్తరించింది. అలెక్సా, సిరి వంటి స్మార్ట్‌ అసిస్టెంట్లు, స్మార్ట్‌ఫోన్లలో ఫేషియల్‌ రికగ్నిషన్‌, యూట్యూబ్‌లో తర్వాత వచ్చే వీడియో సిఫారసులు, వెబ్‌ బ్రౌజర్‌లో సెర్చ్‌ చేస్తున్నప్పుడు పదాల సూచనలు, స్పెల్‌ చెకింగ్‌ వంటివన్నీ దీని మహత్తులే.


మెదడు మాదిరిగా..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు మెదడే స్ఫూర్తి. దీంతో కూడిన పరికరాలు, సాధనాలన్నీ మన ప్రాధాన్యాలు, శరీర కొలతలు, ఆన్‌లైన్‌ ప్రవర్తనలను వంటి వాటిని గమనించి, సంగ్రహిస్తాయి. ఆయా సందర్భాలకు ఎలా స్పందించాలో నేర్చుకొని, వ్యవహరిస్తాయి. అచ్చం మన మెదడు మాదిరిగానే అన్నమాట. కళ్లు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక ద్వారా అందే దృశ్యాలు, చప్పుడు, వాసన, స్పర్శ, రుచుల సమాచారాన్ని మెదడు గ్రహించి, గుర్తుంచుకుంటుంది. అవసరమైనప్పుడు విశ్లేషించుకొని, తెలియజేస్తుంది. ఉదాహరణకు- భౌ భౌ చప్పుడు వినిపించగానే దాన్ని కుక్కతో ముడి పెట్టేస్తుంది. సాధారణంగా చెవులు శబ్దాన్ని గుర్తించినప్పుడు విద్యుత్తు సంకేతం పుట్టుకొస్తుంది. ఇది నాడీ కణాల ద్వారా మెదడుకు చేరుకుంటుంది. దీన్ని మెదడు విశ్లేషించి, పూర్వ జ్ఞానాన్ని బట్టి అది దేనికి సంబంధించిందో తెలియజేస్తుంది. మనం ఆయా విషయాలను, సందర్భాలను గుర్తుంచుకోవటానికి.. పనులను నేర్చుకోవటానికి, వాటిని కొత్తగా చేయటానికిదే మూలం. కృత్రిమ మేధ కూడా ఇలాగే వ్యవహరిస్తుంది. కాకపోతే సంక్లిష్ట జీవ కణాల సముదాయానికి బదులు ప్రోగ్రామర్‌ సృష్టించిన కోడ్స్‌తో కూడిన ఆల్గారిథమ్‌ను వాడుకుంటుంది. అందే సమాచారాన్ని బట్టి లక్ష్యాన్ని పూర్తిచేస్తుంది. ఎంత ఎక్కువ సమాచారం అందితే అంత ఎక్కువగా అనుసంధానాలు ఏర్పరచుకుంటుంది. మరింత బాగా అర్థం చేసుకుంటుంది. దీన్నే ‘మెషిన్‌ లెర్నింగ్‌’ అంటారు. ఇంకాస్త సంక్లిష్టమైన, వైవిధ్యమైన ఆల్గారిథమ్‌ల అనుసంధానాన్ని ‘న్యూరల్‌ నెట్‌వర్క్‌’గా పిలుచుకుంటున్నారు. ఇది మరింత మెరుగైన పనులు చేసిపెడుతుంది.


రకాలు మూడు

ఆర్టిఫిషియల్‌ నారో ఇంటెలిజెన్స్‌ (ఏఎన్‌ఐ): ఆయా పనులకే పరిమితమయ్యే పరిజ్ఞానమిది. సిరి, అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌ లాంటి వాయిస్‌ అసిస్టెంట్లకు ఇదే కీలకం. ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌, చెస్‌ ఆడటం వంటి పనులకూ ఇది ఉపయోగపడుతుంది. ఇంటెలిజెంట్‌గా పేర్కొన్నప్పటికీ ఇలాంటి ఏఐ వ్యవస్థలు ఆయా ప్రోగ్రామ్‌లు నిర్దేశించిన పనులనే చేస్తాయి. అందుకే దీన్ని బలహీన ఏఐగా భావిస్తారు. ఛాట్‌జీపీటీనీ దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంజెలిజెన్స్‌ (ఏజీఐ): ఇది బలమైన కృత్రిమ మేధ. మనుషుల మాదిరిగా పనులు పనులు పూర్తి చేసిపెట్టటం దీని ఉద్దేశం. సిద్ధాంతపరంగా ఇది మనిషి మెదడులా పనిచేస్తుంది. ఒకే సమయంలో వివిధ అంశాలను విడమరచుకుంటుంది, ప్రతిస్పందిస్తుంది. ఇదింకా రూపుదిద్దుకునే దశలోనే ఉంది. పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు.

ఆర్టిఫిషియల్‌ సూపర్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఎస్‌ఐ): మనిషి విషయ పరిజ్ఞాన సామర్థ్యాన్ని మించిపోయే టెక్నాలజీ ఇది. తనకు తానే ఆలోచించగలదు. ఇది మహా కృత్రిమ మేధగా అవతరించగలదు. అసాధారణ రీతిలో ఆలోచించగల ఈ ఏఎస్‌ఐ వ్యవస్థలు మనుషులు చేయలేని పనులనూ సుసాధ్యం చేయగలవు.


మనిషిని మించిపోతుందా?

కృత్రిమ మేధ మనిషి మెదడును మించిపోతుందా? అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. ఆశ్చర్యపరుస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం అవుననే చెప్పుకోవాల్సి ఉంటుంది. బోలెడంత సమాచారం.. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో చాలా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల కృత్రిమ మేధ మనిషి మెదడును మించిపోయే అవకాశం లేకపోలేదు. ఇది మన మెదడు కన్నా ఇప్పుడప్పుడే భిన్నంగా ఆలోంచించలేకపోవచ్చు గానీ మున్ముందు సాధ్యమే. ప్రస్తుత అత్యంత అధునాతన జనరల్‌ ఏఐ నమూనా పేరు గ్రాటో. దీన్ని డీప్‌మైండ్‌ సంస్థ సృష్టించింది. పొంతనలేని సమస్యలను పరిష్కరించటం, భాషల విశ్లేషణ, వీడియో గేమ్స్‌ ఆడటం, ఫొటోల గుర్తింపు వంటి వేలాది పనులు చేయటానికి ఈ ఏఐ నమూనాను రూపొందించారు.


వివిధ రంగాల్లో..

ఓపెన్‌ ఏఐ, ఆల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి టెక్‌ దిగ్గజాలు కృత్రిమ మేధ అభివృద్ధి మీద పెద్దఎత్తున పనిచేస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తృతంగా వాడుకోవటానికి వీలుండటంతో చాలా ఖర్చు చేస్తున్నాయి. చాలారంగాల్లో ఇప్పటికే ఇది పెను మార్పులను తీసుకొస్తోంది

రోబో రంగంలో  

మనిషిని పోలిన రోబోల సృష్టిలో ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. అమెకా, సోఫియా వంటి రోబోలు దీని సాయంతోనే మనుషుల్లా మాట్లాడుతూ అబ్బురపరుస్తున్నాయి. అమెకాలో బోలెడన్ని సాఫ్ట్‌వేర్‌లు నిక్షిప్తమై ఉన్నాయి. వీటిల్లో ఒకటి టిన్‌మ్యాన్‌. ఇదో టెలీప్రజెన్స్‌ టెక్నాలజీ. ముఖాలను గుర్తించటానికి, దూరాలను అంచనా వేయటానికి, ఎదుటి వాళ్లతో మాట్లాడటానికిది వీలు కల్పిస్తుంది. అమెకా డిజైన్‌ను మార్చుకోవచ్చు కూడా. కంపెనీల అవసరాలకు తగినట్టుగా ఏఐ పనితీరు, సామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ప్రస్తుతానికి అమెకా, సోఫియా వంటి రోబోలను వినోదానికి, మనుషులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించటానికి వాడుతున్నారు. మున్ముందు మరెన్నో పనులకూ ఉపయోగించుకోవచ్చు. నడిచేలా కూడా చేయొచ్చు. అలాగే ఇలాన్‌ మస్క్‌ సైతం అధునాతన ఏఐతో ఆప్టిమస్‌ రోబోను సృష్టించే పనిలో పడ్డారు. ఇందులోనూ టెస్లా వాహనాల్లో వాడుతున్న సాఫ్ట్‌వేర్‌ను కొంత ఉపయోగిస్తున్నప్పటికీ మనిషి మెదడులా ఆలోచించేలా రూపొందించాలన్నది ఆయన సంకల్పం. ఇటీవలే ఆప్టిమస్‌ రోబో యోగా చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. ఒక కాలు మీద బరువును మోపుతూ నమస్కారం పెట్టటం నిజంగా గొప్ప విషయం. అంత సమతుల్యతను ఒక రోబో సాధించటం అద్భుతమే.

ఆరోగ్యరంగంలో..

సమాజంలో కీలక రంగాలనూ ఏఐ శరవేగంగా మలుపు తిప్పగలదు. ఉదాహరణకు- ఆరోగ్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టగలదు. ఇప్పటికే దీని ఫలితాలను చవి చూస్తున్నాం కూడా. కొవిడ్‌ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల ఎక్స్‌రేల ద్వారా జబ్బును నిర్ధరించటానికీ దీన్ని వాడుకోవటం తెలిసిందే. వైద్యుల ప్రధానమైన పని జబ్బులను నిర్ధరించి, వాటిని నయం చేయటం. ఇది ఎన్నో ఏళ్ల చదువు, అనుభవం, శిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. వీటిని ఏఐ పరికరాలకు నేర్పిస్తే? నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇలాంటి పనే చేసింది. మనిషి ప్రమేయం లేకుండా క్యాన్సర్‌ను నిర్ధరించటాన్ని ఏఐకి నేర్పించింది. ఆరోగ్యంగా ఉన్న అవయవాలు, క్యాన్సర్‌ అవయవాల ఎంఆర్‌ఐ దృశ్యాలతో తర్ఫీదు ఇచ్చింది. క్రమంగా ఇది క్యాన్సర్‌ను గుర్తించే స్థాయికి చేరుకుంది. డాక్టర్లకు ‘కాల్పనిక నిపుణుడు’గా తోడ్పడుతోంది. రేడియాలజిస్టులకూ శిక్షణ ఇస్తోంది. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు కూడా ఏఐ సాయంతో బ్రెయిన్‌వేర్‌ వ్యవస్థను సృష్టించారు. ఇది మెదడు కణితుల వృద్ధిని పసిగడుతుంది. ఏఐతో పనిచేసే ఆసుపత్రులనేవి ప్రస్తుతానికి కాల్పనిక కథగా అనిపించొచ్చు గానీ భవిష్యత్తులో.. ముఖ్యంగా జబ్బుల నిర్ధరణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటం ఖాయం. ఎందుకంటే మనిషి మెదడు గుర్తుంచుకునే దాని కన్నా కోట్లాది రెట్ల సమాచారం దీనికి అందుబాటులో ఉంటుంది. డాక్టర్లు మరింత కచ్చితమైన చికిత్సలను నిర్ణయించటంలో ఇదెంతగానో తోడ్పడుతుంది.

యుద్ధరంగంలో..

యుద్ధరంగంలోనూ ఏఐ గొప్ప పాత్ర పోషించగలదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీన్ని రెండు రకాలుగా వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 1. డ్రోన్‌, రోబో కెమెరాల ద్వారా లక్ష్యాలను గుర్తించటం. 2. రోబో సైన్యం తనకు తానే కదలటం, అడ్డంకులను అధిగమించటం. బాంబులను నిర్వీర్యం చేసే రోబోలు, బాంబులను జారవిడిచే డ్రోన్ల వంటివి దీని కోవలోకే వస్తాయి. ప్రస్తుతానికి ఆటమనస్‌ నియంత్రిత రోబోలకు గానీ వినాశకర ఆయుధాలతో కూడిన డ్రోన్లకు గానీ సైన్యంలో చోటు కల్పించటం లేదు. కేవలం సైనికులకు సాయం చేయటానికే ఏఐని వాడుకుంటున్నారు.

అంతరిక్షంలో

అంతరిక్ష ప్రయోగాలకూ ఏఐ తోడ్పడుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్‌ఎస్‌లోని సైమోన్‌ దీనికి మంచి ఉదాహరణ. భూ వాతావరణాన్ని దాటుకొని అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ఏఐ పరికరమిదే. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు తోడుగా ఉపయోగపడుతోంది. ఈ వాయిస్‌ యాక్టివేటెడ్‌ ఏఐ అసిస్టెంటును జర్మనీ అంతరిక్ష సంస్థ, ఎయిర్‌బస్‌, ఐబీఎం సంయుక్తంగా రూపొందించాయి. అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలకు, ప్రయోగాలకు దీన్ని వినియోగిస్తున్నారు. గుండ్రటి కంప్యూటర్‌లా కనిపించే ఇది  తేలియాడుతూ ఉంటుంది. మూడేళ్ల క్రితం ఐఎస్‌ఎస్‌ వ్యోమగాములతో చేయి కలిపింది. పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని, సూచనలను వినిపించటం.. నోట్స్‌ తీసుకోవటం వంటి పనులు చేస్తుంది. తోడుగా ఉండటం వల్ల ఇది ఒంటరితనాన్ని మరచిపోయేలా చేస్తుంది కూడా. భూమి మీది డేటా సెంటర్‌తో అనుసంధానమై పనిచేసే దీన్ని భవిష్యత్తులో తనకు తానే పనులు చేసేలా.. చంద్రుడు, అంగారకుడి మీదికి పంపించేలా రూపొందించాలనీ భావిస్తున్నారు.


స్వయంచోదక వాహనాల్లో..

స్వయం చోదక వాహనాల్లో కృత్రిమ మేధ ఇప్పటికే విరివిగా వాడకంలోకి వస్తోంది. ఏఐ సాఫ్ట్‌వేర్‌తో ఎన్నో సంస్థలు వేలాది స్వయం చోదక వాహనాలను రూపొందించాయి. టెస్లా సంస్థ తన సూపర్‌ కంప్యూటర్‌తో ఏఐ సాఫ్ట్‌వేర్‌కు శిక్షణ ఇచ్చింది. దీని సాయంతోనే టెస్లా కార్లు చుట్టుపక్కల పాదచారుల, సైకిల్‌ తొక్కేవారు, వాహనాల కదలికలను అంచనా వేస్తున్నాయి. టెస్లా పూర్తిస్థాయి ఏఐ కోపైలట్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌లకు 70వేల జీపీయూ గంటల సేపు శిక్షణ ఇచ్చారు!


భాషా నమూనాలు కీలకం

కృత్రిమ మేధలో భాషా నమూనాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిల్లో బాగా ప్రాచుర్యం పొందినవాటిల్లో ఒకటి లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం). ఇవి మనుషుల పర్యవేక్షణ లేకపోయినా మెషిన్‌ లెర్నింగ్‌కు ఉపయోగపడతాయి. వీటికి అక్షరాలే మేత, ఇంధనం. కథనాలు, పుస్తకాలు, వెబ్‌సైట్‌ల వంటి వాటిల్లోని టెక్స్ట్‌తో వీటికి భారీ ఎత్తున తర్ఫీదు ఇస్తారు. ఆయా పదాలు, పదబంధాల మధ్య సంబంధాన్ని నేర్పిస్తారు. ఎల్‌ఎల్‌ఎంలో బాగా ప్రాచుర్యం పొందినది జీపీటీ 3.5. ఛాట్‌జీపీటీ దీని మీదే ఆధారపడుతుంది. అతి పెద్దదేమో జీపీటీ-4. గూగుల్‌ రూపొందించిన లామ్డాను రెండో అతిపెద్ద ఎల్‌ఎల్‌ఎం అని చెప్పుకోవచ్చు. మూడు లేదా అంతకన్నా ఎక్కువ పొరలతో కృత్రిమ న్యూరల్‌ నెట్‌వర్క్‌లకు శిక్షణ ఇచ్చే విధానం డీప్‌ లెర్నింగ్‌. ఇది వివిధ పనులు నెరవేర్చటానికి తోడ్పడుతుంది. కొన్ని డీప్‌ లెర్నింగ్‌ మోడళ్లలో వందలాది పొరలూ ఉంటాయి.


ఇంకా.. ఇంకా..

  • సంగీత స్వరాలు కూర్చటం, పాటల రచనలోనూ ఏఐ సాయం చేస్తోంది. కొన్ని సంస్థలు ఇప్పటికే దీంతో స్వరాలు కూరుస్తున్నాయి. విశిష్టమైన ధ్వనులను సృష్టిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్లు కృత్రిమ మేధతో సంగీతాన్ని సృష్టించుకోవటానికీ అవకాశం కల్పిస్తున్నాయి.
  • ఏఐకి డ్యాన్స్‌ను నేర్పించటానికీ గూగుల్‌ ప్రయత్నాలు మొదలెట్టింది. గంటల కొద్దీ డ్యాన్స్‌ దృశ్యాలతో తర్ఫీదు ఇచ్చింది. ప్రత్యేకమైన డ్యాన్స్‌ రీతులను సృష్టించేలా తీర్చిదిద్దింది. అలాగే బృంద నృత్య శిక్షణ కోసమూ పలు ఏఐ ప్రొగ్రామ్‌లు పుట్టుకొచ్చాయి. ఇవి డ్యాన్స్‌ నేర్చుకునేవారిని కాల్పనికంగా.. అంటే దూరం నుంచే నియంత్రిస్తూ, తప్పులను పట్టుకోవటానికి, భంగిమలను సరిచేయటానికి తోడ్పడుతున్నాయి.
  • ఇమేజ్‌ జనరేషన్‌ సాఫ్ట్‌వేర్‌తో ఏఐ చిత్రకళలోకీ ప్రవేశించింది. డాల్‌-ఇ, మిడ్‌జర్నీ వంటివి పదాల ఊతంతోనే ఆశ్చర్యపరచే చిత్రాలను కళ్ల ముందుంచుతున్నాయి. ఇలాంటివి బోలెడన్ని పుట్టుకొస్తున్నాయి. ఏఐ-డీఏ అనే హ్యూమనాయిడ్‌ రోబో చిత్రకారిణి అయితే ఆల్గారిథమ్స్‌, కెమెరా కళ్లు, చేతులతో అందమైన కళాకృతులను ఇట్టే సృష్టిస్తోంది. ఆన్‌లైన్‌లో లక్షలాది దృశ్యాలను వీక్షించి, వాటి ప్రభావంతో చిత్రాలు గీసి ముందుంచుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని