భూకంపాలను గుర్తించే ఏఐ

కృత్రిమ మేధ అసాధ్యమైన పనులనూ సుసాధ్యం చేసేస్తోంది. తాజాగా భూకంపాలను వారం ముందే గుర్తించే సామర్థ్యాన్నీ సంతరించుకుంది.

Published : 11 Oct 2023 00:25 IST

కృత్రిమ మేధ అసాధ్యమైన పనులనూ సుసాధ్యం చేసేస్తోంది. తాజాగా భూకంపాలను వారం ముందే గుర్తించే సామర్థ్యాన్నీ సంతరించుకుంది.

భూకంపాలు రావటాన్ని ముందే గుర్తిస్తే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూసుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు కొత్తరకం కృత్రిమ మేధ (ఏఐ) ఆల్గొరిథమ్‌ను రూపొందించారు. ఇది 70% వరకు కచ్చితంగా భూకంపాలను అంచనా వేస్తుండటం గమనార్హం. గతంలో భూకంపాలు వచ్చినప్పుడు నమోదైన సీస్మోగ్రాఫ్‌ సమాచారంతో దీనికి పెద్ద శిక్షణ ఇచ్చారు. దీంతో అది ప్రత్యక్ష సీస్మిక్‌ సమాచారంలో ఏర్పడే గణాంకాల హెచ్చుతగ్గులను అంచనా వేయటాన్ని నేర్చేసుకుంది. భూమిలోపల పుట్టుకొచ్చే స్వల్ప ధ్వనులను విని, భూకంప సంకేతాలను గుర్తించే నైపుణ్యాన్ని అలవరచుకుంది. దీన్ని ఏడు నెలల పాటు చైనాలో ఒక ప్రాంతంలో పరీక్షించగా.. 200 మైళ్ల విస్తీరణంలో ఏర్పడిన 14 భూకంపాలను వారం ముందుగానే గుర్తించింది. తీవ్రతనూ దాదాపు కచ్చితంగా పసిగట్టింది. ఒక భూకంపాన్ని మాత్రం పోల్చుకోలేకపోయింది. తప్పుడు హెచ్చరికలు జారీచేసింది. ఇది ఇతర ప్రాంతాల్లోనూ ఇలాగే పనిచేస్తుందో లేదో తెలియదు గానీ ఏఐ ఆధారిత భూకంప అంచనా పద్ధతుల పరిశోధనల్లో దీన్నొక మైలురాయిగా పరిగణిస్తున్నారు. భూకంపాలు రావటాన్ని మనం చూడలేం. కొద్ది సెకండ్లలోనే సంభవిస్తుంది. వీటిని 70% వరకు కచ్చితంగా గుర్తించినా నష్టాన్ని చాలావరకు నివారించుకోవచ్చు. భూకంపాలను ఎదుర్కోవటానికి తగు విధంగా సన్నద్ధం కావొచ్చు. ప్రపంచంలో ఇతర చోట్ల భూకంపాలను అంచనా వేయటానికి తామింకా సిద్ధం కాలేదని, అయినా అసాధ్యమైన సమస్యను సూత్రప్రాయంగానైనా సాధించే అవకాశమున్నట్టు నిరూపించామని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని