గగన్‌యాన్‌లో రోబో స్నేహితురాలు

మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఉద్దేశించిన గగన్‌యాన్‌ తొలి పరీక్ష సఫలమైంది. మొదట్లో ఒకింత లోపంతో కాసేపు వాయిదా పడినా చివరికి టెస్ట్‌ వెహికల్‌ డీ1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

Published : 25 Oct 2023 00:39 IST

మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఉద్దేశించిన గగన్‌యాన్‌ తొలి పరీక్ష సఫలమైంది. మొదట్లో ఒకింత లోపంతో కాసేపు వాయిదా పడినా చివరికి టెస్ట్‌ వెహికల్‌ డీ1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నిర్దేశించిన విధంగానే వెహికిల్‌ నుంచి క్రూ మాడ్యూల్‌ విడిపోయి, తర్వాత సముద్రంలో దిగింది. అవాంఛిత పరిస్థితులు ఎదురైతే వ్యోమగాములు సురక్షితంగా బయటపడటానికి తోడ్పడే వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నట్టు దీంతో బయటపడింది. మరో రెండేళ్లలో మానవులను అంతరిక్షంలోకి పంపాలనే మన ప్రయత్నానికిది కొత్త ఉత్తేజం కలిగించింది. అయితే అంతరిక్షంలోకి ముందుగా వెళ్లేది వ్యోమగాములు కాదు. ఓ రోబో!

అంతరిక్ష ప్రయోగాల్లో జంతువుల సహకారం మరవలేనిది. మానవుల కన్నా ముందు వీటినే రోదసిలోకి పంపించారు. అంతరిక్ష ప్రయాణంలో ఎదురయ్యే పరిస్థితులు, ప్రభావాలను అంచనా వేయటంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. కానీ మనదేశం మాత్రం అలా చేయటం లేదు. జంతువులు కూడా ప్రాణులే. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటున్నప్పుడు భార రహిత స్థితి, రేడియేషన్‌ ప్రభావాలు మన మీద పడినట్టే వాటి మీదా పడతాయి కదా. వీటిని అర్థం చేసుకోవటానికి జంతువులను బలి చేయటం ఎందుకు? ఇక్కడే మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వినూత్నంగా ఆలోచించింది. జంతువులకు బదులు మనిషిని పోలిన రోబోను ముందుగా అంతరిక్షంలోకి పంపటానికి సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా రోబోను సిద్ధం చేసింది. దీని పేరు వ్యోమమిత్ర. ఆడ వ్యోమగామిలా కనిపించే దీనికి తల, రెండు చేతులుంటాయి. కాకపోతే కాళ్లుండవు. సగం హ్యూమనాయిడ్‌ అన్నమాట.

ఏం చేస్తుంది?

వ్యోమమిత్ర అచ్చం మనలాగే పెదవులను కదిలిస్తూ మాట్లాడుతుంది. హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడేలా దీన్ని ప్రోగ్రామ్‌ చేశారు. ఇది మనుషులనూ గుర్తిస్తుంది. అంతరిక్షంలో వ్యోమగాములు చేసే పనులన్నింటినీ అనుకరిస్తుంది. కబుర్లు చెబుతుంది. ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. సిరి, అలెక్సా, కోర్టానా వంటి కృత్రిమ మేధ పరిజ్ఞానాలనూ వ్యోమమిత్రకు విస్తరించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత క్రూ మాడ్యూల్‌లో వ్యోమగాముల భద్రత, మనుగడకు ఉద్దేశించిన వ్యవస్థలను పరీక్షిస్తుంది. క్యాబిన్‌లో వాతావరణం మారితే వాటిని గుర్తించి, హెచ్చరించగలదు. నేల మీది నుంచి శాస్త్రవేత్తలు అందించే సూచనలను గ్రహించి, వాటి మేరకు నడచుకోగలదు. అవసరమైన పనులు పూర్తి చేయగలదు. లోపల కార్బన్‌ డయాక్సైడ్‌ పెట్టెలను మారుస్తుంది కూడా. టెక్నికల్‌ పనులు చేయటమే కాకుండా వ్యోమగాములకు విసుగు పుట్టకుండా మానసికంగా దన్నుగానూ నిలుస్తుంది. కృత్రిమ స్నేహితుడిలా వెంట ఉంటుంది. ప్రయోగిస్తున్నప్పుడు, కిందికి దిగుతున్నప్పుడు, కక్ష్యలో ఉన్నప్పుడు వ్యోమనౌక స్థితి ఎలా ఉందో చెబుతుంది కూడా. క్రూ మాడ్యూల్‌ అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్నప్పుడు లోపల జరిగిన మార్పులను నివేదిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని