భూమిలో గ్రహం!

అదో ఊహాత్మక గ్రహం. పేరు థియా. మన చంద్రుడి పుట్టుకకు అదే కారణమన్నది శాస్త్రవేత్తల భావన. దీని గురించి నాలుగు దశాబ్దాలుగా ప్రశ్నల పరంపర కొనసాగుతూనే వస్తోంది. తాజా అధ్యయనం ఒకటి వీటికి సమాధానం ప్రతిపాదిస్తోంది.

Updated : 08 Nov 2023 04:54 IST

అదో ఊహాత్మక గ్రహం. పేరు థియా. మన చంద్రుడి పుట్టుకకు అదే కారణమన్నది శాస్త్రవేత్తల భావన. దీని గురించి నాలుగు దశాబ్దాలుగా ప్రశ్నల పరంపర కొనసాగుతూనే వస్తోంది. తాజా అధ్యయనం ఒకటి వీటికి సమాధానం ప్రతిపాదిస్తోంది.

ఆఫ్రికా ఖండం దిగువన, పసిఫిక్‌ మహా సముద్రం కింద భూ కేంద్రానికి సమీపంలో ఖండాలంత పరిమాణం గల రెండు ముద్దల్లాంటి పదార్థాలు ఉన్నట్టు 1980ల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి కన్నా రెట్టింపు సైజులో ఉన్న ఇవి చుట్టుపక్కల మ్యాంటిల్‌ కన్నా భిన్నమైన మూలకాలను కలిగున్నాయని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ చెబుతోంది. ఒకప్పుడు వీటిని అల్ప చలన ప్రాంతాలు (ఎల్‌ఎల్‌వీపీ) అని పిలుచుకునేవారు. భూకంప తరంగాలు భూమి గుండా ప్రయాణిస్తున్నప్పుడు వాటిని లెక్కించటం ద్వారా ఈ ఎల్‌ఎల్‌వీపీలను గుర్తించారు. భూకంప తరంగాలు వేర్వేరు పదార్థాల గుండా వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తాయి. భూమి లోపల మూడు వేర్వేరు దిశల్లో భూకంప తరంగాలు ప్రయాణించినట్టు 80ల్లో తొలిసారి గమనించారు. మ్యాంటిల్‌ లోలోతుల్లో భూగర్భానికి దగ్గరలో రెండు భారీ నిర్మాణాల సంకేతాలు భూకంప తరంగాల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపించాయి. అక్కడ ఐరన్‌ నిల్వ చాలా అధికంగా ఉండొచ్చన్నది పరిశోధకుల భావన. అంటే చుట్టుపక్కల భాగాల కన్నా ఆ ప్రాంతాలు ఎక్కువ సాంద్రత కలిగున్నాయన్నమాట.

దీని మూలంగానే భూకంప తరంగాలు వాటి గుండా ప్రయాణిస్తున్నప్పుడు వేగం తగ్గింది. అందుకే వీటికి లార్జ్‌ లో వెలాసిటీ ప్రావిన్సెస్‌ (ఎల్‌ఎల్‌వీపీస్‌) అని పేరు పెట్టారు. ఇవి వందల కోట్ల క్రితం మన భూమిని భీకరంగా ఢీకొట్టిన పురాతన గ్రహం (థియా) తాలూకు అవశేషాలని భావిస్తుంటారు. ఈ విషయాన్ని తాజా అధ్యయనం మరింత స్పష్టంగా వివరించింది. థియా గ్రహం ఢీకొట్టటం వల్లనే భూమి నుంచి ముక్క విడిపోయి, చంద్రుడిగా మారిందని భావిస్తుంటారు కూడా. కానీ ఆస్టరాయిడ్‌ బెల్ట్‌లో గానీ ఉల్కల్లో గానీ ఇప్పటివరకూ థియా జాడలేవీ కనిపించలేదు. ఆది నుంచి రహస్యంగానే మిగిలిపోయింది. అయితే థియా గ్రహంలో చాలా భాగం భూమిలో లీనమయ్యిందని, మిగిలిన ముక్కలు చంద్రుడిలో భాగమయ్యాయని తాజా అధ్యయనం పేర్కొనటంతో సమాధానం లభించినట్టయ్యింది. చంద్రుడిలోనూ ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి థియా గ్రహం అవశేషాలేనని ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. దండిగా ఐరన్‌ గల థియా గ్రహం మ్యాంటిల్‌లో ముద్దగా మారిపోయి ఉండొచ్చని పేర్కొంటున్నారు. తొలినాళ్లలో భూ అంతర్భాగాన్ని థియా ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకోవటానికి ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని