బ్యాక్టీరియా కాంక్రీటు!

కాంక్రీటు చాలా గట్టిగా ఉంటుంది. శాశ్వతంగా ఉండిపోతుందనీ అనిపిస్తుంది. కానీ మూలకాలు దీన్ని క్షీణింపజేయొచ్చు. పగుళ్లు ఏర్పడొచ్చు.

Updated : 22 Nov 2023 04:07 IST

కాంక్రీటు చాలా గట్టిగా ఉంటుంది. శాశ్వతంగా ఉండిపోతుందనీ అనిపిస్తుంది. కానీ మూలకాలు దీన్ని క్షీణింపజేయొచ్చు. పగుళ్లు ఏర్పడొచ్చు. వీటిని నివారించటానికి డ్రెక్సెల్‌ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్నమైన కాంక్రీటును రూపొందించారు. ఇది తనకు తానే మరమ్మతు అవుతుంది. ఇందులోని బయోఫైబర్లు బ్యాక్టీరియా సాయంతో పగుళ్లను పూరిస్తాయి మరి. కాంక్రీటు నిరంతరం వాతావరణ ప్రభావానికి గురవుతున్నప్పుడు పగుళ్లు ఏర్పడుతుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత మరీ పెరిగినట్టయితే పగుళ్లు మరింత పెద్దగా అవుతాయి కూడా. పైగా తేమ సైతం వివిధ ప్రక్రియలతో కాంక్రీటు క్షీణించేలా చేస్తుంది. కాబట్టే కాంక్రీటు నిర్మాణాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. తరచూ మరమ్మతులు అవసరమవుతాయి. దీనికి ఖర్చు అవుతుంది. అసౌకర్యమూ కలిగిస్తుంది. అందుకే కాంక్రీటు క్షీణించే వేగాన్ని నెమ్మదింపజేయటం అనివార్యంగా మారుతోంది. ఇక్కడే డ్రెక్సెల్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన బయోఫైబర్లు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ పాలిమర్‌ ఫైబర్లు కేవలం కాంక్రీటుకు దన్నుగా నిలవటమే కాకుండా పగుళ్లు తమకు తామే పూడిపోయేలా చేసి మన్నిక కాలాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ఫైబర్లకు సన్నటి రంధ్రాలు గల హైడ్రోజెల్‌ పూత పూస్తారు. ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది నిద్రాణంగా ఉంటూ తీవ్ర వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని జీవిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా పగుళ్లు ఏర్పడితే వాటిలోంచి నీరు వెళ్లి బయోఫైబర్లును తాకుతుంది. అప్పుడు హైడ్రోజెల్‌ విస్తరిస్తుంది. దీని మీది పొర పగిలి, పైభాగానికి వస్తుంది. ఈ క్రమంలో బ్యాక్టీరియా నిద్రలేస్తుంది. కాంక్రీటు చుట్టూ ఉండే కార్బన్‌, క్యాల్షియంను తినటం ఆరంభిస్తుంది. అప్పుడు వీటి నుంచి క్యాల్షియం కార్బొనేట్‌ పుట్టుకొస్తుంది. ఇది పగుళ్లను పూడుస్తుంది. ప్రకృతి స్ఫూర్తితో నిర్మాణ పదార్థాలను మెరుగు పరచటానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో బయోఫైబర్లతో కూడిన కాంక్రీటు ఆసక్తి కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. మన చర్మానికి గాయం తగిలినప్పుడు అది తనకు తానే మానినట్టు కాంక్రీటు పగుళ్లూ పూడితే అంతకన్నా కావాల్సిందేముంది?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని