కృత్రిమ మేధ ఆసుపత్రి!

నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.

Published : 06 Dec 2023 00:11 IST

నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి. మరి ఆసుపత్రులూ ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే? డాక్టర్లే లేకుండా సేవలందిస్తే? పరీక్షలు చేస్తే? ఆశ్చర్యంగా అనిపించినా అలాంటి రోజులు మరెంతో దూరంలో లేవు.

ఐ క్లినిక్‌లు మున్ముందు పెద్ద విప్లవమే సృష్టించనున్నాయి. ఇప్పటికే దీని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కేర్‌పాడ్‌ క్లినిక్కులే నిదర్శనం. అమెరికాలోని ఫార్వర్డ్‌ హెల్త్‌ కంపెనీ వీటిని ఆరంభించింది. సంప్రదాయ ఆరోగ్య సేవలను ఏఐ పరిజ్ఞానంతో జతచేసి, ‘రోబో డాక్టర్ల’తో చికిత్స చేయటం దీని ప్రత్యేకత. అన్నీ సరిగ్గా సాగితే మున్ముందు మాల్స్‌, ఆఫీసు కార్యాలయాలు ఎక్కడైనా ఇలాంటి ఏఐ క్లినిక్కులు దర్శనమిచ్చే అవకాశం లేకపోలేదు.

ఎలా పనిచేస్తుంది?

కేర్‌పాడ్‌ కేంద్రం దగ్గరికి వెళ్లాక, ఫోన్‌తో తలుపును అన్‌లాక్‌ చేయాల్సి ఉంటుంది. లోపలికి వెళ్లగానే భారీ టచ్‌ స్క్రీన్‌, కుర్చీ, నేల మీద కాంతి వలయం కనిపిస్తుంది. ఈ కాంతి వలయం శరీరం మొత్తాన్ని స్కాన్‌ చేయగలదు. టచ్‌ స్క్రీన్‌ మీద ఫుల్‌ బాడీ స్కాన్‌, థైరాయిడ్‌ పరీక్ష, మధుమేహ పరీక్ష, అధిక రక్తపోటు పరీక్ష.. ఇలాంటి బోలెడన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అంటే ప్రతి జబ్బుకూ ఒక పోగ్రామ్‌ ఉంటుందన్నమాట. అవసరమైన సేవలను ఎంచుకుంటే చాలు. దానికదే రక్త నమూనా తీసుకుంటుంది కూడా. అదెలా అంటారా? దీనిలో సూది లేకుండానే రక్త నమూనా తీసుకునే సదుపాయం ఉంటుంది! వైర్‌లెస్‌ చేతి పట్టీ ద్వారా రక్తపోటును కొలుస్తుంది. సుఖవ్యాధులనూ పరీక్షిస్తుంది. అయితే ఈ పరీక్ష ఎలా చేస్తుందనేది ఇంకా తెలియరాలేదు. ఆయా పరీక్షలు పూర్తయ్యాక తెర మీద ఫలితాలు కనిపిస్తాయి. ఏదైనా చికిత్స అవసరమైతే ఆన్‌లైన్‌లో డాక్టర్‌ మందులు రాసిస్తారు. క్లినిక్‌ను ఎలా వాడుకోవాలో చెప్పటానికి సహాయకులు అందుబాటులో ఉంటారు. కానీ వీళ్లు బయటే ఉంటారు. లోపల పరికరాలను ఎలా వాడుకోవాలో చెబుతారంతే. పరీక్ష ఫలితాలు, చికిత్స, వ్యక్తిగత వివరాల వంటివన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు. స్పెషలిస్ట్‌కు సిఫారసు చేయాల్సి వస్తేనే సమాచారాన్ని పంపిస్తారు.

అత్యాధునిక పరిజ్ఞానాల సాయం

ఏఐ-ఆరోగ్యరంగ సమ్మేళనానికి కేర్‌పాడ్‌ ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ఆరోగ్యరంగం రోజు రోజుకీ కృత్రిమ మేధను అధికంగా వాడుకుంటోంది. ఇందుకు ఎన్నెన్నో అధునాతన పరిజ్ఞానాలు సాయం చేస్తున్నాయి.

  • మెషిన్‌ లెర్నింగ్‌ పరిజ్ఞానం ద్వారా ఆల్గారిథమ్‌లు భారీ మొత్తంలో సమాచారాన్ని విశ్లేషించి జబ్బుల తీరుతెన్నులను పసిగడుతున్నాయి. మెరుగైన చికిత్సలను ఎంచుకోవటానికి, ఖర్చు తగ్గించటానికి తోడ్పడుతున్నాయి.
  • కృత్రిమ మేధలో భాగమైన నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ) పరిజ్ఞానాలు స్కాన్‌ ఇమేజ్‌ల వంటి వాటిని పరిశీలించి జబ్బులను నిర్ధరిస్తున్నాయి. తగిన చికిత్సలను, మందులను సూచిస్తున్నాయి. జబ్బులతో ముడిపడిన ముప్పులనూ వివరిస్తున్నాయి.
  • డేటా ఎంట్రీ, బీమా క్లెయిమ్‌ల పరిష్కారం, అపాయింట్‌మెంట్‌ ఇవ్వటం వంటి పదే పదే చేసే పనులనూ ఏఐ చేసి పెడుతోంది.

కంటి స్కాన్‌తోనే గుండెజబ్బు గుర్తింపు

కళ్లలోకి చూసి గుండెజబ్బును గుర్తించే కృత్రిమ మేధనూ గూగుల్‌ రూపొందించింది. సుమారు 2.85 లక్షల మంది రెటీనా ఇమేజ్‌లతో దీనికి శిక్షణ ఇచ్చారు. వీటి సాయంతో గుండెజబ్బుకు కారణమయ్యే వయసు, లింగ బేధం, రక్తపోటు, పొగ తాగే అలవాటు వంటి వాటిని పసిగట్టి గుండెజబ్బు ముప్పును అంచనా వేస్తుంది. ఇది 70% వరకు గుండెజబ్బు ముప్పును అంచనా వేస్తున్నట్టు తేలటం గమనార్హం. ఈ పరిజ్ఞానం రెండంచెలుగా పనిచేస్తుంది. ఇమేజింగ్‌ పరిజ్ఞానంతో కంట్లోని రెటీనా దృశ్యాన్ని తీసుకుంటుంది. దీనిలోని రక్తనాళాల తీరును ఏఐ విశ్లేషించి గుండెజబ్బును గుర్తిస్తుంది. చాలారకాల జబ్బుల ఆనవాళ్లు కంట్లో కనిపిస్తుంటాయి. వీటిని నిశితంగా గమనిస్తే ఆయా జబ్బులను అంచనా వేయొచ్చు. కృత్రిమ మేధ పరిజ్ఞానానికీ ఇదే ఆధారం. దీని సాయంతో డయాబిటిక్‌ రెటినోపతీ.. చివరికి క్యాన్సర్లనూ అంచనా వేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని