ఏఐ స్టెతస్కోప్‌

డాక్టర్‌ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్‌తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్‌ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు.

Published : 03 Jan 2024 00:09 IST

చికిత్స అవసరమైన గుండె వైఫల్యం కేసులను ఏఐ స్టెతస్కోప్‌ 85% వరకు పసిగడుతున్నట్టు ప్రయోగ పరీక్షల్లో తేలటం విశేషం.

డాక్టర్‌ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్‌తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్‌ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. వైద్య పరికరాల్లో అతి ఎక్కువగా వాడేదీ ఇదే. చిత్రమేంటంటే- స్టెతస్కోప్‌ సుమారు 200 ఏళ్లుగా ఏమీ మారలేదు. కనిపెట్టినప్పటి నుంచీ దాదాపు అలాగే ఉంది. అయితే మేయో క్లినిక్‌, ఎకో హెల్త్‌ సంస్థలు రూపొందించిన కొత్తరకం స్టెతస్కోప్‌ ఈ పరిస్థితిని మార్చనుంది. ఇది కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానంతో పనిచేస్తుంది మరి. చిటికెలో గుండెజబ్బును గుర్తించటం దీని ప్రత్యేకత.

సరైన విధంగా రూపొందించి, పరీక్షిస్తే ఏఐ సాఫ్ట్‌వేర్‌ తక్షణం కచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. అంతగా సాంకేతిక శిక్షణ అవసరం లేకపోవటం వల్ల దీన్ని పెద్ద ఎత్తున అమలు చేయటమూ తేలికే. ఖర్చూ తగ్గుతుంది. తక్షణం అవసరమైన చికిత్స చేయటానికీ  వీలుంటుంది. ఏఐ పరిజ్ఞానం పుంజుకుంటే లక్షలాది ప్రాణాలను కాపాడుకోవచ్చు.  దీన్ని దృష్టిలో పెట్టుకొనే వినూత్న ఏఐ స్టెతస్కోప్‌ను రూపొందించారు. దీన్ని జనరల్‌ ఫిజిషిన్లు  వాడుకోవటానికి వైద్య సంస్థలూ అనుమతించాయి. దీంతో ఇటీవల బ్రిటన్‌లో కొన్ని ఆసుపత్రుల్లో ఏఐ స్టెతస్కోప్‌ వాడకాన్ని ఆరంభించారు. నిపుణుల సమీక్ష అవసరం లేకుండా ప్రాణాలను కాపాడే మందులను సిఫారసు చేయటానికిది జనరల్‌ ఫిజిషియన్లకు తోడ్పడుతుంది. ఇలాంటి మొట్టమొదటి ఏఐ పరికరం ఈ స్టెతస్కోపే. గుండె విఫలమైతే నిస్సత్తువ, కడుపుబ్బరం వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఇవి బలహీనత, అజీర్ణం వంటి సమస్యలుగా పొరపడేలా కూడా చేస్తాయి. గుండె నిపుణుల వద్దకు వెళ్తే తప్ప సమస్య బయటపడదు. సాధారణంగా గుండె జబ్బును నిర్ధరించటానికి ఎకో కార్డియోగ్రామ్‌ లేదా స్కాన్‌, రక్త పరీక్ష చేస్తుంటారు. జబ్బు నిర్ధరణ కాకుండా చికిత్స చేయటం సాధ్యం కాదు. అయితే కొన్నిసార్లు పరీక్షలు చేయటం ఆలస్యం కావొచ్చు. లేదూ ఇతర సమస్యలుగా పొరపడొచ్చు. ఇక్కడే ఏఐ స్టెతస్కోప్‌ ఉపయోగపడుతుంది. దీన్ని ఛాతీ మీద 15 సెకన్ల పాటు ఆనిస్తే చాలు. స్టెతస్కోప్‌లోని ఏఐ ఆల్గారిథమ్‌లు గుండె కొట్టుకునే తీరును విశ్లేషించి, ఆ వెంటనే ఆన్‌లైన్‌లో ఫలితాలను అప్‌లోడ్‌ చేస్తాయి. వీటి ఆధారంగా అవసరమైతే రక్తపరీక్ష చేసి జబ్బును నిర్ధరించొచ్చు. అప్పుడు డాక్టర్లు మందులు సిఫారసు చేస్తారు. ఒకరకంగా ఈ స్టెతస్కోప్‌తోనే ఈసీజీ పరీక్ష చేయొచ్చన్నమాట. ఇది గుండె వైఫల్యం, గుండె లయ తప్పటం, గుండె కవాట సమస్యలు.. మూడింటిని గుర్తించగలదు. ఇది చికిత్స అవసరమైన గుండె వైఫల్యం కేసులను 85% వరకు పసిగడుతున్నట్టు ప్రయోగ పరీక్షల్లో బయటపడింది. జబ్బును నిర్ధరించే రక్త పరీక్షతో పోలిస్తే 93% వరకు కచ్చితత్వాన్ని కలిగుంటోంది కూడా. అంటే ఏఐ స్టెతస్కోప్‌ రక్తపరీక్షతో  దాదాపుగా సమానంగా పనిచేస్తోందన్నమాట. ఇది విస్తృతంగా అందుబాటులోకి వస్తే ఎక్కువమందికి ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని