డిసెంబరు నాటికి బియ్యంపై సుంకం తగ్గించాలి

బియ్యం ఎగుమతులపై కేంద్రం విధించిన 20 శాతం సుంకాన్ని డిసెంబరు లేదా జనవరిలో సమీక్షించి తగ్గించాలని.. లేదంటే రైతులకు ఇబ్బంది రావచ్చని భారత బియ్యం ఎగుమతిదారుల

Updated : 26 Sep 2022 05:00 IST

లేదంటే రైతుపై ప్రభావం

ద్రవ్యోల్బణం కట్టడికే కేంద్రం పన్ను

‘ఈనాడు’తో భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి.కృష్ణారావు

ఈనాడు, హైదరాబాద్‌: బియ్యం ఎగుమతులపై కేంద్రం విధించిన 20 శాతం సుంకాన్ని డిసెంబరు లేదా జనవరిలో సమీక్షించి తగ్గించాలని.. లేదంటే రైతులకు ఇబ్బంది రావచ్చని భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి.కృష్ణారావు అభిప్రాయపడ్డారు. వ్యాపారులపై కూడా ప్రభావం ఉంటుందన్నారు. గత రెండు మూడేళ్లలో బియ్యం, నూకల ఎగుమతులు గణనీయంగా పెరిగాయని, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగుమతులను నియంత్రించడానికే కేంద్రం పన్ను విధించినట్లు కనిపిస్తోందన్నారు. రైతు నుంచి ఎక్కువ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయగలిగితే సమస్య ఉండదని, దీనివల్ల వినియోగదారునికి కూడా తక్కువ ధరకు బియ్యం లభిస్తాయని ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

బియ్యం ఎగుమతిపై పన్ను ప్రభావం ఎలా ఉంది?
ఇందులో రెండు రకాలున్నాయి. మొదటిది నూకల ఎగుమతిని పూర్తిగా నిషేధించడం.రెండేళ్ల క్రితం నూకల ఎగుమతి 15 లక్షల టన్నులుంటే, ఈ ఏడాది 40 లక్షల టన్నులకు పెరిగింది. మొదట ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు చైనాకు వెళ్తున్నాయి. అక్కడ ప్రధానంగా         కోళ్ల పరిశ్రమ, ఇథనాల్‌, ఆల్కహాల్‌ తయారీకి వినియోగిస్తున్నారు. ఇవే పరిశ్రమలకు మనదేశంలో కూడా వినియోగం పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎగుమతిని నిషేధించిన తర్వాత కిలో రూ.23-24 ఉన్న నూకల ధర రూ.19-18కి తగ్గింది. మరోపక్క బియ్యం ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. 2019లో 50 లక్షల టన్నులుంటే గత సంవత్సరం కోటీ 30 లక్షలు.. ఈ ఏడాది 1.7 కోట్ల టన్నులకు చేరింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రభావం ఆహారధాన్యాల దిగుబడిపై పడింది. అమెరికా సహా పలు దేశాల్లో ద్రవ్యోల్బణం పదిశాతం దాటింది. మన దగ్గర కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా ఉన్నాయి. దీనివల్ల వరి ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో (తెలంగాణ మినహా)దిగుబడి తగ్గే అవకాశం ఉంది. భారతదేశంలో 130 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి ఉంటే 105 మిలియన్‌ టన్నులు మనకు అవసరం. మిగిలింది ఎగుమతికి అందుబాటులో ఉంటుంది.

పన్ను నేపథ్యంలో వ్యాపారులు రైతుకిచ్చే ధర తగ్గించే అవకాశం లేదా? దీనివల్ల ఎగుమతులు తగ్గుతాయంటారా?
మనం 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. పూర్తిగా నిలిపేస్తే ఈ దేశాల్లో కొనుగోలుదారులను కోల్పోయే అవకాశం ఉంది. బియ్యం ఎగుమతిలో 43-45 శాతం వాటా మనది. పూర్తిగా నిషేధించకుండా పన్ను వేయడం వల్ల ఎగుమతులు 30-40 లక్షల టన్నులకు తగ్గే అవకాశం ఉంది. పన్ను రూపేణా ప్రభుత్వానికి కూడా నెలకు కనీసం రూ.వెయ్యికోట్ల ఆదాయం వస్తుంది. అయితే డిసెంబరు లేదా జనవరిలో సమీక్షించి ఎగుమతి సుంకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అప్పటికి రైతుల నుంచి ధాన్యం విక్రయాలు ప్రారంభమవుతాయి. పన్ను తగ్గించకపోతే రైతులపై కొంత ప్రభావం పడుతుంది. మరోపక్క డాలర్‌ విలువ పెరగడం వల్ల వ్యాపారస్తునికి కొంత కలిసి వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ధాన్యం 350 డాలర్లు. డాలర్‌ రేటు గతంలో రూ.74 ఉంటే ఇప్పుడు రూ.80 అయ్యింది. ఈ మేరకు కొంత కలిసి వస్తుంది. మన దగ్గర కూడా బియ్యం ధరలు పెరిగాయి. అదుపుచేయకపోతే మరింత పెరిగే అవకాశం ఉంది. పార్‌బాయిల్డ్‌, బాస్మతి బియ్యం వినియోగం మన దగ్గర  తక్కువ. వీటి ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు లేవు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరగడం వల్ల సాగు ఖర్చు పెరిగింది. దీంతో అనేక దేశాలు వరిసాగు తగ్గించి దిగుమతి చేసుకోవడానికే ఆసక్తి చూపుతున్నాయి. వీటన్నింటి వల్ల కూడా ముందు జాగ్రత్తలు తీసుకొన్నట్లు తెలుస్తోంది.

వరి సాగు గణనీయంగా పెరిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలపై కేంద్ర నిర్ణయం వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం లేదా?
ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతు మీద పడే ప్రభావం తక్కువే. బయట అమ్ముకొనే వాళ్ల మీద మాత్రమే కొంత ప్రభావం ఉండొచ్చు. వరి సాగు తగ్గి దిగుబడిపై ప్రభావం ఉండటం,  ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ అన్న యోజన కింద బియ్యం పంపిణీ కారణంగా నిల్వలు తగ్గిపోవడంతో కేంద్రం ఎంఎస్‌పీకి ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా తెలంగాణలో ఎక్కువగా వచ్చే దిగుబడి కొనుగోలుకు ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. నూకల ఎగుమతిని కూడా పూర్తిగా నిషేధించకుండా 20 శాతం సుంకం పరిధిలోకి తెచ్చి ఎగుమతికి అనుమతించాలి. ఆరునెలల్లోగా దీనిపై నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ప్రపంచవాణిజ్య సంస్థ కూడా పూర్తిగా ఎగుమతిని నిషేధించడాన్ని అంగీకరించదు. ప్రభుత్వం ముందు ప్రస్తుతం రెండు సవాళ్లున్నాయి. ఒకటి రైతుకు మద్దతు ధర వచ్చేలా చూడటం, వినియోగదారునికి బియ్యం ధర ఎక్కువ లేకుండా చూడటం. అయితే రీసైక్లింగ్‌ ప్రధాన సమస్యగా మారి 10-15శాతం మంది రైతులకు ఎంఎస్‌పీ దక్కకపోవచ్చు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం బయట కేజీ రూ.పది నుంచి రూ.12కు దొరుకుతున్నాయి. దీంతో రీసైక్లింగ్‌ పెరుగుతోంది. రైతు నుంచి ఎంఎస్‌పీకి ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలు చేయగలిగితే ఎలాంటి సమస్య ఉండదు.

ధాన్యం సేకరణలో ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది కదా.. రైతులకు నష్టం కలిగే అవకాశం లేదా?
ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. మార్గదర్శకాలు రావాల్సి ఉంది. వ్యవస్థలో ఉన్న లోపాలను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. మార్గదర్శకాలు వస్తే కానీ దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు.

స్టీమ్డ్‌ రైస్‌ ఎగుమతి కూడా 20 శాతం సుంకం పరిధిలోకి వస్తుందా?
పార్‌ బాయిల్డ్‌(ఉప్పుడు బియ్యం), బాస్మతి మినహా మిగిలినవన్నీ దీని పరిధిలోకి వస్తాయి. మనం ఎక్కువగా వినియోగించే బీపీటీ, హెచ్‌ఎంటీ తదితర రకాలన్నీ స్టీమ్డ్‌రైస్‌ కిందకే వస్తాయి. వీటి ఎగుమతికి 20 శాతం సుంకం వర్తిస్తుంది. అమెరికా, యూరప్‌, మధ్య ప్రాచ్య దేశాలకు ఈ బియ్యం ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. అక్కడ కొంత ధర పెరిగినా, మన వినియోగదారునికి కొంత తగ్గుతుంది. రైతు నుంచి కొనుగోలుకు ఎలాంటి సమస్య లేకుండా ఏర్పాటు చేయగలిగితే తాజా నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts