Published : 11 Jul 2021 00:59 IST

ఒత్తిడే మొదటి ప్రత్యర్థి!

గెలుపోటములు క్రీడాకారుల జీవితంలో భాగం. గెలుపు ఉత్సాహాన్ని ఇచ్చినట్లే... ఓటమి ఒత్తిడిని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మన క్రీడా దిగ్గజాలు ఎలాంటి విధానాల్ని అనుసరిస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం!


ఆటవిడుపూ ముఖ్యమే!

ద్దతుగా నిలిచేవాళ్లు నా చుట్టూ చాలామంది ఉన్నప్పటికీ 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో రాణించకపోయేసరికి జీవితం చేజారిపోతున్న ఫీలింగ్‌ ఉండేది. చుట్టూ ఎందరున్నా, ప్రపంచంలో ఒంటరినేనన్న భావనలో ఉండేవాణ్ని. నిద్ర కూడా పట్టేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రొఫెషనల్‌ కౌన్సెలర్‌తో మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. వారితో సమస్యల్ని ధైర్యంగా చెప్పగలం. నేను ఆ పని చాలా ఆలస్యంగా చేశా. ఆ తర్వాత నుంచి ఆటతోపాటు ఆటవిడుపూ ముఖ్యమని అర్థమైంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఉన్నపుడు ఆ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. నిజానికి ఒత్తిడిలో ఉండి నెట్స్‌లో గంటలకొద్దీ ప్రాక్టీసు చేసినప్పటికంటే సానుకూల దృక్పథంతో ఉన్నపుడే బాగా రాణించగలం.

- విరాట్‌ కోహ్లి


రియోతో ఆడుకుంటా...

గెలుపోటముల ప్రభావం నా మీద ఎక్కువగా పడకూడదనుకుంటాను. కొత్తగా నేర్చుకోవడం థెరపీలాంటి అనుభవం. పెయింటింగ్‌ వేయడమంటే ఇష్టం. కానీ టోర్నమెంట్లూ, శిక్షణ కారణంగా అంత టైమ్‌ దొరకదు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో అవకాశం వచ్చినపుడు స్కూల్‌ రోజుల్లో వదిలేసిన కుంచెను మరోసారి పట్టుకున్నా. అమ్మ చేతి వంటలు బాగా ఇష్టం. ముఖ్యంగా హైదరాబాద్‌ బిర్యానీ, మటన్‌ కీమా, చికెన్‌ కర్రీ... వీలు కుదిరితే అమ్మ సాయంతో ఈ వంటకాల్ని వండుతుంటా. రోజూ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడతా. ప్రాక్టీసు తర్వాత బాగా అలసిపోయినపుడు నా పప్పీ రియోతో ఆడుకుంటా, ఇంకా మా అక్క కొడుకు ఆర్యన్‌తో కబుర్లు చెబుతా. ఇవన్నీ ఒత్తిడిని మరిపిస్తాయి.

- పి.వి.సింధు


మనసులో దాచుకోవద్దు!

నా కెరీర్‌ ప్రారంభం నుంచీ ప్రతికూల అంశాల్ని చూశాను. మోహన్‌ బగాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున ఆడే అవకాశం టీనేజ్‌లోనే వచ్చింది. అయితే అక్కడ కోచ్‌ నన్ను ఓ సీజన్‌ మొత్తం బెంచ్‌కే పరిమితం చేశారు. చివరకోరోజు ఏడుస్తూ... నాన్నకు ఫోన్‌చేసి, ఇక్కడున్నా లాభంలేదని చెప్పి, వెంటనే ఆ క్లబ్‌తో ఒప్పందం రద్దుచేసుకుని వెళ్లిపోయాను. ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని మనసులో దాచుకుని కుంగిపోకూడదు. ఎవరితోనైనా పంచుకుంటే ఒత్తిడి పోతుంది. ఆటలో రాణించలేకపోవడమే కాదు, గాయాల కారణంగా ఆటకు దూరమైనా క్రీడాకారులు ఒత్తిడికి గురవుతారు. ఆ సమయంలో వ్యాయామం లేక ఫిట్‌నెస్‌ కూడా కోల్పోతారు. ఇవన్నీ గమనించుకోవాలి. వీటిని సపోర్టింగ్‌ టీమ్‌తో పంచుకోవచ్చన్న స్పృహ ఉండాలి.

- సునీల్‌ ఛెత్రీ


జూనియర్స్‌కి అదే చెబుతా

భారత జట్టులోకి కొత్తగా అడుగుపెట్టిన కుర్రాళ్లు ఒత్తిడికి గురైనట్లు కనిపిస్తే స్పోర్ట్స్‌ సైకాలజిస్టుతో మాట్లాడమని చెబుతుంటా. ఎందుకంటే నాకూ కెరీర్‌ ప్రారంభంలో ఒత్తిడి అనుభవమే. ఒత్తిడి గురించి ఎవ్వరితోనూ మాట్లాడటానికి ఇష్టపడం. అదే మనం చేసే పొరపాటు. విషయాన్ని పంచుకుని, మంచి మార్గనిర్దేశం దొరికితే దాన్నుంచి సులభంగా బయటపడొచ్చు. గొప్ప ఆటగాళ్లందరూ ఏదో ఒక సమయంలో మానసిక ఒత్తిడికి గురయ్యామనీ,  స్పోర్ట్స్‌ సైకాలజిస్టు సాయంతో దాన్నుంచి బయటపడి అద్భుతంగా రాణించామనీ చెప్పడం విన్నాను. ఫలితం గురించి అతిగా ఆలోచించకుండా ఆటపైనే దృష్టిపెట్టడంవల్ల కూడా మార్పు వస్తుంది. నేనైతే రోజూ యోగా, ధ్యానం, ప్రార్థన చేస్తూ సానుకూలంగా ఉంటా.

- ఛతేశ్వర్‌ పుజారా


ఆటే జీవితం కాదు...

నువ్వు ఆడకూడదు, నువ్వు సాధించలేవు... ఇలా ఎన్నో మాటలు కెరీర్‌ ప్రారంభంలో వింటూ వచ్చాను. అవేవీ నన్ను మానసికంగా కుంగదీయలేదు. అయితే 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. దాన్ని మాత్రం తట్టుకోలేకపోయా. దేశ ప్రజల ఆశల్ని నెరవేర్చలేకపోయాననుకుంటూ కొన్ని నెలలపాటు సరిగ్గా నిద్రపోలేదు. దాదాపు ఏడాదిపాటు ఆటకు దూరమయ్యా. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సైకాలజిస్టుల కౌన్సెలింగ్‌తో మళ్లీ మామూలు మనిషినై రాకెట్‌ పట్టుకున్నా. తర్వాత ఎన్నో పతకాలు గెలిచా. నాలుగోసారి ఒలింపిక్స్‌లో ఆడబోతున్నా. క్రీడాకారులు కెరీర్‌ మాత్రమే జీవితం అనుకోకూడదు. కుటుంబం, స్నేహితులూ, ఆహారం, విహారం... వీటికీ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మానసికంగా దృఢంగా ఉండగలం.

- సానియా మీర్జా


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని