వినరో భాగ్యము విష్ణు కథ

నారాయణ స్తోత్రంలో శ్రీమన్నారాయణుడే శ్రీమహావిష్ణువు అని ఆదిశంకరాచార్యులు కీర్తించారు. యజుర్వేదం, రుగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు సైతం విష్ణువే పరమదైవమని కీర్తిస్తున్నాయి.

Published : 25 Jan 2023 00:03 IST

నారాయణ స్తోత్రంలో శ్రీమన్నారాయణుడే శ్రీమహావిష్ణువు అని ఆదిశంకరాచార్యులు కీర్తించారు. యజుర్వేదం, రుగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు సైతం విష్ణువే పరమదైవమని కీర్తిస్తున్నాయి. అత్యంత ప్రాచుర్యం కలిగిన విష్ణుసహస్రనామ స్తోత్రం ఆ దైవమే పరమాత్ముడని కాలాతీతుడు, సృష్టి స్థితిలయాధిపతి అని చెబుతోంది. వ్యాఖ్యాతీతమైన ఆ తత్వంలో గర్భోదకసాయి విష్ణు(శ్రీమహావిష్ణువు గర్భంలోనుంచి పద్మంలో బ్రహ్మ ఉద్భవించడానికి మూలకారణమైన విష్ణు అంశ) అని క్షీరోదకసాయి విష్ణు అని ద్వివిధ తత్వాలు ప్రస్ఫుటమవుతాయి. మహావిష్ణువు కోటానుకోట్ల బ్రహ్మాండాల్లోని పరమాణువుల్లో సైతం విస్తరించి ఉన్నాడు.  ఆదిపురుషుడి గురించి శుక్లయజుర్వేదంలోని పురుషసూక్తం విపులంగా వర్ణిస్తోంది.

గర్భోదకసాయి భౌతిక ప్రకృతిలోని సముద్రాలు, నదీ నదాలతో సహా జీవకోటి నిర్మాణానికి కారకుడు. ఖగోళ ఏర్పాటుకు సైతం గర్భోదక విష్ణువు కారకుడని అథర్వణ వేదానికి చెందిన గోపథ బ్రాహ్మణం వివరిస్తోంది. ఈ అపురూప ఉత్పత్తిక్రమం నిరంతరం సాగే క్రియగా అరణ్యకాలు (బ్రాహ్మణాల్లోని ఒక భాగం అరణ్యకం) సైతం విశదం చేస్తున్నాయి. ఇందువల్లే విష్ణువును ఆది అంతం లేనివాడని అంటారు. శుకదేవుడు ఈ రూపాన్ని అనంతుడు అని అభివర్ణించాడు. గర్భోదకసాయి విష్ణువు విస్తరణే పరమాత్మ. ఆ పరమాత్మ నిరాకారుడు. ఈ రెండు అంశల బృహత్తర సంకీర్ణ  స్వరూపమే మహావిష్ణువు అని జినసేనుడు రాసిన హరివంశ పురాణం చెబుతోంది.

విష్ణువు ఆది అంతాలు లేనివాడు. దశావతారాలన్నీ క్షీరోదక విష్ణువు అంశలేనని హరివంశపురాణం తెలుపుతోంది. శ్రీమహావిష్ణువు గురించి సంపూర్ణంగా తెలిసినవారు నేరుగా విష్ణు సాన్నిధ్యం చేరుతారని పురాణాల వ్యాఖ్య. శ్రీమహావిష్ణువును ధరణీధరుడని శేషుడని తేజోనిధి అని అజేయుడని పురాణ వాంగ్మయాలు ప్రస్తావిస్తున్నాయి.

నారదుడు శివుడు మనువు ప్రహ్లాదుడు శుకుడు యముడు మాత్రమే మహావిష్ణు తత్వం తెలిసిన వారని యజుర్వేదం చెబుతోంది. శ్రీమహావిష్ణువును ఆదిత్యుడు సవిత్రుడు అనీ వ్యవహరిస్తారు. ఆయన శక్తి అంతరిక్షంలో నిండి ఉందన్నది ఉపనిషద్వ్యాఖ్య.  విష్ణుమూర్తి నిరాకారుడే అయినా ఆ శక్తి మొత్తం వైకుంఠంలో ఉంటుందని రుగ్వేదం చెబుతోంది. దేవతలు సదా విష్ణుధామమైన పరమపదం వైపు చూస్తూ ఉంటారని శ్రీమద్రామానుజులు రాసిన శ్రీవైష్ణవాహ్నకం అనే గ్రంథం వివరిస్తోంది. దుర్బలురకు (బలహీనులకు) బలమెవ్వడు... నీకు నాకు బ్రహ్మాదులకున్‌ అని ప్రహ్లాదుడే కాక- వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణుకథ అని అన్నమాచార్య సైతం మధురంగా గానం చేశాడు.

అప్పరుసు రమాకాంతరావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు