దినకరా... శుభకరా!

మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతి రథసప్తమిగా ప్రశస్తి పొందింది. అదితి కశ్యపులకు సూర్య భగవానుడు జన్మించిన సుదినమిది. రథసప్తమి ఉత్తరగతిని సూచించే పండుగ.

Updated : 16 Feb 2024 06:43 IST

మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతి రథసప్తమిగా ప్రశస్తి పొందింది. అదితి కశ్యపులకు సూర్య భగవానుడు జన్మించిన సుదినమిది. రథసప్తమి ఉత్తరగతిని సూచించే పండుగ. రథసప్తమిని సూర్యజయంతి, జయంతి సప్తమి, మహాసప్తమి, సౌరసప్తమి, భాస్కర సప్తమి మొదలైన పేర్లతో విభిన్న ప్రాంతాల్లో పిలుస్తారు. నిజానికి రథసప్తమి నుంచే ఆదిత్యుడి ప్రయాణం దక్షిణం నుంచి ఉత్తర దిశకు ప్రారంభమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రోజున స్వర్గస్థులైన పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఒకప్పుడు రథసప్తమినే ఉగాదిగా వ్యవహరించేవారట.

సూర్యుడికి విశ్వకర్మ కూతురు ‘సంజ్ఞ’తో వివాహం జరిగింది. భర్త తేజస్సు భరించలేని సంజ్ఞ కళ్లు మూసుకుంది. ఫలితంగా యముడు పుట్టాడు. తరవాత భర్తను చంచల దృష్టితో చూసింది. తత్ఫలితంగా నిరంతరం ప్రవహించే నది రూపంతో ‘యమున’ జన్మించింది. సూర్య తేజస్సుకు బెదిరిన సంజ్ఞ తన ఛాయను భర్త వద్ద ఉంచి వెళ్ళిపోయింది. సూర్యుడికి ఈ విషయం తెలియదు. ఛాయాసూర్యులకు కాలాంతరాన శని, సావర్ణి అనే పుత్రులు, తపతి అనే కూతురు జన్మించారు.

రథసప్తమి రోజున ప్రాతఃకాలంలోనే జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తలపైన ఉంచుకుని స్నానం చేస్తారు. నేడు చేసే సముద్ర స్నానం శ్రేష్ఠమైందని చెబుతారు. ‘నమస్కారప్రియో భానుః’ అన్నారు. భాస్కరుడు విశ్వసాక్షి, కర్మసాక్షి, ప్రత్యక్షసాక్షి. మన పుణ్య పాప కర్మలన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాడు.

రామాయణ కాలంలో శ్రీరాముడు అగస్త్య మహర్షి నుంచి ‘ఆదిత్య హృదయ స్తోత్రం’ ఉపదేశం పొంది రావణాసురుణ్ని సంహరించాడని పురాణ కథనం. కుంతీదేవి సూర్యవర ప్రభావంచేత కర్ణుణ్ని పుత్రుడిగా పొందింది. సత్రాజిత్తు సూర్యారాధన చేసి శ్యమంతకమణిని పొందగలిగాడు. ప్రస్కణ్వ మహర్షి సూర్యజపం చేసి చర్మవ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. భద్రేశ్వరుడు అనే రాజు ఆదిత్యుణ్ని ఆరాధించి శ్వేతకుష్ఠు వ్యాధి నుంచి నివృత్తుడైనట్లు చెబుతారు. మయూరుడనే కవి సూర్యశతకం రాసి చర్మవ్యాధి పోగొట్టుకున్నట్లు మరో కథనం. కాంభోజ దేశాధిపతి యశోధర్ముడు వ్యాధిగ్రస్తుడైన తన పుత్రుడిచేత రథసప్తమి వ్రతం జరిపించి రాజ్య పట్టాభిషిక్తుణ్ని చేసినట్లు భవిష్యపురాణం చెబుతోంది. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఆవిష్కరించిన సూర్య సంబంధిత గాయత్రీ మంత్రం మానవజాతికి మహిమాన్విత మోక్షమార్గ సూత్రం. సూర్యకృప కోసం కొందరు ‘అరుణ పారాయణం’ చేసే సంప్రదాయమూ ఉంది. శ్రీకృష్ణుడి పుత్రుడు సాంబుడు అనన్య సామాన్యమైన సూర్యోపాసన చేశాడు.

హనుమ సూర్యుణ్ని గురువుగా స్వీకరించి, సకల శాస్త్రపారంగతుడయ్యాడు.  దినకరోపాసనతో సీతాదేవి ఆత్మస్థైర్యం పొందిందని యుద్ధకాండ చెబుతోంది. ధర్మరాజుకు అత్యంత మహిమాన్వితమైన అక్షయ పాత్రను అనుగ్రహించిన దివాకరుణ్ని సూర్య నమస్కారాలతో కొందరు ఉపాసిస్తారు. శైవ వైష్ణవులందరికీ ఆయన ఆరాధ్యుడే! అఖిల ప్రాణికోటికి, ప్రకృతికి జీవశక్తి, చైతన్యస్ఫూర్తి ప్రసాదించేది ఆ వేద స్వరూపుడే. పలు ప్రాంతాల్లో మహిళలు అనేక వ్రత విధానాలతో అంతర్యామిని అర్చిస్తారు. పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. వ్రత చూడామణి, ధర్మసింధువు, నిర్ణయామృతం వంటి అనేక గ్రంథాల్లో రథసప్తమి గురించి విస్తృత వర్ణన ఉంది. ‘తం సూర్యం ప్రణమామ్యహమ్‌’ అంటూ ప్రభాకరుడికి ప్రణామం చేస్తే చాలు, జన్మ చరితార్థమవుతుందంటారు.

 చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని