ఆయనో ఇసుకోటీశ్వరుడు

స్థానికేతరుడిగా వచ్చిన ఆయన... పల్నాడు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధిగా పోటీ చేశారు. అయినా... ప్రజలు ఆదరించి ఎన్నుకున్నారు.

Updated : 19 Mar 2024 13:44 IST

రెండేళ్లలోనే భారీగా ఆర్జన
సహజ వనరుల దోపిడీలో దూకుడు
పేదల ఇళ్ల స్థలాల పేరిట భారీగా మేత
ఎదిరించినా... ప్రశ్నించినా... కేసులతో వేధింపులు
అనుచరులతో దాడులూ నిత్యకృత్యం
పల్నాడు జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబ కథా చిత్రమ్‌

ఆయన పేరులో అమరేశ్వరుడున్నారు...!
ఎత్తింది మాత్రం బకాసుర అవతారం...
నాటి బకాసురుడిది తిండి కోసం ఆకలి...
ఈయనకేమో అక్రమార్జన దాహం...
జేబులు నింపుకొనేందుకు కృష్ణమ్మను తోడేస్తున్నారు...
ఇసుకలో కాసులను పిండుకుంటున్నారు
ఆ అడ్డగోలు మేతలో ‘అన్న’కూ ఉందట భాగస్వామ్యం...
అక్రమాల్లో కుమారుడు, సహధర్మచారిణిది తోడూనీడలాంటి సహకారం...
వెరసి... వీరి కుటుంబ కథా చిత్రంలో దౌర్జన్యమే కథా వస్తువు!!

స్థానికేతరుడిగా వచ్చిన ఆయన... పల్నాడు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధిగా పోటీ చేశారు. అయినా... ప్రజలు ఆదరించి ఎన్నుకున్నారు. ఇప్పుడు అక్రమాల్లో అనకొండగా మారిన ఆయన ఆ ప్రజలకే చుక్కలు చూపిస్తున్నారు. పేరులో అమరేశ్వరుడున్నా... చేసేవి వికారపు పనులే. ఇసుకాసుర అవతారమెత్తి రెండేళ్లలోనే రూ.వందల కోట్లు పిండేశారు. ఆయన ఆకలికి కృష్ణమ్మ విలవిల్లాడుతోంది. ఇసుక, మట్టి, బినామీ లారీలు, కాంట్రాక్టులు, అటవీ భూముల ఆక్రమణ, బెదిరింపులు, దాడులు, వేధింపులు ఇలా చెప్పుకొంటూపోతే ఈయన లీలలు చాలానే ఉన్నాయి. అక్రమాలపై ఎవరైనా ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా పోలీసు కేసులు బనాయిస్తారు. అనుచరులను పంపి దాడులూ చేయిస్తారు. ఈ అక్రమాల్లో ఆయన కుమారుడు తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నారు. ఆ ప్రజాప్రతినిధి సహధర్మచారిణి సైతం పతి ధర్మాన్నే పాటిస్తున్నారు.


రోజూ వేయి లారీల్లో ఇసుక తరలింపు

న పార్టీ అధికారంలోకి రాగానే ఆయన కన్ను కృష్ణా నదిలోని ఇసుకపై పడింది. ఇసుక కాంట్రాక్టు సంస్థపై తన అనుచరులతో తిరుగుబాటు చేయించారు. ఆ సంస్థ తప్పుకోవడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాలను ఆయనే చేజిక్కించుకున్నారు. ప్రజాప్రతినిధి కుమారుడు, ఆయన మిత్రులు ఈ దందాను పర్యవేక్షించడానికి గుంటూరులో కార్యాలయం తెరిచారు. ఇసుక రవాణాకు ఏకంగా నదిలోనే రోడ్డు వేయించారు. ఇందుకోసం కృష్ణా పక్కనే వేంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర కొండను సైతం తవ్వి రాళ్లు, మట్టిని తీసుకెళ్లారు.

తవ్వకాల పేరిట నదిలో అడ్డుకట్ట వేసి, ప్రవాహ గతినే మార్చేశారు. వరదల సమయంలోనూ సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో నదీతీరంలో ఇసుక కొండలను సృష్టించారు. చింతపల్లి, కొత్తపల్లి, చామర్రు, కోనూరు, మల్లాది, దిడుగు, ముత్తాయపాలెం, అమరావతి, వైకుంఠపురం, ప్రకాశం బ్యారేజీకి దిగువనున్న గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు, అత్తలూరివారిపాలెం, వల్లభాపురం, మున్నంగి, పిడపర్తిపాలెం, బొమ్మువానిపాలెం, గాజుల్లంక, పెదలంక ఇసుక రీచ్‌లలో రాత్రిపగలు తవ్వకాలు కొనసాగించారు. నదీ తీరగ్రామాల ప్రజలు ఆందోళనకు దిగితే కేసుల పేరుతో బెదిరించారు. రోజూ వేయి లారీలకుపైగా ఇసుకను తరలించారు. పరిమితికి మించి నింపుతూ అదనంగా వసూలు చేశారు. ఒక్కో రీచ్‌ నుంచి ఇసుక తవ్వకాల ద్వారా రూ.10 లక్షల మేర అక్రమాదాయం పొందారు. ఈ లెక్కన 10 రీచ్‌లకు కలిపి రోజుకు   రూ.కోటి చొప్పున నెలకు రూ.30 కోట్లు పొందారు. 16 నెలలపాటు నిరాటంకంగా ఇసుక తవ్వకాలు సాగించడం ద్వారా రూ.480 కోట్లు అక్రమంగా ఆర్జించి, అందులో వైకాపా పెద్దలకు రూ.320 కోట్లు చెల్లించి ఆయన   రూ.160 కోట్లు పొందారనే చర్చ జోరుగా సాగుతోంది.

ప్రజాప్రతినిధి మేతను స్ఫూర్తిగా తీసుకున్న స్థానిక వైకాపా నేతలు నదీ తీరంతోపాటు వాగులు, చెరువుల్లో మట్టి తవ్వి జేబులు నింపుకొన్నారు. ఆయన అనుచరుల్లో ఒకరు క్రోసూరు మండలంలో 50 ఎకరాల అటవీ భూములను చదును చేసి, ఎకరా రూ.లక్ష చొప్పున అమ్ముకున్నారు.


సొంత లారీలతో రవాణా

ఇసుక రవాణాను సైతం ఈ ప్రజాప్రతినిధి పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. తన కుమారుడి మిత్రుడు, అతని బంధువు పేర్లతో ఒక ట్రాన్స్‌పోర్టు సంస్థను ఏర్పాటు చేశారు. దీనిద్వారా నాడు-నేడు, జగనన్న కాలనీలకు ఉచిత ఇసుకను తరలించారు. లారీలకు సీరియల్‌ లేకుండా నేరుగా రీచ్‌లోకి వెళ్లి నింపుకొచ్చేవి. ఇందులో కొన్నింటిని లెక్కల్లో చూపకుండా సొమ్ము చేసుకున్నారు. పల్నాడు ప్రాంతంలోని సిమెంటు కంపెనీలు, గుత్తేదారులు, బిల్డర్లతో ఒప్పందాలు చేసుకుని ఇసుక తరలించారు. బినామీ ట్రాన్స్‌పోర్టు ద్వారా నెలకు రూ.2.50 కోట్ల వరకు అర్జించారు. 16 నెలల్లో ఖర్చులు పోగా రూ.40 కోట్లు వెనకేసుకున్నారు.


పేదల స్థలాల కొనుగోళ్లలోనూ దోపిడీ

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో 250 ఎకరాలను సేకరించింది. ఇందులోనూ ప్రజాప్రతినిధి చక్రం తిప్పారు. ఒక ఎకరం ధర రూ.15-20 లక్షలుగా పలుకుతున్న భూముల రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. వాటినే ఎకరాకు రూ.50-55 లక్షల చొప్పున ప్రభుత్వానికి అంటగట్టారు. రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమకాగానే అనుచరులను పంపించి, తన వాటాను వసూలు చేయించారు. ఒక గ్రామంలో 7.10 ఎకరాల భూమిని ఈ నేత అనుచరులు కొన్నారు. దాన్నే ప్రభుత్వానికి భూసేకరణలో ఇచ్చారు. అందులోని కొంతభూమి గుంటూరులోని ఒక బ్యాంకు తనఖాలో ఉంది. దీనిపై బ్యాంకు అధికారులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో... బకాయిలన్నీ చెల్లించేశారు.


బినామీ కంపెనీలతో రోడ్ల నిర్మాణం

ప్రజాప్రతినిధి... ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్ల పనులను తమ బినామీ గుత్తేదారు సంస్థకు ఇప్పించారు.   రూ.149 కోట్లకుపైగా అంచనాతో చేపట్టిన రోడ్డు టెండర్లలో ఇతరులెవరూ పాల్గొనకుండా అడ్డుపడ్డారు. రెండు కంపెనీలే టెండర్లు వేసేలా చూసి పనులను దక్కించుకున్నారు. వారు వేసిందే రోడ్డు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.


ప్రశ్నిస్తే హత్యాయత్నం కేసులు

  • ఎన్నికలప్పుడు తమకు ఓట్లు వేయలేదని ఒక ఎస్సీ కాలనీలోని బడుగులపై వైకాపా కార్యకర్తలతో దాడిచేయించి, కేసులు పెట్టించారు. మరో గ్రామంలో మైనారిటీ నేతపై పదుల సంఖ్యలో కేసులు పెట్టించి, రౌడీషీట్‌ తెరిపించారు.
  • రాజధాని మహిళా రైతులు అమరేశ్వరుని దర్శనానికి అమరావతి వెళ్తుండగా లేమల్లె వద్ద బస్సుపై దాడి చేశారు. ప్రతిఘటించిన తెదేపా వారిపై హత్యాయత్నం కేసులు పెట్టించి, రౌడీషీట్లు తెరిపించారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద ధర్నాలో ఉన్న తెదేపా వారిపై రాళ్లతో దాడిచేశారు. ఈ ప్రజాప్రతినిధిని ప్రశ్నించిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుపై కేసు పెట్టి, అనుచరులతో దాడి చేయించారు. తనకు ఎదురుతిరిగిన వైకాపా నేతపైనే హత్యాయత్నం కేసు పెట్టించారు. ఆ నేతకు సహకరించారనే నెపంతో మరో వ్యక్తిపై లేనిపోని కేసులు పెట్టించి, జిల్లా బహిష్కరణ చేయించడంతోపాటు పీడీ యాక్టు కింద జైలుకు పంపారు.
  • ఇసుక రీచ్‌లలో అక్రమాలపై సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారని తెదేపా కార్యకర్తపై కేసు పెట్టించి, చిత్రహింసకు గురి చేశారు. ఎస్టీ కాలనీ వాసుల గృహాల్లో వాలంటీరు రూ.30 లక్షల అవినీతికి పాల్పడ్డాడని పోస్టు పెట్టినందుకు మరో తెదేపా కార్యకర్త ఇంటిపై దాడులు చేశారు. సోషల్‌మీడియాలో వ్యతిరేక పోస్టు పెట్టారని, అమరావతి-బెల్లంకొండ రోడ్డు గురించి ప్రశ్నించారని ఇద్దరు ముస్లిం యువకులపై కేసులు పెట్టించారు.
  • చెరువులో మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేసినందుకు ఓ మాజీ సర్పంచిపై దాడులు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలపై మరో సర్పంచి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై అధికారులు పరిశీలిస్తున్న సమయంలో... న్యాయవాదులు, గ్రామస్థులపై పోలీసుల సమక్షంలో దాడులు జరిగాయి.
  • మాట వినడంలేదని మండల స్థాయి అధికారిని బదిలీ చేయించడంతో ఆయన కోర్టు ద్వారా మళ్లీ విధులో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అనుకూలంగా వ్యవహరించలేదని పలువురిని బదిలీ చేయించారు. వీరి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ తహసీల్దారు బదిలీ చేయించుకున్నారు.

సహధర్మం

ప్రజాప్రతినిధి సహధర్మచారిణి ఆయనకు నీడగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఏకంగా అధికారులతో సమీక్షలూ నిర్వహిస్తారు. ఉద్యోగుల బదిలీల్లోనూ కలగజేసుకుంటారు. డ్వాక్రా మహిళలకు ‘ఆసరా’ చెక్కుల పంపిణీ సభలోనూ అన్నీ తానై వ్యవహరించారు. ఇంటింటికీ తిరుగుతూ కుక్కర్లను పంపిణీ చేసి తన భర్తకు అండగా నిలవాలని కోరారు. అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, పాస్టర్లు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు, యానిమేటర్లు, వాలంటీర్లతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి తమను గెలిపించాలని కోరుతున్నారు.

ఈ ప్రజాప్రతినిధి తనయుడు ఇటీవల ఒక మండలంలో కొందరిని వెంటబెట్టుకుని వెళ్లి తెదేపా కార్యకర్తపై దాడి చేసి, వీరంగం చేసినా కేసు నమోదు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని