Akasa Air: ఆకాశ ఎయిర్‌లో సమాచార ఉల్లంఘన.. క్షమాపణ చెప్పిన సంస్థ

విమానయాన రంగంలో అడుగుపెట్టిన స్వల్ప కాలంలోనే సేవలను మొదలుపెట్టిన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్‌.

Published : 28 Aug 2022 22:52 IST

దిల్లీ: విమానయాన రంగంలో అడుగుపెట్టిన స్వల్ప కాలంలోనే సేవలను మొదలుపెట్టిన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్‌ (Akasa Air). ఇలా సేవలను ప్రారంభించి నెల రోజులు గడవకముందే ఈ ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రతికూల ఘటన ఎదుర్కొంది. సాంకేతిక సమస్య కారణంగా వినియోగదారులకు సంబంధించి సమాచారాన్ని అనధికారిక వ్యక్తులు చూసేందుకు వీలుకలిగినట్లు గుర్తించింది. అయితే, సమాచార ఉల్లంఘనను (Data Breach) స్వయంగా తామే గుర్తించి అప్రమత్తం అయ్యామని పేర్కొన్న ఆకాశ ఎయిర్‌లైన్స్‌ సంస్థ.. ఇందులో ఎటువంటి హ్యాకింగ్‌ ఉద్దేశం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు క్షమాపణ కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘లాగిన్‌, సైన్‌-అప్‌లకు సంబంధించి సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించాం. దీనివల్ల ఆకాశ ఎయిర్‌లైన్‌లో రిజిస్టరైన వినియోగదారుల పేర్లు, ఈ-మెయిల్‌, ఫోన్‌ నంబర్లను అనధికారిక వ్యక్తులు చూసే వీలు కలిగింది. ఈ సమస్యను గుర్తించిన వెంటనే అప్రమత్తమయ్యాం. ఇదే విషయాన్ని నోడల్‌ ఏజెన్సీ ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (CERT-In)కు తెలియజేశాం. అయినప్పటికీ  ప్రయాణికులకు చెందిన ఎటువంటి సమాచారం బహిర్గతం కాలేదని భరోసా ఇస్తున్నాం’ అని ఆకాశ ఎయిర్‌లైన్స్‌ సహవ్యవస్థాపకుడు, సీఐఓ ఆనంద్‌ శ్రీనివాసన్‌ తెలియజేశారు.

ఇదిలాఉంటే, ఆగస్టు 7వ తేదీన విమాన సేవలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్‌లైన్స్‌.. తొలి విమానాన్ని ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య నడిపింది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విమానాన్ని ప్రారంభించగా.. ఆకాశ ఎయిర్‌లో పెట్టుబడులు పెట్టిన దిగ్గజ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తొలి విమానంలో ప్రయాణించారు. అనంతరం బెంగళూరు-కోచి, బెంగళూరు- ముంబయి, చెన్నె- ముంబయి మార్గాల్లో ఆకాశ ఎయిర్‌ విమాన సేవలను విస్తరించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని