Akash Ambani: ‘ఆ విషయం మా నాన్న నమ్మలేదు’: ఆకాశ్‌ అంబానీ ఆసక్తికర వ్యాఖ్య

కాలేజ్‌ డేస్‌ ప్రతి ఒక్కరి జీవితంలో బెస్ట్‌ మూమెంట్స్ అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాశ్ అంబానీ(Akash Ambani) అన్నారు.

Published : 29 Dec 2023 02:09 IST

ముంబయి: తనకు మళ్లీ కళాశాల రోజుల్లోకి వెళ్లే అవకాశం వస్తే.. తాను ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు ప్రయత్నిస్తానని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాశ్ అంబానీ(Akash Ambani) అన్నారు. ఐఐటీ బాంబేలో ప్రసంగించేందుకు ఆహ్వానం వచ్చిందని చెప్పినప్పుడు తన తండ్రి ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) ఇచ్చిన రియాక్షన్‌ గురించి వెల్లడించారు. ఐఐటీ బాంబే(IIT Bombay) టెక్‌ఫెస్ట్‌లో పాల్గొన్న ఆయన కొన్ని ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చారు.

‘ఇక్కడకు రావడం నా లక్ష్యాల్లో ఒకటి. నేను ఇంజినీర్ కావాలని నా తండ్రి కోరుకునేవారు. కానీ నేను ఇంజినీర్‌ను కాదు. కానీ ఈ ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలలో ప్రసంగించేందుకు అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ ప్రసంగించేందుకు ఆహ్వానం వచ్చిందంటే నా తండ్రి నమ్మలేదు. అందుకే సాక్ష్యం కోసం నా భార్యను వెంట పంపారు’ అని ఆకాశ్‌(Akash Ambani) చమత్కరించారు. ఐఐటీ బాంబే(IIT Bombay)కు రావడం ఎలా ఉందని అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.

‘పసిడి మెరుపులు.. భారీ GST వసూళ్లు.. రికార్డు యూపీఐ లావాదేవీలు..!’

తర్వాత తన విద్యాభ్యాసం గురించి వెల్లడించారు. ‘అదృష్టవశాత్తు.. నాకు కళాశాల విద్యకు సంబంధించి మంచి జ్ఞాపకాలున్నాయి. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే.. కళాశాలలో గడిపిన సమయమే బెస్ట్‌గా ఉంటుందనేది నా అభిప్రాయం. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే తరగతి గదిలో నా స్నేహితుల నుంచి నేర్చుకోవడంపై నేను ఎక్కువ దృష్టి పెట్టలేదు. వారి నుంచి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఒక విద్యార్థికి చదువుతో పాటు సమాజంతో కలివిడిగా ఉండటం ముఖ్యమని  నా అభిప్రాయం’ అని అన్నారు.

ఐఐటీ బాంబే టెక్‌ఫెస్ట్‌లో భాగంగా బుధవారం ఆయన ప్రసంగం వైరల్ అవుతోంది. అలాగే ఈ సందర్భంగా తమ సంస్థ భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడారు. ‘కంపెనీ అభివృద్ధికి ఒక వ్యవస్థను రూపొందించడం చాలా ముఖ్యం. జియో 2.0 పై ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఐఐటీ బాంబేతో కలిసి భారత్‌ జీపీటీ ప్రోగ్రామ్‌పై పనిచేస్తున్నాం. కృత్రిమ మేధ(ఏఐ)తో ప్రతీ రంగంలోని ఉత్పత్తులు, సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావొచ్చు. ఏఐని అన్ని రంగాల్లోనూ ఆవిష్కరించాలని చూస్తున్నాం. మీడియా, కామర్స్‌, కమ్యూనికేషన్స్‌లో ఉత్పత్తులు, సేవలను తీసుకురానున్నాం. గత కొద్ది కాలంగా టీవీల కోసం సొంత ఓఎస్‌పై పనిచేస్తున్నాం’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని