ట్యాక్స్‌ పేయర్లు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు: అష్నీర్‌ గ్రోవర్‌

Ashneer Grover on Govt: దేశంలో ఆదాయపు పన్ను విధానంపై భారత్‌పే మాజీ బాస్‌ అష్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పన్ను చెల్లించడమంటే శిక్షతో సమానమని వ్యాఖ్యానించారు.

Published : 12 Jun 2023 15:53 IST

దిల్లీ: దేశంలో అమలౌతున్న ఆదాయపు పన్ను విధానంపై భారత్‌పే (BharatPe) మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌ (Ashneer Grover) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పన్ను చెల్లింపు విధానంలో లోపాలు ఉన్నాయన్నారు. ట్యాక్స్‌ పేయర్లు తాము సంపాదిస్తున్న దాంట్లో 30-40 శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారని, ప్రతిగా వారికి ఎలాంటి ప్రయోజనమూ ఉండడం లేదన్నారు. భారత్‌లో పన్ను చెల్లించడమంటే శిక్షలాంటిదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పన్ను చెల్లింపు విధానంపై ఇటీవల వేర్వేరు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

‘‘దేశంలో పన్ను చెల్లింపుదారులు పరులకు ఉపయోగపడుతున్నారు. ప్రతిగా వారికంటూ ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. రూ.10 సంపాదిస్తే అందులో రూ.4 ప్రభుత్వానికి పన్నుగా చెల్లిస్తున్నారు. అంటే ఏడాదికి 3-5 నెలలు పాటు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు. అయినా ఎన్నాళ్లు ఇలా ప్రభుత్వానికి ఊడిగం చేయాలి? అయినా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నడుచుకోవాల్సిందే. తప్పదు!! ఒక వ్యాపారవేత్తగా చెప్తున్నా.. వ్యాపారులకు పన్ను నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసు. కానీ ఉద్యోగుల పరిస్థితి అలా కాదు. వారి ఆదాయం మూలం వద్దే కోత (TDS) పడుతుంది. దీనికి తోడు 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. కాబట్టి దేశంలో పన్ను చెల్లించడమమంటే ఓ శిక్షే’’ అని అష్నీర్‌ గ్రోవర్‌ అభిప్రాయపడ్డారు.

ఒకవేళ తానే గనుక రాజకీయనాయకుడిని అయితే ఆదాయపు పన్ను విధానంలో మార్పులు తీసుకొస్తానని అష్నీర్‌ అన్నారు. ‘‘30-40 శాతం పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ట్యాక్స్‌పేయర్లకు తిరిగి ఏమీ ఇవ్వడం లేదు. అందుకే వారు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరూ 10-15 శాతం పన్ను చెల్లించేలా చూడాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ పన్ను చెల్లిస్తారు. దాని వల్ల ఇప్పటికంటే ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది’’ అని గ్రోవర్‌ అన్నారు. విదేశాల్లో క్రెడిట్‌ కార్డు వినియోగంపై 20 శాతం టీసీఎస్‌ వసూలు చేయడాన్నీ గ్రోవర్‌ తప్పుబట్టారు. ‘‘విదేశాల్లో క్రెడిట్‌కార్డు వాడకంపై 20 శాతం పన్ను.. పార్టీలకు ఇచ్చే డొనేషన్లకు మాత్రం జీరో ట్యాక్స్‌’’ అంంటూ ఎద్దేవాచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు