Audi Q8 e-tron: ఆడి కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. సింగిల్‌ ఛార్జ్‌తో 600 కిలోమీటర్లు..!

ఆడి ఇండియా (Audi India) ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడి క్యూ8 ఈ-ట్రాన్‌ (Audi Q8 e-tron) పేరుతో ఎస్‌యూవీ, స్పోర్ట్స్‌బ్యాక్‌ వేరియంట్‌లో ఈ కారు అందుబాటులో ఉంది.

Updated : 18 Aug 2023 16:45 IST

దిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా (Audi India) కొత్త ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడి క్యూ8 ఈ-ట్రాన్‌ (Audi Q8 e-tron) పేరుతో నాలుగు వేరియంట్లలో ఈ కారును తీసుకొచ్చింది. ఆడి క్యూ8 50 ఈ-ట్రాన్‌, ఆడి క్యూ8 55 ఈ-ట్రాన్‌, ఆడి క్యూ8 స్పోర్ట్‌బ్యాక్‌ 50 ఈ-ట్రాన్, ఆడి క్యూ8 స్పోర్ట్‌బ్యాక్‌ 55 ఈ-ట్రాన్‌ పేరుతో వీటిని లాంచ్‌ చేసింది. సరికొత్త డిజైన్‌, మెరుగైన ఇంజిన్‌ పనితీరు, పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఈ కార్లు అందిస్తాయని కంపెనీ తెలిపింది. వీటిలో ప్రారంభ మోడల్‌ ధర రూ. 1.13 కోట్లు కాగా.. హైఎండ్ వేరియంట్‌ ధర రూ.1.30 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. 

ఆడీ క్యూ8 ఈ-ట్రాన్‌ ఫీచర్లు

  • క్యూ8 55 మోడల్‌లో 114kWh బ్యాటరీ అమర్చారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 600 కి.మీ ప్రయాణిస్తుంది. అలాగే 408 హెచ్‌పీ శక్తిని 664 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. 5.6 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.
  • క్యూ8 50 మోడల్‌లో 95kWh బ్యాటరీ ఉంది. సింగిల్‌ ఛార్జ్‌తో 505 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది 340 హెచ్‌పీ శక్తిని 664 ఎన్ఎమ్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ మోడల్‌ ఆరు సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. 20 నుంచి 80 శాతం బ్యాటరీ 26 నిమిషాల్లో ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. 
  • ప్రయాణికుల భద్రత కోసం ఈ కారులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌లో ఆటో, డైనమిక్‌, ఆఫ్‌-రోడ్‌ అనే మూడు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో ఏడు డ్రైవింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్‌లో సింగిల్‌ టచ్‌తో డ్రైవ్‌ మోడ్‌లను మార్చుకోవచ్చు. రహదారి పరిస్థితులకు అనుగుణంగా కారు ఎత్తును సర్దుబాటు చేసుకునేందుకు ఇందులో అడ్జస్టబుల్‌ రైడ్‌ హైట్‌ అనే ఫీచర్‌ ఉంది. 

‘‘ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఆడి క్యూ8 ఈ-ట్రాన్‌ ఎస్‌యూవీ, స్పోర్ట్స్‌బ్యాక్‌ మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఆధునిక లగ్జరీ ఫీచర్లతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలు కావాలనుకునే వారికి ఇవి సరైన ఎంపిక. ఆడి కస్టమర్లను ఈ కార్లు తప్పక ఆకట్టుకుంటాయి’’ అని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ థిల్లాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని