Musk Twitter Deal: సందిగ్ధంలో ట్విటర్‌ కొనుగోలు.. చర్చలు నిలిపివేసిన మస్క్‌?

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్ డాలర్ల ట్వటర్‌ కొనుగోలుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది....

Updated : 08 Jul 2022 13:04 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేయడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ డీల్‌ ముందుకెళ్లడంపై పలు అనుమానాలు నెలకొన్నాయని తాజాగా వాషింగ్టన్‌ పోస్ట్‌ మస్క్‌ సన్నిహితులను ఉటంకిస్తూ కథనం ప్రచురించింది. నకిలీ ఖాతాలను తేల్చే విషయంలో నెలకొన్న పీటముడి ఇంకా వీడడం లేదని సమాచారం.

నకిలీ ఖాతాల సంఖ్య 5 శాతం వరకు మాత్రమే ఉంటాయని ట్విటర్‌ చెబుతూ వస్తోంది. కానీ, ఆ సంఖ్య అంతకంటే చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉందని మస్క్‌ వాదిస్తున్నారు. లెక్క తేల్చే వరకు కొనుగోలు ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. తాజాగా ఇదే విషయంపై జరుగుతున్న చర్చల్ని మస్క్‌ బృందం నిలిపివేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. నకిలీ ఖాతాలను లెక్కించే విషయంలో ట్విటర్‌ అనుసరిస్తున్న విధానంతో మస్క్‌ ఏకీభవించడం లేదని తెలుస్తోంది. మరోవైపు సొంతంగానూ తేల్చడం మస్క్‌ బృందానికి సాధ్యపడటం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో డీల్‌ ఫండింగ్‌ విషయంలో తదుపరి చర్చల్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ట్విటర్‌ మాత్రం నకిలీ ఖాతాల విషయంలో మొదటి నుంచీ ఒకే వాదనను వినిపిస్తోంది. మస్క్‌కు ఎలాంటి సమాచారం అందజేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు ట్విటర్‌ అధికార ప్రతినిధి తాజాగా తెలిపారు. వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నామని గుర్తుచేశారు. ఈ లావాదేవీని పూర్తి చేసి కొనుగోలు ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావాలని తాము భావిస్తున్నామన్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఆఫ్టర్‌ మార్కెట్‌లో ట్విటర్‌ షేరు 4 శాతం మేర కుంగింది. ఈ ఏడాది షేరు ధర ఇప్పటి వరకు 10 శాతం నష్టపోయి 38.79 డాలర్లకు చేరింది. మస్క్‌ ఒప్పందంలో ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని