Dell: ఆఫీసుకు రాకపోతే ప్రమోషన్లు ఉండవ్‌.. ఉద్యోగులకు డెల్‌ నోటీసు!

Dell: టెక్‌ కంపెనీలన్నీ ఇంటి నుంచి పని విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. ఉద్యోగులంతా ఆఫీసుకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఈ తరుణంలో డెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 18 Mar 2024 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సంక్షోభం సమసిపోవటంతో టెక్ కంపెనీలన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work from home) విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగులంతా ఆఫీసుకు రావాలని అల్టిమేటం జారీ చేశాయి. అయినప్పటికీ.. కొందరు ఇంకా ఇంటినుంచి పనికే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్‌ (Dell) కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనల ప్రకారం ఆఫీసుకు రానివారికి ప్రమోషన్లు ఉండవని తేల్చి చెప్పినట్లు పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.

ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేయాలనుకునేవారు అదే విధానాన్ని కొనసాగించొచ్చని డెల్‌ (Dell) తమ ఉద్యోగులకు ఫిబ్రవరిలో జారీ చేసిన మెమోలో తెలియజేసింది. కానీ, వారెవరినీ ప్రమోషన్లకు పరిగణించబోమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కంపెనీలో హైబ్రిడ్‌ పని విధానం కొనసాగుతోంది. దీని ప్రకారం.. ప్రతీ ఉద్యోగి వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలి. అలా రానివారందరినీ ఇంటి నుంచి పని చేస్తున్నట్లు భావించాల్సి వస్తుందని కంపెనీ తెలిపింది. వారెవరికీ పదోన్నతులు ఉండవని స్పష్టం చేసింది. అలాగే జాబ్‌ రోల్‌ మార్చుకునే అవకాశం సైతం ఇవ్వబోమని చెప్పింది.

కరోనాకు ముందు నుంచే డెల్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work from home) విధానం అమల్లో ఉండేది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్‌ డెల్‌ సైతం దీన్ని ప్రోత్సహించేవారు.  పైగా ఆఫీసుకు రావాలని ఆదేశిస్తున్న కంపెనీలను ఆయన తప్పుబట్టారు. కానీ, తాజాగా డెల్‌ (Dell) విధానాల్లో సమూల మార్పులు వచ్చాయి. అందరూ కలిసి పనిచేయడం, తమ ఆలోచనలను పంచుకోవడం సంస్థ వృద్ధికి దోహదం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రతిఒక్కరూ ఆఫీసుకు రావాలని కోరుతోంది. తాజా నిర్ణయంతో చాలామంది ఉద్యోగులు సంతృప్తిగా లేరని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని