అంతర్జాతీయంగా ఎదురుగాలులు ఉన్నా.. భారత్‌ ముందుకే: నిర్మలా సీతారామన్‌

అంతర్జాతీయంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ వృద్ధిలో భారత్‌ ముందుకు దూసుకెళ్లబోతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

Published : 15 Oct 2022 13:10 IST

వాషింగ్టన్‌: అంతర్జాతీయంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ వృద్ధిలో భారత్‌ ముందుకు దూసుకెళ్లబోతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి సాధించబోతోందని చెప్పారు. దేశీయంగా అనుకూల వాతావరణం, తమ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు ఇందుకు కారణమని వివరించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫైనాన్స్‌ కమిటీ (IMFC) ప్లీనరీలో ఆమె మాట్లాడారు.

ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యల్బోణ ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల ప్రపంచ ఆర్థికం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్న వేళ ఈ సమావేశం జరుగుతోందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్‌ మాత్రం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి నమోదు చేయబోతోందని అంచనా వేశారు. దేశీయంగా సానుకూల విధాన నిర్ణయాలు, వృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కీలక నిర్మాణాత్మక సంస్కరణల ప్రభావంతో వృద్ధి నమోదు చేయబోతోందన్నారు. ద్రవ్యోల్బణం కట్టడి చేస్తూనే వృద్ధిని కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు.

గడిచిన 25 నెలలుగా దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నామని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ పేమెంట్స్‌లో ప్రపంచంలోనే భారత్‌ అగ్రగామిగా ఉందని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే అతి తక్కువ లావాదేవీ ఖర్చుతో ఈ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే అభివృద్ధి చెందుతున్న, తక్కువ ఆదాయం కలిగిన దేశాలను ఐఎంఎఫ్‌ వనరులను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐఎంఎఫ్‌లో వర్దమాన దేశాల ఓటింగ్‌ షేరు పెంచే విషయమై సమీక్షించాలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారత్‌ ఓటు షేరు 2.75 శాతంగా ఉంది. పొరుగు దేశమైన చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతంగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని