SVB Crisis: భారత బ్యాంకులపై ఎస్‌వీబీ ప్రభావమెంత?

SVB Crisis: ఎస్‌వీబీ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తరుణంలో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రభావం ఎలా ఉండనుందనే విషయంపై పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Updated : 13 Mar 2023 15:07 IST

దిల్లీ: సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (Silicon valley bank) పతనం యావత్‌ ప్రపంచ బ్యాంకింగ్‌ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని ప్రభావం ఇంకా పూర్తిస్థాయిలో బయటకు రాలేదని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా దీని పర్యవసానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. అయితే, భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ మాత్రం అందుకు భిన్నమని అభిప్రాయపడుతున్నారు.

ఆస్తులు, అప్పుల నిర్వహణలో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ బలంగా ఉందని మాక్వెరీ గ్రూప్‌ తెలిపింది. ఇక్కడి బ్యాంకులు స్థానిక డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడడమే దీనికి కారణమని మాక్వెరీ విశ్లేషకుడు సురేశ్‌ గణపతి చెప్పారు. పైగా వాటిని భారత ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే మదుపు చేస్తున్నారని తెలిపారు. మరోవైపు భారత బ్యాంకులకు ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ ఎస్‌వీబీతో పెద్దగా సంబంధాలు లేవని పేర్కొన్నారు.

ఆర్‌బీఐ పర్యవేక్షణ, నియంత్రణలో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ బలంగా ఉందని మరో ప్రముఖ ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ తెలిపారు. ఎస్‌వీబీ పతన ప్రభావం భారత బ్యాంకులపై అంతగా ఉండదని అభిప్రాయపడ్డారు. అయితే, స్వల్పకాలంలో స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంటు మాత్రం బలహీనపడే ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. దీర్ఘకాలంలో పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేశారు.

మరో ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్‌ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎస్‌వీబీ ఉదంతం వల్ల భారత బ్యాంకులు ప్రభావితమయ్యే అవకాశం చాలా తక్కువని ఓ ప్రకటనలో పేర్కొంది. భారత బ్యాంకుల్లో 60 శాతానికి పైగా డిపాజిట్లు సామాన్య ప్రజల పొదుపులేనని గుర్తుచేసింది.

డిపాజిటర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడంతో అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) దివాలా తీసిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను భారీగా పెంచడమే ఎస్‌వీబీ కుప్పకూలడానికి కారణమని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు పెరగడంవల్ల ఎస్‌వీబీ బాండ్లు, తనఖా ఉన్న సెక్యూరిటీల మార్కెట్‌ విలువ పడిపోయిందని, అదే ప్రస్తుత స్థితికి కారణమని విశ్లేషించారు. ఎస్‌వీబీ ప్రధానంగా టెక్నాలజీ, అంకుర సంస్థలకు రుణాలిచ్చేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని