Electric Vehicles: 2030 నాటికి ఈవీ విక్రయాల్లో ఈ రెండు విభాగాలదే ఆధిపత్యం!

రానున్న కొన్నేళ్లలో విద్యుత్తు ద్విచక్ర, త్రిచక్ర వాహన విక్రయాలు వేగంగా పెరగనున్నట్లు ఓ ప్రముఖ నివేదిక అంచనా వేసింది....

Published : 15 Sep 2022 00:59 IST

ఏసీఎంఏ, మెకిన్సీ నివేదిక

దిల్లీ: రానున్న కొన్నేళ్లలో విద్యుత్తు ద్విచక్ర, త్రిచక్ర వాహన విక్రయాలు వేగంగా పెరగనున్నట్లు ఓ  నివేదిక అంచనా వేసింది. 2030 నాటికి మొత్తం విద్యుత్తు వాహన (EV) విక్రయాల్లో వీటి వాటాయే 50-70 శాతం ఉంటుందని తెలిపింది. ప్రయాణికుల, భారీ వాణిజ్య వాహనాలతో పోలిస్తే ద్విచక్ర, త్రిచక్ర ఈవీలు మరింత అందుబాటు ధరలో లభ్యమవుతాయని పేర్కొంది. వాహన పరికరాల తయారీ సమాఖ్య (ACMA), మెకిన్సీ కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.

2030 నాటికి మొత్తం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ విక్రయాల్లో ప్రయాణికుల వాహనాల వాటా 10-15 శాతం, భారీ వాణిజ్య వాహనాల వాటా 5-10 శాతం ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ఈ రెండు విభాగాల్లో మరికొన్నేళ్ల పాటు సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలదే ఆధిపత్యం కొనసాగుతుందని తెలిపింది. ఈవీల విక్రయాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ ఇంధన వాహన పరికరాల తయారీ పడిపోతుందని పేర్కొంది. ఆ రంగంలోని కంపెనీలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపింది. అయితే, ఈవీ పరికరాల తయారీలోకి మారడానికి వాటికి ఇదొక అవకాశం కూడా అని పేర్కొంది. దేశీయ కంపెనీలు విదేశీ మార్కెట్ల అవసరాలకూ సరఫరా చేయొచ్చని తెలిపింది. స్థూలంగా ఈ దశాబ్దంలో మొత్తం వాహన పరిశ్రమ రూపురేఖలే మారిపోనున్నాయని పేర్కొంది.

విద్యుత్తు వాహనాలకు మారడంలో చైనా, ఐరోపా ముందుంటాయని నివేదిక తెలిపింది. ఈ దశాబ్దం మధ్య నాటికి భారత్‌, చైనాలో ప్రయాణికుల వాహన విక్రయాలు గరిష్ఠ స్థాయికి చేరతాయని పేర్కొంది. దీంతో వాహన రంగంలో ఈ రెండు దేశాలు ముందుంటాయని తెలిపింది. దేశీయ కంపెనీలు ఎగుమతులను విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఫలితంగా భారత్‌ భవిష్యత్తు వాహన తయారీ కేంద్రంగా అవతరిస్తుందని తెలిపింది.

నాలుగేళ్లలో 100 శాతం విద్యుదీకరణ: అమితాబ్‌ కాంత్‌

వచ్చే నాలుగేళ్లలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 100 శాతం విద్యుదీకరణే లక్ష్యంగా భారత్‌ ముందుకు సాగాలని జీ20 కూటమి షెర్పా అమితాబ్‌ కాంత్‌ అన్నారు. దేశంలో మొత్తం విక్రయాల్లో 80 శాతం వాటా వీటిదేనని తెలిపారు. దిల్లీలో బుధవారం జరిగిన ఏసీఎంఏ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2021-22లో భారత్‌లో 1.34 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహన యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2.60 లక్షల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1.75 కోట్ల వాహన విక్రయాలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని