Elon Musk: మాజీ ఉద్యోగికి సారీ చెప్పిన ఎలాన్‌ మస్క్‌.. ఎందుకంటే?

Elon Musk: ఓ ఉద్యోగి గురించి వాస్తవ పరిస్థితులేంటో తెలుసుకోకుండా తాను మాట్లాడానని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. అందుకు తనని క్షమించాలని ఆయన్ని కోరారు.

Updated : 08 Mar 2023 15:18 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ మాజీ ట్విటర్‌ ఉద్యోగితో ఆయన చేసిన చాట్ చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను వాస్తవ పరిస్థితులేంటో తెలుసుకోకుండా మాట్లాడానని.. అందుకు క్షమించాలని సదరు ఉద్యోగిని మస్క్‌ (Elon Musk) కోరారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?

వ్యయ నియంత్రణలో భాగంగా ట్విటర్‌లో చాలా మంది ఉద్యోగుల్ని మస్క్ (Elon Musk) తొలగించారు. అందులో హరాల్దుర్ థోర్లీఫ్సన్ (ట్విటర్‌లో హల్లీ పేరిట అకౌంట్‌ నిర్వహిస్తున్నారు) అనే వ్యక్తి కూడా తన ఉద్యోగం కోల్పోయారు. అయితే, ఆయన కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. వ్యక్తిగత పనులను కూడా ఆయనకు ఇతరుల సాయం అవసరమవుతుంది. కచ్చితంగా వీల్‌ఛైర్‌ కావాల్సిందే. అయితే, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసి కూడా ఉద్యోగం నుంచి తొలగించడంపై థోర్లీఫ్సన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తనని తొలగించిన తీరు, ఆఫర్‌ చేసిన పరిహార ప్యాకేజీ పైనా ట్విటర్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీనికి స్పందించిన మస్క్‌ (Elon Musk).. కంపెనీకి థోర్లీఫ్సన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చాలా కటువుగా చెప్పారు. పైగా ఇప్పటికే వ్యక్తిగతంగా చాలా ఆస్తులు ఉన్న ఆయన భారీ పరిహారం కోసం డిమాండ్‌ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అయితే, మస్క్‌ (Elon Musk) వ్యాఖ్యలపై థోర్లీఫ్సన్‌ తిరిగి దీటుగా జవాబిచ్చారు. తాను శారీరక లోపం వల్ల కదల్లేకపోతున్నానని పేర్కొన్నారు. కానీ, మస్క్‌ మాత్రం భౌతికంగా దృఢంగా ఉన్నప్పటికీ సెక్యూరిటీ సాయం లేకుండా వాష్‌రూంకి కూడా వెళ్లడంలేదని చెప్పారు. మస్క్‌ (Elon Musk) ఆఫీసులో నిత్యం సెక్యూరిటీతో ఉంటున్నారని ఓ ఉద్యోగి తెలిపినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చివరకు వాష్‌రూంకు వెళ్లే సమయంలోనూ వారు ఆయన వెంట వెళుతున్నారని సమాచారం.

అయితే, థోర్లీఫ్సన్‌ పరిస్థితి తనకు పూర్తిగా తెలియదని మస్క్‌ (Elon Musk) తాజాగా తెలిపారు. ఆయన గురించి చెప్పినవారు తనకు పరిస్థితిని సరిగా వివరించలేకపోయారని పేర్కొన్నారు. అందువల్లే తప్పు దొర్లిందని.. తాను అపార్థం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. థోర్లీఫ్సన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెబుతున్నానని ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని