Elon Musk: మస్క్‌ను చుట్టుముడుతున్న న్యాయ వివాదాలు!

Elon Musk: ట్విటర్‌ నుంచి అనేక మంది ఉద్యోగుల్ని తొలగించిన ఎలాన్‌ మస్క్‌ చుట్టూ ఇప్పుడు న్యాయ వివాదాలు చట్టుముడుతున్నాయి. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

Published : 09 Dec 2022 13:20 IST

వాషింగ్టన్‌ : ట్విటర్‌ (Twitter)ను తన చేతుల్లోకి తీసుకున్న వెంటనే చాలా మంది ఉద్యోగుల్ని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తొలగించారు. దాదాపు 7,500 మందిని ఆయన ఇంటికి పంపించేశారు. వీరిలో చాలా మంది ఇప్పుడు వివిధ కారణాలతో కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), ట్విటర్‌ కంపెనీ నిర్ణయాలను సవాల్‌ చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు.

ప్రపంచ కుబేరుడైన మస్క్‌ (Elon Musk) చట్ట విరుద్ధంగా ఏదైనా చేయొచ్చని భావిస్తున్నారని ప్రముఖ న్యాయవాది శానన్‌ లిస్‌-రియోర్డన్‌ ఆరోపించారు. ఈయన కొంత మంది మాజీ ట్విటర్‌ (Twitter) ఉద్యోగుల తరఫున శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మస్క్‌ రాకమునుపు ట్విటర్‌ (Twitter) తమకు ఇచ్చిన హామీ మేరకు పరిహారం అందడం లేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. మరికొంత మంది మస్క్‌ జారీ చేసిన అల్టిమేటంపై కోర్టుకెక్కారు. సంస్థ పునరుద్ధరణలో భాగంగా కష్టపడి పనిచేయాలని లేదంటే కంపెనీ నుంచి నిష్క్రమించాలని మస్క్‌ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన బలవంతంగా తమ నుంచి అనుమతి తీసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

మస్క్‌ (Elon Musk) ఉద్యోగులను తొలగించిన విధానం కాలిఫోర్నియా చట్టాలకు విరుద్ధంగా ఉందని న్యాయవాదులు తెలిపారు. పరిహారం నిరాకరించడం, కనీసం 60 రోజుల ముందు ఉద్వాసనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం వంటి నిబంధనల్ని మస్క్‌ తుంగలో తొక్కారని ఆరోపించారు. మరోవైపు ఇటీవల ఉద్యోగులు సంస్థ కోసం అదనపు సమయం కేటాయిస్తున్నారని.. వారికోసం శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలోనే పడక గదులను ఏర్పాటు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపైనా కొంత మంది కోర్టును ఆశ్రయించారు.

ఉద్యోగుల కష్టనష్టాలు, వారి బాగోగులపై ఆరా తీయకుండానే ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ను రద్దు చేయడంపైనా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల మస్క్‌ వివక్షాపూరితంగా వ్యవహరించినట్లేనని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇలా మస్క్‌, ట్విటర్‌ (Twitter)పై కోర్టు కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో ఉన్న ట్విటర్‌ (Twitter)కు ఇవి మరింత భారంగా మారే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులతో మస్క్‌ ఒప్పందం కుదుర్చుకోవాల్సి రావొచ్చని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదా దీర్ఘకాలం న్యాయస్థానాలు చుట్టూ తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు. చివరగా వారందరినీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని దీర్ఘకాలం ఉపాధి కల్పించే ప్రత్యామ్నాయాన్నీ మస్క్‌ పరిశీలించొచ్చని అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని