Meta Revenue: మెటా ఆదాయంలో తగ్గుదల.. ఇదే తొలిసారి..!

సామాజిక దిగ్గజాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా ఆదాయంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో తగ్గుదల నమోదైంది...

Updated : 28 Jul 2022 19:28 IST

వాషింగ్టన్‌: సామాజిక మాధ్యమాల దిగ్గజాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా ఆదాయంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో తగ్గుదల నమోదైంది. కంపెనీ చరిత్రలో వార్షిక ప్రాతిపదికన ఓ త్రైమాసికంలో ఆదాయం పడిపోవడం ఇదే తొలిసారి. మెటా రెవెన్యూ ఒక శాతం కుంగి 28.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. గత కొన్నేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న కంపెనీ వృద్ధి బహుశా గరిష్ఠ స్థాయిలకు చేరి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

గ్లోబల్‌ యాడ్ మార్కెట్‌లో 20 శాతం వాటా ఉన్న మెటా.. రానున్న నెలల్లోనూ యాడ్‌ రెవెన్యూ మరింత తగ్గనుందని ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ-కామర్స్‌ సంస్థలు తమ ప్రకటనల వ్యయాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని తెలిపింది. ఫలితంగా కొవిడ్‌ లాక్‌డౌన్‌ల సమయంలో గరిష్ఠాలకు చేరిన యాడ్‌ వ్యయాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరోవైపు ఉద్యోగ నియామకాలను సైతం వచ్చే ఏడాది పాటు క్రమంగా తగ్గిస్తామని మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. ఫలితంగా రెవెన్యూలు పడిపోయిన నేపథ్యంలో వర్చువల్‌ రియాలిటీ ప్లాట్‌ఫామ్‌, హొరైజాన్‌ వంటి కొత్త ప్రాజెక్టుల్లోకి పెట్టుబడులు దెబ్బతినకుండా ఉంటాయని వివరించారు. చిన్నపాటి ఆర్థిక అస్థిరతలకే వేగంగా స్పందించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఎక్కువగా ఆధారపడడమే మెటా ఆదాయంలో తగ్గుదలకు కారణమని ప్రముఖ టెక్‌ రీసెర్చర్‌ నిఖిల్‌ లాయ్‌ తెలిపారు.

ఫేస్‌బుక్‌ యూజర్ల సంఖ్యలో తొలిసారి తగ్గుదల నమోదైందని ఈ ఏడాది ఆరంభంలో మెటా ప్రకటించింది. దీంతో యూజర్లకు వీడియోల సిఫార్సుల విషయంలో ఆల్గారిథమ్‌లో టిక్‌టిక్‌ తరహాలో మార్పులు చేసింది. ఫాలోయింగ్‌ లిస్ట్‌లో లేకపోయినప్పటికీ.. ట్రెండింగ్‌ వీడియోలు వినియోగదారులకు కనిపించేలా మార్పులు చేశారు. దీనిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, రోజువారీ యూజర్ల సంఖ్యను పెంచుకునే విషయంలో మాత్రం ఇది కంపెనీకి ఉపయోగకరంగా మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. యాపిల్‌ ప్రైవసీ సెట్టింగుల్లో మార్పులు చేయడం కూడా కంపెనీ యాడ్లపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.

లాభాలు పడిపోవడంపై జుకర్‌బర్గ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో ఊహించినదానికంటే నెమ్మదిగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే సమీప భవిష్యత్తులో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందన్నారు. అయినప్పటికీ.. దీర్ఘకాలంలో తమ ప్రణాళికలు దెబ్బతినకుండా పెట్టుబడులను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

టెక్నాలజీ కంపెనీల విసయంలో మెటా ఒక్కటే కాదు.. గూగుల్‌, యూట్యూబ్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఆదాయ వృద్ధి సైతం తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితే దీనికి కారణమని వివరించింది. ట్విటర్‌, స్నాప్‌ సైతం తమ ఆదాయాల్లో తగ్గుదలను నివేదించాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts