గ్రాసిమ్‌ లాభంలో 13% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర లాభం రూ.2,758.75 కోట్లుగా నమోదైంది.

Published : 13 Aug 2022 02:18 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర లాభం రూ.2,758.75 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.2,447.97 కోట్లతో పోలిస్తే ఇది 12.7 శాతం అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.19,919.40 కోట్ల నుంచి 40.77 శాతం పెరిగి రూ.28,041.54 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.16,853.28 కోట్ల నుంచి రూ.24,393.95 కోట్లకు పెరిగాయి. ఏకీకృత-స్టాండలోన్‌ పద్ధతిలోనూ రికార్డు స్థాయి ఎబిటా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. స్టాండలోన్‌ పద్ధతిలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌రూ.7,253.04 కోట్ల ఆదాయంపై రూ.808.56 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అనుబంధ సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఆదాయాలు రూ.11,829.82 కోట్ల నుంచి రూ.15,163.93 కోట్లకు చేరాయి. రసాయనాలు, జౌళి, ఆర్థిక సేవలు తదితర విభాగాలూ రాణించాయి. రంగుల వ్యాపారంలో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ఈ ఏడాది మేలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


హీరో మోటోకార్ప్‌ లాభం రెట్టింపు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌లో హీరో మోటోకార్ప్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.585.58 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.256.46 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే అధికం. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.5,502.80 కోట్ల నుంచి రూ.8,447.54 కోట్లకు వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల విక్రయాలు 36 శాతం పెరిగి 13.90 లక్షలుగా నమోదయ్యాయి. వ్యయ నియంత్రణ చర్యలకు తోడు, వాహన ధరలు పెంచడం, కొత్త మోడళ్ల విడుదలతో కంపెనీ మార్జిన్‌లను నిలబెట్టుకున్నట్లు సంస్థ వివరించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఎదురైన సరఫరా వ్యవస్థ ఆటంకాలు, ఇతర ప్రతికూలతలను తట్టుకున్నామని తెలిపింది. మొత్తం వ్యయాలు రూ.5,169.4 కోట్ల నుంచి రూ.7,692.93 కోట్లకు పెరిగాయి. ముడివస్తువుల వ్యయాలు రూ.4,174.94 కోట్ల నుంచి రూ.6,095.68 కోట్లకు చేరాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా ప్రారంభించామని, మార్చి త్రైమాసికంతో పాటు గతేడాది జూన్‌ త్రైమాసికంతో పోల్చినా, మెరుగైన వృద్ధి సాధించామని హీరో మోటోకార్ప్‌ సీఎఫ్‌ఓ నిరంజన్‌ గుప్తా అన్నారు. పండగల సీజన్‌ ప్రారంభం కావడంతో ద్విచక్రవాహనాలకు గిరాకీ పెరగొచ్చని, సాధారణ వర్షపాతం వంటి ఇతర అంశాలు ఇందుకు కలిసిరావొచ్చని అంచనా వేశారు. పండగల సీజన్‌లో విద్యుత్‌ వాహనాన్ని విడుదల చేయడానికి చూస్తున్నట్లు వెల్లడించారు.


ప్రయాణికుల వాహన సరఫరాలు 11% పెరిగాయ్‌: సియామ్‌

దిల్లీ: సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడడంతో జులైలో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల (పీవీ) సరఫరా 11 శాతం పెరిగిందని వాహన డీలర్ల సంఘం సియామ్‌ పేర్కొంది. 2021 జులైలో 2,64,442 పీవీల సరఫరా జరగ్గా.. గత నెలలో ఇవి 2,93,865కు పెరిగాయి. ప్రయాణికుల కార్ల సరఫరా 1,30,080 నుంచి 10% పెరిగి 1,43,522కు చేరాయి. యుటిలిటీ వాహనాల టోకు అమ్మకాలు 11% వృద్ధితో 1,37,104గా నమోదయ్యాయి. వ్యాన్ల సరఫరాలు 10,305 నుంచి 13,239కి చేరాయి. మొత్తం ద్విచక్ర వాహనాల సరఫరా 10% హెచ్చి 13,81,303కు పెరిగాయి. స్కూటర్ల టోకు అమ్మకాలు 3,73,695 నుంచి 4,79,159కు చేరాయి. మోటార్‌సైకిళ్ల టోకు అమ్మకాలు 8,37,166 నుంచి 8,70,028కు, త్రిచక్ర వాహనాల సరఫరా 18,132 నుంచి 31,324కు పెరిగింది.


యూపీఐతో ఎన్‌పీఎస్‌ చెల్లింపులు

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌), అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై)లకు చెల్లించే మొత్తాలను యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జమ చేసేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ వీలు కల్పించింది. ఇప్పటివరకూ ఈ పథకాలకు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ పద్ధతుల్లోనే నిధులు జమ చేసే వీలుండేది. దీనికి తోడుగా నేరుగా ఈ పథకాల్లో నిధులు జమ చేసే చందాదారుల కోసం యూపీఐ ఆధారిత వ్యవస్థనూ అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ శుక్రవారం వెల్లడించింది. చందాదారులు తమ 15అంకెల వర్చువల్‌ అకౌంట్‌ సంఖ్య ద్వారా ఈ చెల్లింపులు జరపొచ్చు. రోజూ ఉదయం 9.30 గంటల్లోపు వచ్చే పెట్టుబడులను అదే రోజు చెల్లించినట్లుగా పరిగణిస్తామని వెల్లడించింది.


బ్రిటన్‌కూ మాంద్యం భయాలు

ఏప్రిల్‌-జూన్‌ జీడీపీలో క్షీణత

లండన్‌: బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఏప్రిల్‌-జూన్‌లో దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) క్షీణించడమే ఇందుకు కారణం. రాబోయే త్రైమాసికాలపై భయాలను పెంచింది. జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్‌ త్రైమాసికంలో బ్రిటన్‌ జీడీపీ 0.1 శాతం మేర తగ్గింది. జనవరి-మార్చిలో 0.8 శాతం వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే. చాలా వరకు రిటైలర్లకు జూన్‌ త్రైమాసికం కఠినంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. జీవన వ్యయాలు పెరగడం; ద్రవ్యోల్బణం ప్రస్తుత స్థాయి 9.4 శాతం నుంచి మరింత పెరిగేందుకు అవకాశం ఉండడం వల్ల ఈ ఏడాది చివర్లో దేశం మాంద్యంలోకి వెళ్లవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ అంచనా వేసింది. ఉక్రెయిన్‌ పరిణామాల నేపథ్యంలో సగటు బ్రిటిషర్‌ ఇంధన వ్యయాలు ఈ ఏడాది 50 శాతం  పెరిగాయి. బ్రిటన్‌కు కొత్త ప్రధాని సెప్టెంబరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని