ఆహార సేవలకు భారీ గిరాకీ

భారత ఆహార సేవల విపణి 2028 నాటికి 79.65 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.51 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని ఆహార సేవలు, రెస్టారెంట్ల వ్యాపారం 2022-23 నివేదిక వెల్లడించింది.

Published : 22 Nov 2022 02:08 IST

2028 నాటికి 79.65 బి.డాలర్లకు విపణి: నివేదిక

దిల్లీ: భారత ఆహార సేవల విపణి 2028 నాటికి 79.65 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.51 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని ఆహార సేవలు, రెస్టారెంట్ల వ్యాపారం 2022-23 నివేదిక వెల్లడించింది. 2022లో 41.1 బి.డాలర్లుగా ఉన్న ఈ విపణి 11.19 శాతం వార్షిక సంచిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌)ను సాధిస్తుందని తెలిపింది. ఫ్రాన్‌కార్ప్‌, రెస్టారెంట్‌ఇండియా.ఇన్‌లు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. నివేదిక ప్రకారం..

* కొవిడ్‌-19 సమయంలో సుమారు 20 లక్షల మందికి పైగా ఈ రంగంలో ఉద్యోగాలు కోల్పోయారు. అయితే 2025 నాటికి ఉపాధి అవకాశాలు మళ్లీ కోటికి చేరతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

* రెస్టారెంట్లు, ఆహార సేవల విపణి దేశంలో రెండు విభాగాలుగా ఉంది. ఇందులో వ్యవస్థీకృతం కాని విభాగమే అధిక వాటా కలిగి ఉంది. వ్యవస్థీకృత విభాగం కూడా 2014-2020 మధ్య బలమైన వృద్ధి రేటును నమోదు చేసింది.

* దేశంలో క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్ల (క్యూఎస్‌ఆర్‌) విపణి ఈ ఏడాది 690.21 మిలియన్‌ డాలర్లు ఉండగా, 2027 నాటికి 9.15 సీఏజీఆర్‌తో 1069.3 మి.డాలర్లకు చేరుకుంటుంది.

* 2020-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య క్యూఎస్‌ఆర్‌ చైన్‌ మార్కెట్‌ 23 శాతం సీఏజీఆర్‌తో అత్యధిక వృద్ధి సాధించే ఉప విభాగంగా నిలవనుంది. చైన్‌ మార్కెట్‌లోనే కాకుండా పూర్తి ఆహార సేవల విపణిలో ఇది అధిక వృద్ధిని నమోదు చేస్తుంది.

* మెక్‌డొనాల్డ్స్‌, బర్గర్‌ కింగ్‌, డొమినోస్‌ వంటి పెద్ద ఆహార సేవల చైన్‌ వ్యాపారాలు దేశంలోని చిన్న పట్టణాలకు కూడా వ్యాపిస్తూ యువతరాన్ని ఆకట్టుకుంటుండటంతో గిరాకీ బాగా పెరుగుతోంది.

* ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని మధ్య స్థాయి ఆదాయ కుటుంబాలు ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్లపై గత రెండేళ్లలో వ్యయాల్ని రూ.2,500 నుంచి రూ.5,400కు పెంచాయి. అంటే 108 శాతం వృద్ధి నమోదైంది.

* 2021 నాటికి ఆహార సేవల రంగంలో 73 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కొవిడ్‌-19 సమయంలో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2025 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య కోటికి చేరొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది.

* ద్రవ్యోల్బణం ప్రభావంతో సుమారు 51 శాతం మంది వినియోగదార్లు తక్కువగా ఆర్డర్లు చేస్తున్నారు. 40 శాతం మంది తక్కువ ఆహార పదార్థాలను లేదా తక్కువ ధర కలిగిన వాటిని ఆర్డర్‌ చేస్తున్నారు.

* 2021లో 96 శాతం మంది ఆపరేటర్లు కీలకమైన ఆహారం లేదా పానీయాల కొరత ఎదుర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ ఇది కొనసాగొచ్చు. ఈ రంగాన్ని ప్రస్తుతం సరఫరా ఆలస్యం, కీలక ఆహార పదార్థాల కొరత వంటివి ఇబ్బంది పెడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని